లోక్‌సభలో మరోసారి పరోక్షంగా తేల్చిచెప్పిన కేంద్ర జల్‌శక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్
సాక్షి, అమరావతి: పోలవరం జలాశయం కాదు.. కేవలం బ్యారేజ్ మాత్రమేనని గురువారం లోక్‌సభలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లని తెలిపారు. సకాలంలో ప్రాజెక్టును పూరి చేయడం కోసం రూ.12,157 కోట్లను అదనపు సహాయం కింద కేంద్రం ఇస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.20,658 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2019లో ఆమోదించింది. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచి్చన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠమట్టంలో నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తిచేయాలంటే ఆ మేరకు నిధులు అవసరం. కానీ.. పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వ కనీసమట్టం (ఎండీడీఎల్) 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ప్రాజెక్టును పూర్తిచేసేలా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మేరకు పనులు పూర్తిచేయడానికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లుగా తేల్చింది.
ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులు పోను.. ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను విడుదల చేస్తామని పేర్కొంది. ప్రాజెక్టును 2027 మార్చిలోగా పూర్తిచేయాలని షరతు పెట్టింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీటినిల్వను పరిమితం చేస్తే.. 115.4 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయవచ్చు. కానీ.. ఆ స్థాయిలో నీటిని నిల్వచేస్తే కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, కేవలం 1.98 లక్షల ఎకరాలకే.. అదీ గోదావరి వరదల సమయంలో మాత్రమే నీటిని అందించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వచేస్తే పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా డెల్టాలో 13.8 లక్షలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలను స్థీరికరించడంతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.8 టీఎంసీలను సరఫరా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ.. పోలవరంలో నీటినిల్వ ఎత్తును 41.15 మీటర్లకే కేంద్ర కేబినెట్ పరిమితం చేస్తూ తీర్మానం చేసినా ఆ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రులు నోరుమెదపలేదు.
ఇక లోక్‌సభలో గురువారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లేనని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా తేల్చిచెప్పినా టీడీపీ ఎంపీలు మౌనం దాల్చారు. అంటే.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తువరకే నీటినిల్వను పరిమితం చేస్తూ ప్రాజెక్టును పూర్తిచేయడానికి నిధులు ఇస్తున్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసినట్లు అర్థమవుతోంది. నీటినిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తే.. పోలవరం రిజర్వాయర్ కానేకాదని.. కేవలం బ్యారేజీగా మిగిలిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు.
2005లోనే గోదావరి–కృష్ణా అనుసంధానం
ఇక పోలవరం (గోదావరి)–విజయవాడ(కృష్ణా) అనుసంధానాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ 1999లో ప్రతిపాదించిందని.. దాన్ని 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. పోలవరం కుడికాలువ ద్వారా 4,666 మిలియన్ క్యూబిక్ లీటర్ల (164.82 టీఎంసీలు) గోదావరి–కృష్ణా అనుసంధానం చేపట్టందని వివరించారు.
పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పీఎఫ్‌ఆర్‌ను 2025 మే 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించిందని తెలిపారు. దానిపై బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల అభిప్రాయం కోరామని, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


