పాఠశాల నుంచి తీసుకెళ్లిన యువకుడు, యువతి
రెండోరోజు తీసుకొచ్చి పాఠశాల వద్ద వదిలేసిన యువకుడు
నిందితుడు టీడీపీ కార్యకర్త.. ముమ్మడివరం ఎమ్మెల్యే అనుచరుడు
కోనసీమ జిల్లాలో కలకలం
అమలాపురం టౌన్/ముమ్మిడివరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శివారు ఠాణేలంకలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ పాఠశాల నుంచి పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి, మరుసటిరోజు వదిలేయడం కలకలం సృష్టించింది. ఆ బాలికను తీసుకెళ్లిన యువకుడు టీడీపీ కార్యకర్త, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు అనుచరుడు. బాలిక బంధువుల కథనం ప్రకారం.. జిల్లాలోని కాట్రేనికోన మండలానికి చెందిన బాలిక ఈ పాఠశాలలో చదువుకుంటోంది. పల్లంకుర్రు శివారు వఢ్డివారిపేటకు చెందిన టీడీపీ కార్యకర్త మోకా గిరిబాబు బుధవారం ఆ పాఠశాల వసతి గృహానికి వెళ్లి బాలిక నాయనమ్మకు ఒంట్లో బాగోలేదని, బాలికను తనవెంట పంపించాలని కోరాడు. దీనికి అక్కడి సిబ్బంది నిరాకరించారు.
మరికొంతసేపటికి ఆ బాలిక మేనమామ భార్యనని చెప్పి ఓ మహిళ వసతి గృహానికి వచ్చి బాలికను తీసుకెళ్లింది. బుధవారం సాయంత్రం వరకు ఆ బాలిక తిరిగి పాఠశాలకు చేరలేదు. దీంతో ప్రిన్సిపాల్ డి.శారద బాలిక నాయనమ్మకు ఫోన్ చేశారు. మనవరాలి కోసం తాను ఎవరినీ పంపించలేదని, బాలిక ఇంటికి రాలేదని ఆమె చెప్పడంతో ప్రిన్సిపాల్ శారద ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం డీఎస్పీ టీఎస్‌కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్‌కుమార్, ఎస్‌ఐ డి.జ్వాలాసాగర్ బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాలికను కిడ్నాప్ చేసింది మోకా గిరిబాబు అని, అతడి మరదలు అర్చన సహకరించిందని గుర్తించారు.
ఎమ్మెల్యే సుబ్బరాజుతో నిందితుడు గిరిబాబు ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నిందితుడు ఆ బాలికను తీసుకొచ్చి పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు. బాలిక నాయనమ్మ, బంధువులు గురువారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. తాము గురుకుల పాఠశాలకు వెళ్లాలంటే సవాలక్ష ఆంక్షలు చెబుతారని, అటువంటిది బయటి వ్యక్తులతో ఎలా పంపించారని ప్రశ్నించారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జ్వాలాసాగర్ తెలిపారు.


