సూపర్ 6 పేరిట.. 'సూపర్' మోసం: వైఎస్‌ జగన్‌ | YSRCP President Jagan Mohan Reddy Fire On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సూపర్ 6 పేరిట.. 'సూపర్' మోసం: వైఎస్‌ జగన్‌

Dec 5 2025 2:57 AM | Updated on Dec 5 2025 9:04 AM

YSRCP President Jagan Mohan Reddy Fire On Chandrababu Naidu

సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ సక్రమంగా ఎక్కడ అమలు చేశారు?

సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేలు చొప్పున పింఛన్‌ ఎక్కడిస్తున్నారు?

ఈ రెండేళ్లలో రూ.96 వేలు ఎంత మందికి పంపిణీ చేశారు? ఇది కూడా మోసం కాదా?

రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు

రెండేళ్లలో రూ.40 వేలకుగాను రూ.10 వేలే ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టడం మోసం కాదా?

తల్లికి వందనం కింద రెండేళ్లకు గాను ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఎక్కడిచ్చారు?

తొలి ఏడాది ఎగ్గొట్టి.. రెండో ఏడాది అరకొరగా ఇవ్వడం మోసం కాదా?

రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆంక్షలు పెట్టడం మోసం కాదా?

420 చేష్టలతో ప్రజలను మోసగించి గోబెల్స్‌కు టీచర్, మెంటార్‌లా ప్రచారం

చంద్రబాబుపై చీటింగ్‌ కేసుపెట్టి  లోపల వేయాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలన్నీ అమలు చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధం ఆడేస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లకు సంబంధించిన పాంప్లెట్‌ పేపర్లు, ఎల్లో మీడియా టీవీ ఛానళ్లలో సూపర్‌ సిక్స్‌ విజయవంతం అంటూ ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారని.. చంద్రబాబు గోబెల్స్‌కు టీచర్, మెంటార్‌ లాంటి వాడని ఎద్దేవా చేశారు.

ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను మోసగిస్తూ 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్‌ కేసు పెట్టి లోపల వేయాలని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. అసలు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ల కింద ఏం చేశారో చెప్పాలని, సక్రమంగా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సూపర్‌ హిట్టని ఎలా ప్రచారం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘రాష్ట్రంలో రైతులు పండించిన చీని, అరటి ఎగుమతి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా రైళ్లు నడిపాం. 23 వేల టన్నులు ఉన్న అరటి ఎగుమతులను 2023–24 నాటికి 3 లక్షల టన్నులకు తీసుకెళ్లాం. దళారుల బెడద లేకుండా చేశాం. రవాణా ఖర్చులను 40 శాతం మేర తగ్గించాం. ఈ 19 నెలల పాలనలో రైతుల కోసం మీరేం చేశారు? రైతుల కష్టాలు పట్టవా?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు. రైతుల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటే నిద్రపోతున్నారా.. అని ప్రశి్నంచారు. మిమ్మల్ని సీఎం చేసింది గాడిదలు కాయడానికి కాదు కదా.. అంటూ మండిపడ్డారు.

వ్యవసాయంపై 62 శాతం మంది ఆధారపడిన పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా సాగును పండుగ చేసి.. రైతులను సంతోష పెడితేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందన్నారు. రైతు, రైతు కూలీ సంతోషంగా లేకుంటే రాష్ట్రం ఎదగదని, వెనకడుగు వేయాల్సి వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని చంద్రబాబు దండగలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడాలని.. దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు ఒకసారి చూడండని అందరూ అనాల్సిన దుస్థితి కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఉచిత పంటల బీమాకు మంగళం
ఇటీవల మోంథా తుపాను వచి్చన సమయంలో ఆరీ్టజీఎస్‌ నుంచి చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడూ కంప్యూటర్ల ముందు కూర్చొని పెద్ద బిల్డప్‌ ఇచ్చారు. వీళ్లకు తోడు ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఎలా బిల్డప్‌ ఇచ్చాయంటే.. వీరు తుపాను పీకపట్టి డైవర్ట్‌ చేసినట్టు బిల్డప్‌ ఇచ్చాయి. వీళ్లు కాబట్టే తుపానును ఆపగలిగారన్నట్టుగా ఆకాశానికి ఎత్తారు.  

కానీ, వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. తుపాను కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతుకూ ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. తుపాను ప్రభావం వల్ల 15 లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లితే.. దాన్ని నాలుగైదు లక్షల ఎకరాలకు కుదించారు. వీరికి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. బాబు 19 నెలల పాలనలో ఇప్పటి వరకు 17 ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఆ విపత్తుల కారణంగా రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి.  

ప్రభుత్వం నుంచి 17 విపత్తులకు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1,100 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని ఇవ్వనేలేదు. దీనికి తోడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఉచిత పంటల బీమా కింద రైతు తరఫున కూడా ప్రభుత్వమే ప్రీమి­యం కట్టి.. పంట నష్టపోయిన రైతులకు రూ.7,400 కోట్ల నుంచి రూ.7,800 కోట్ల మేర బీమా పరిహారం అందించాం.  

