సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటల పాటు ఆలస్యం కావడంతో స్వాములు నిరసనకు దిగారు.
వివరాల ప్రకారం.. ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సాయంత్రమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరాకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నట్టు తెలిపారు. విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో విమానాల రద్దుతో పలు విమాన సంస్థలు ప్రయాణీకులను దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టికెట్ ధరలను పెంచేశాయి. ఏకంగా 40వేలు ఛార్జ్ చేస్తున్నాయి. ఇక, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 80కిపైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. దీంతో, ఇండిగో తీరుపై ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. గురువారం ఉదయం కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కేరళకు వెళ్లే ఇండిగో విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా విమానం రద్దు చేస్తారు?” అంటూ భక్తులు విమానాశ్రయ అధికారులను ప్రశ్నించారు. విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేక విమానాన్ని నడపాలని భక్తులు డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అసౌకర్యం పెరగడంతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది.


