బందీల్లో ఒకరు యాదాద్రి జిల్లావాసి, మరొకరు ఏపీ యువకుడు
ఆలస్యంగా వెలుగులోకి ఘటన.. ఇరు కుటుంబాల్లో ఆందోళన
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఉపాధి కోసం ఆఫ్రికా దేశమైన మాలికి వెళ్లిన తెలంగాణ, ఏపీకి చెందిన ఇద్దరు యువకులను జమాత్ నుస్రత్ అల్–ఇస్లామ్ వల్–ముస్లిమీన్ (జేఎన్‌ఐఎం) సంస్థకు చెందిన తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస ప్రవీణ్ (23), ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని పొదరళ్లపల్లికి చెందిన రామచంద్ర (25) గతేడాది హైదరాబాద్‌కు చెందిన ఓ బోర్‌వెల్ కంపెనీ పనిపై డ్రిల్లర్లుగా మాలి దేశంలోని కోబ్రి సమీపంలో పనిచేస్తున్నారు. గత నెల 23న వారు పని ముగించుకొని వస్తుండగా సాయుధులైన జేఎన్‌ఎంఐ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.
వారి ఫోన్లను స్వా«దీనం చేసుకొని స్విచ్ఛాప్ చేయడంతో కిడ్నాప్ సమాచారం ఆలస్యంగా భారత ఎంబసీతోపాటు వారి కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. పనుల సీజన్ పూర్తయ్యాక వస్తానని కిడ్నాప్‌నకు ఒకరోజు ముందు తన కొడుకు ఫోన్ చేసి చెప్పాడని ప్రవీణ్ తండ్రి జంగయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన చెందారు. మరోవైపు బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు మాలిలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
తీవ్రవాదుల డిమాండ్లను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఎంబీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అల్‌కాయిదాకు చెందిన జేఎన్‌ఐఎం.. సహెల్ ప్రాంతంలో (మాలి, నైజర్ మొదలైన దేశాలు) మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఆర్థిక యుద్ధం‘వ్యూహంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటోంది. గత ఆరు నెలల్లో (మే నుంచి అక్టోబర్ వరకు) 22 మంది విదేశీయులను బంధించింది. అందులో కొందరు విడుదలవగా మరికొందరు ఇంకా తీవ్రవాదుల చెరలోనే ఉన్నారు. బందీల విడుదలకు తీవ్రవాదులు ఆర్థిక డిమాండ్లు పెడుతున్నారు.


