అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు
తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు..
రెడ్‌బుక్ పాలనలో టీడీపీ వాళ్లు కాకుండా ఇంకెవరైనా కల్తీ లిక్కర్ తయారు చేసి విక్రయించగలరా?
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం
తనపై ఉన్న లిక్కర్ కేసును నీరుగార్చేందుకు, కొట్టేయించేందుకు... వైఎస్సార్‌సీపీ పాలనలో తెచ్చిన మద్యం పాలసీని తప్పుగా చూపిస్తూ లేని లిక్కర్ స్కామ్‌ను చంద్రబాబు సృష్టించారు. ఇక రాష్ట్రంలో కుటీర పరిశ్రమల్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టింది టీడీపీ వాళ్లే. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్‌లు. రెడ్‌బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా?
మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ అసభ్య పదజాలంతో తనను లైంగికంగా వేధిస్తున్నాడని మండలాఫీసు అటెండర్ అయిన ఒంటరి మహిళ ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లినా, వాట్సాప్ మెసేజ్‌లు చూపించినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధ్యత గల ప్రభుత్వమైతే గలీజ్ మెసేజ్‌లు పెట్టిన పీఏను లోపలేయాలి.
–వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమ కేసులతో నిర్బంధిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని మండిపడ్డారు.
మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... గత 19 నెలలుగా వీళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, ఆముదాలవలస, నెల్లూరు, పాలకొల్లు, రేపల్లె... ఇలా అన్నిచోట్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు వీళ్లు పెట్టినవే. (రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులతో కల్తీ మద్యం ఫ్యాక్టరీల నిర్వాహకులు దిగిన ఫొటోలు, సీజ్ చేసిన కల్తీ లిక్కర్ బాటిళ్ల ఫొటోలను చూపించారు) కల్తీ మద్యం మీద నచ్చిన బ్రాండ్ పేరుతో లేబుళ్లు వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ చానల్ కూడా వాళ్లదే.
తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుంటూ ఫొటో దిగారు. ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డ ఆయన పార్టనర్ జనార్దనరావు, సురేంద్రనాయుడులు చంద్రబాబు, లోకేశ్‌తో ఫొటోలు దిగారు. అనకాపల్లి జిల్లా పరవాడలో స్పీకర్ అయ్యన్నపాత్రుడితో, మంత్రి లోకేశ్‌తో ఇలా పలుకుబడి కలిగిన టీడీపీ నేతలతో కల్తీ లిక్కర్ మాఫియా నడుపుతున్నవాళ్లు ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్‌లు.
రెడ్‌బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా?. కానీ, ములకలచెరువు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను తీసుకుపోయారు. కల్తీ చేసిన జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి, పీఏ రాజేష్‌లను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వీళ్ల ప్రభుత్వంలో అన్నీ వీళ్లే చేస్తూ, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో... జోగి రమేష్ కల్తీ చేయిస్తున్నారంటున్నారు.
ఇదెక్కడి అన్యాయం. దొంగే దొంగ దొంగ అంటున్నాడు. ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? జోగి రమేష్, ఆయన తమ్ముడిని అరెస్ట్ చేస్తే... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న రమేష్ కుమారుడిపై కేసులు పెడుతున్నారు.
మిథున్‌ను ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ఆశ్చర్యపడే పరిస్థితి
మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌రెడ్డితోపాటు ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతోమందిని జైలుకు పంపించారు. అసలు మిథున్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో? ఆయనకు ఏం సంబంధమో? అని జడ్జి కూడా ఆశ్చర్యపడి తీర్పు రాసే పరిస్థితి.