మా ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు లేకుండా చేయడంతో బీమా పరిహారం రాకుండా పోయింది. రాష్ట్రంలో ఖరీఫ్‌ సమయంలో 84 లక్షల మంది రైతులు, కౌలు రైతులు పంటలు సాగు చేస్తే.. కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్‌ చేయించుకున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? రోజూ చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. నష్టపోయిన రైతులకు ఆ నష్టాన్ని ఎలా పూడుస్తారో ఆ ఉపన్యాసాల్లో ఎక్కడా చెప్పరు.  

రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం కిసాన్‌ కింద కేంద్రం ఇచ్చేది కాకుండానే అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.10 వేలు ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టారు. ఒకవైపు పెట్టుబడి సాయం దక్కలేదు. మరోవైపు మా ప్రభుత్వంలో సీజన్‌ ముగిసే సమయానికి అందే ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా కనిపించకుండా పోయింది. హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్‌ సొమ్ము రాకుండా పోయింది.  

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
ఇన్ని కష్టాల మధ్య రైతు సాగు చేసిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని దుస్థితి చూస్తున్నాం. పోయిన ఏడాది ధాన్యం, పొగాకు, ఉల్లి, టమాట, మామిడి, సజ్జ, చీనీ, మిర్చి.. ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర దక్కలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మోంథా తుపానులో నష్టపోయిన రైతుల నుంచి ధాన్యం కొనేవారు లేరు. 75 కేజీల బస్తాకు ఎంఎస్‌పీ ప్రకారం రూ.1,776 రావాలి. అయితే రూ.1,200, రూ.1,300కు ఇస్తారా? అని దళారులు రైతులను అడుగుతున్నారు. 

ఇంకో పక్క దిత్వా తుపాను పంట కోతల(హార్వెస్టింగ్‌) సమయంలో వస్తుందని 10రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళ్లాల మీదే ఉందని తెలుసు. పంట కొనకుంటే ధాన్యం తడిచి పోతుందనీ తెలుసు. రైతులు ఇప్పటికే దెబ్బతిని ఉన్నారు. ధాన్యం కొనకపోతే మరింత నష్టాల్లో కూరుకుపోతారని తెలిసి కూడా చంద్రబాబు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు.  

మా హయాంలో ఇలాంటి పరిస్థితులు వచి్చనప్పుడు ఎలాంటి స్పందన ఉండేదో ప్రజలు ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగం మొత్తం పనిచేసేది. వెంటనే గన్నీ బ్యాగ్స్, ధాన్యం సరఫరాకు లారీలు సమకూరేవి. ధాన్యం కొనుగోలుకు వెనువెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. ధాన్యం సేకరణ, తరలింపునకు మొత్తం యంత్రాంగం అప్రమత్తం అయ్యేది. వర్షానికన్నా ముందే పంట కొనుగోలు పూర్తి చేసేవాళ్లం. ఇవన్నీ గతంలో జరిగాయి. ఈ రోజున రైతులు ఏమైపోయినా పట్టించుకునే వారే లేకుండా పోయారు.  

కేజీ అరటి పండ్లు అర్ధ రూపాయి
కొబ్బరి, అరటి, వేరుశనగ పంటలదీ ఇదే పరిస్థితి. ఏ పంటకూ రేట్లు లేవు. కేజీ అరటి అర్ధ రూపాయి అంటున్నారు. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? ఇంత ఘోరంగా పాలన సాగుతోంది. అదే మా ప్రభుత్వ హయాంలో అరటి, చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేకంగా రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల, కర్నూలు నుంచి ఘజియాబాద్, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచాయి.  

దీంతో రైతులకు దళారుల బెడదల తప్పింది. రవాణా ఖర్చులు తగ్గాయి. ఎగుమతులు పెరిగాయి. మా ప్రభుత్వం రాక మునుపు అరటి ఎగుమతి 23 వేల టన్నులు ఉంటే 2023–24లో 3 లక్షల టన్నులకు పెరిగింది. రైతులకు అదనంగా 20 నుంచి 40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం, చంద్రబాబు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా?   పులివెందులలో 600 టన్నుల కోల్డ్‌ స్టోరేజ్‌ మా హయాంలో ప్రారంభించాం. కరెంట్‌ బిల్లుల ఖర్చు వస్తుందని దానిని మనుగడలో లేకుండా చేయడం దుర్మార్గం.

