ఇప్పుడు మళ్లీ 53 వేల ఎకరాలా?
రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై వైఎస్ జగన్
ఇంటర్నేషనల్ రాజధాని అంటూ బాహుబలి సెట్టింగ్స్ చూపారు
అన్నీపోనూ మిగిలిన 8 వేల ఎకరాల్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ రాజధాని అన్నారు
మౌలిక సదుపాయాలకే రూ.లక్ష కోట్లు కావాలని డీపీఆర్ ఇచ్చారు
ఇప్పుడు అధికారంలోకి రాగానే స్కామ్‌లపై దృష్టి
ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి?
చ.అ. నిర్మాణం రూ.4 వేలకు బదులు రూ.10 వేలకు ఎలా కాంట్రాక్ట్ ఇవ్వాలి?
కిలోమీటర్ రోడ్డుకు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి?
ఇలా అన్నీ స్కాములే కాబట్టి పనులు నిరంతరం జరిగేలా స్కెచ్
ఈయన, ఈయన బినామీలు పూలింగ్‌కు ముందుగానే ల్యాండ్ కొంటారు..
తన బినామీలకు మాత్రం మంచి చోట ప్లాట్లు.. మిగిలిన వాళ్లకు వేరే చోట
వేరే వాళ్లకు ఇచ్చిన ప్రాంతం ఎప్పటికీ అభివృద్ధి జరగదు.. వారంతా గాలికే
అధికారంలో ఉంటే చంద్రబాబుకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి? నేషనల్ హైవేలు కిలోమీటర్‌కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. అందుకే ఇలా అన్నీ స్కాములు. - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి గతంలో తీసుకున్న 53 వేల ఎకరాలకే దిక్కులేదు.. ఇప్పుడు రైతుల నుంచి ఇంకో 53 వేల ఎకరాలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు వెనుకాడటం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పారు. రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అమరావతి గురించి మీరే చెప్పాలి.
ఇంతకు ముందు అంతా చంద్రబాబు ఏమన్నాడు? 2014–19 మధ్య 53 వేల ఎకరాలు తీసుకుంటూ అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని.. సింగపూర్, గింగపూర్ ఎక్కడికి పోవాలో.. మన దగ్గర నుంచే ఏదైనా కానీ.. మన రాజధానిని చూసి వాళ్లు కాపీ కొట్టే పరిస్థితుల్లోకి దీన్ని బిల్డప్ చేస్తున్నానని మనకు బాహుబలి సెట్టింగ్స్ చూపించారు. ఆ 53 వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత?
రాజధాని కట్టడం కథ దేవుడెరుగు.. ఆ 53 వేల ఎకరాల్లో రోడ్లు వేయడానికి, కరెంటు ఇవ్వడానికి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి.. వీటికే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని తానే డీపీఆర్ ఇచ్చాడు. అంటే ఆ 53 వేల ఎకరాలకే లక్ష కోట్ల రూపాయలు కావాలని సినిమా చూపిస్తూ రూ.5 వేల కోట్లు పెట్టాడు. మళ్లీ ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఆ 53 వేల ఎకరాలు సరిపోదు అంటున్నాడు.’ అని చెప్పారు.
స్కాముల కోసమే అది చాలదంటున్నారు
‘ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. 8 వేల ఎకరాలు మిగిలిందని, దాంతోనే రాజధాని అయిపోతుందని చెప్పాడు. మళ్లీ ఈ రోజు అది చాలదంటున్నాడు. అధికారంలో ఉంటే ఆయనకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి.
నేషనల్ హైవేలు కిలోమీటర్‌కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? ఇలా అన్నీ స్కాములే కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ జరిగేది ఒక్కటే... ఈయన, ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు. కొన్న తర్వాత ఆ పక్కన భూములను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటారు.
ఆ తర్వాత తన బినామీలకు మాత్రం ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోట ఇచ్చుకుంటాడు. మిగిలిన వాళ్లకు ప్లాట్లు వేరే చోట ఇస్తాడు. అక్కడ ఎప్పటికీ అభివృద్ధి జరగదు. అంటే మిగతా వాళ్లు గాలికి పోతారు. వేసే రోడ్లు ఏవో వీళ్ల మనుషులకు ప్లాట్లు ఇచ్చిన చోట వేసుకుంటారు’ అని చెప్పారు.
చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనపై ఉన్న అవినీతి కేసులు తీసేయించుకుంటున్నారన్న ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాల ద్వారానే పోరాటం చేయగలుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే.. పై నుంచి దేవుడు చూస్తుంటాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుంటారు. దేవుడు, ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి’ జగన్ అన్నారు.