కృష్ణమోహన్‌రెడ్డి, ధనంజయరెడ్డి, ఎంఎన్‌సీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డిలను నిర్బంధించారు. రూ.11 కోట్లు దొరికినట్లుగా చూపిస్తున్నారు. ఆ నోట్లపై ఉన్న నంబర్ల ద్వారా ఏ బ్యాంకులో డ్రా చేశారో? ఎప్పుడు డ్రా చేశారో? చెప్పాలని బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. రెడ్ హ్యాండెడ్‌గా డబ్బు దొరికితే పక్కనపెడతారు కదా? కానీ, వీళ్లు అన్నీ కలిపేశాం అంటున్నారు. ఆ డబ్బు బయటపడితే ఇంజనీరింగ్ కాలేజీవని తెలుస్తుందని, అది తెలియకుండా లిక్కర్ అని బ్యాండ్ వేసి రూ.11 కోట్లు వీళ్లే పెట్టి కేసులు బిల్డ్ చేస్తున్నారు.
వీళ్లు ఏ స్థాయికి పోతున్నారంటే... భాస్కర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, పినిపె శ్రీకాంత్‌పై తప్పుడు కేసులు పెట్టారు. సాక్ష్యాలు సృష్టించి, అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపైనా గంజాయి కేసులు పెడుతున్నారు. విశాఖలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడిపై గంజాయి కేసు పెట్టారు.
రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామని ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. కానీ, ఇంటి దగ్గర్లోని టిఫిన్ సెంటర్‌కు వెళ్తుండగా, మద్దిలపాలెం వద్ద పట్టుకున్నట్లు, స్టేషన్‌కు తరలిస్తున్నట్లు సీసీకెమెరాలో రికార్డైంది. అతడి బైక్‌ను 14 కి.మీ. దూరంలో ఉన్న రైల్వే న్యూకాలనీకి తీసుకెళ్లారు. ఆ బైక్‌కు ఉన్న జీపీఎస్ ద్వారా ఈ విషయం తెలిసింది. పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి తీసుకువెళ్లి గంజాయి దొరికిందని చెప్పి కొండారెడ్డిని అరెస్ట్ చేశారు.
ఇక బాధ్యత గల ప్రభుత్వమైతే సాలూరులో ఒంటరి మహిళకు గలీజ్ మెసేజ్‌లు పెట్టిన మంత్రి పీఏను లోపలేయాలి. కానీ, కేసులు పెట్టకపోగా, బాధితురాలు దిక్కుతోచక జర్నలిస్టులకు చెబితే, ఆ వార్త రాసిన ‘సాక్షి’ విలేకరి మీద కేసులు పెట్టారు. ఇది రెడ్‌బుక్ పాలన వెర్రితలలు వేస్తోందనడానికి నిదర్శనం.
పిన్నెల్లిపై 16 తప్పుడు కేసులు
మా పార్టీ మాచర్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డిని తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. టీడీపీకి చెందినవారి గ్రూపుల తగాదాలలో వాళ్లూవాళ్లూ చంపుకొంటే మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసులు పెట్టారు. ఆ ఘటనపై మీడియా సాక్షిగా టీడీపీ హయాంలో... పల్నాడు జిల్లా అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు ఏమన్నారో మీరే చూడండి. (ఎస్పీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించారు) ‘గుండ్లపాడు గ్రామానికి చెందిన జె.వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య, జె.కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోతో ఢీకొట్టి చంపారు.
చనిపోయినవారికి తోట చంద్రయ్య కుటుంబంతో ఎలాంటి బంధుత్వం లేదు. ఇద్దరూ టీడీపీ వారే’ అని ఎస్పీ చెప్పారు. అంతేకాదు హతులు, హంతకులు టీడీపీవారేనని ఏకంగా ట్వీట్ చేశారు. ఈనాడులో కూడా అదే రాశారు. కానీ, ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడిని అరెస్టు చేశారు. ఎక్కడన్నా న్యాయం, ధర్మం ఉందా? ఇలాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. పిన్నెల్లిపై ఈ 19 నెలల్లో 16 తప్పుడు కేసుల పెట్టారు. ఆయన్ను ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్‌ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో ఉంచారు.