డైవర్ట్‌ చేయడం కోసమే ‘రైతన్నా.. మీ కోసం’
ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతులకు ఇచ్చిన ప్రతి హామీ మోసంగా మారిపోయింది. ఆర్బీకేలు, ఈ–క్రాప్‌ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. తూతూ మంత్రంగా ఈ–క్రాప్‌ చేస్తున్నారు. ఒక పొలంలో రైతును నిలబెట్టి, ఎన్ని ఎకరాల్లో, ఏ పంట సాగు చేశారో ఆర్బీకేకు అనుసంధానం చేసేదే ఈ–క్రాప్‌. ఆ రైతుకు భవిష్యత్‌లో గిట్టుబాటు ధర రాకపోయినా, పంట నష్టం వాటిల్లినా ఆదుకునే వ్యవస్థ ఆర్బీకే ద్వారా ఉండేది.

ఆర్బీకేల్లో పంటల వారీగా గిట్టుబాటు ధరల పట్టికలు ప్రచురించే వాళ్లం. ఎక్కడైనా గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్‌(క్రియాశీలకం) అయ్యేది. జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి సమస్య వెళ్లేది. ఆయన మార్క్‌ఫెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను అప్రమత్తం చేసి పంట కొనుగోలు చేసేవారు. మార్కెట్‌లో పోటీ సృష్టించేవారు. ఈ క్రమంలో మేం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కోసం దాదాపు రూ.7,457 కోట్లు ఖర్చు చేశాం.  

ఇప్పుడు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ అంశాన్ని డైవర్ట్‌ చేయడం కోసం ‘రైతన్నా.. మీ కోసం’ అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులందరికి ధన్యవాదాలు.. అంటూ ఈనాడులో యాడ్‌ కూడా వేసుకున్నారు. అసలు వీళ్లు రైతుల దగ్గరకు పోయే పరిస్థితే లేదు. పోతే రైతులు తిడతారు, కొడతారు కూడా.. రైతుల దగ్గరకు పోకుండానే కార్యక్రమం విజయవంతం అయినట్టు ఆశ్చర్యకరంగా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రంలో మీరు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అమలయ్యాయా? ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్‌ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు. ఇది మోసం కాదా? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఎక్కడ ఇచ్చారు? ఇలా ఎన్నెన్నో 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్‌ కేసు పెట్టి లోపల వేయాల్సిందే. అసలు వాళ్ల ముగ్గురినీ లోపల వేయాలి. ఇదే మోసం చిట్‌ఫండ్, ఫైనాన్స్‌ స్కీమ్స్‌ నడిపే వాళ్లు చేస్తే జైల్లో పెట్టేవారు. వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు.. ఆంధ్రజ్యోతి చూపదు.. టీవీ–5 పట్టించుకోదు.. అంతా గజ దొంగల ముఠా.

రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల పరిస్థితి చూస్తే బాధేస్తోంది. ధాన్యం, ఉల్లి, టమాటా, అరటి.. ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పాలన ‘సేవ్‌ ఏపీ’ అన్న తరహాలో ఉంది. హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌ వైపు ఒకసారి చూడండని అందరూ అనాల్సిన దుస్థితి కొనసాగుతోంది. – వైఎస్‌ జగన్‌

➤ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.72 వేలు భృతి ఇవ్వాలి. ఏ ఒక్క నిరుద్యోగికైనా భృతిగా రూ.72 వేలు చెల్లించారా? ఇది మోసం కాదా? చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎన్నికలకు ముందు బాండ్‌లు కూడా ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇవ్వనేలేదు. మరి సూపర్‌ సిక్స్‌ ఎక్కడ అమలైంది?

➤ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. సంవత్సరానికి రూ.18 వేలు.. రెండేళ్లకు ఒక్కరికైనా రూ.36 వేలు ఇచ్చారా? ఇది మోసం కాదా?

➤బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ అన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.48 వేలు, రెండేళ్లకు రూ.96 వేలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్‌ కాకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది రూ.10 వేలే. ఇది మోసం కాదా?

➤అమ్మ ఒడి పథకం పేరు మార్చారు. తల్లికి వందనం అన్నారు. ప్రతి పిల్లాడికి రూ.15 వేలు అన్నారు. తీరా చూస్తే తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదికి వచ్చే సరికి 20 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. రూ.15 వేలు కాకుండా రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు ఇచ్చారు. కొందరికి మాత్రమే రూ.13 వేలు ఇచ్చారు. రెండేళ్లకు ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. ఇలా ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడం మోసం కాదా?

➤దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు. రెండేళ్లకు ఆరు సిలిండర్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది రెండే. అవీ అందరికి ఇవ్వలేదు. ఇది మోసం కాదా?

➤ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్‌ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు. ఇది మోసం కాదా? ఇన్ని 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్‌ కేసు పెట్టి లోపల వేయాల్సిందే కదా? అసలు వాళ్ల ముగ్గురినీ లోపల వేయాలి. ఇదే మోసం చిట్‌ఫండ్, ఫైనాన్స్‌ స్కీమ్స్‌ నడిపే వాళ్లు చేస్తే జైల్లో పెట్టేవారు. వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు..  ఆంధ్రజ్యోతి చూపదు.. టీవీ5 పట్టించుకోదు.. అంతా గజ దొంగల ముఠా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement