పార్లమెంటు శీతకాల సమావేశాలు ఈసారి కూడా వాయిదాల్లోనే ముగిసిపోతాయని నిరాశపడినవారికి మంగళవారం పాలక, ప్రతిపక్షాలు ఒక అంగీకారానికి రావటం ఊరట నిచ్చింది. ఎన్నికల సంఘం(ఈసీ) వివిధ రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే (సర్) పేరిట కొనసాగిస్తున్న ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టడం, అందుకు కేంద్రం సిద్ధపడకపోవడం పర్యవసానంగా సమావేశాల తొలి రోజు నుంచే ప్రతిష్టంభన ఏర్పడింది.
చివరకు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ‘సర్’ను చర్చిద్దామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు విపక్షం అంగీకరించింది. దేశ ప్రజల సార్వభౌమా ధికారానికి పార్లమెంటు ప్రతీక అంటారు. ప్రజా సమస్యలపై చర్చకు, దేశ ప్రగతికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, చట్టాల రూపకల్పనకు అది ప్రధాన వేదిక. పాలకపక్ష జవాబుదారీతనాన్ని పెంచటం, ప్రజల గొంతుక వినిపించటం విపక్షాలు చేసే పని. కానీ ఆచరణలో అదంతా ఎటో కొట్టుకుపోతోంది.
లోక్‌సభ చరిత్ర గమనిస్తే దాని వర్తమాన స్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. 1952–70 మధ్య అది ఏడాదికి సగటున 121 రోజులు సమావేశమయ్యేది. అంటే అయిదేళ్లలో సగటున 605 రోజులు సమావేశాలుండేవి. అటు తర్వాత నుంచి ఏడాది సగటు 68 రోజులకొచ్చింది. అయిదేళ్ల సగటు 340 రోజులకు తగ్గింది. దాదాపు సగానికి పడిపోయిన పని దినాలైనా సజావుగా సాగుతున్న జాడలేదు. సమావేశాలు మొదలవుతున్నాయంటే ప్రతిష్టంభన సృష్టించటమే విపక్షాల ఏకైక వ్యూహంగా మారింది.
సభలో ఆందోళనలు నిర్వహించటం, ముందుకు సాగనీయకపోవటం తమ ప్రజాస్వామిక హక్కని విపక్షాలు భావిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు ఔన్నత్యం గురించి, ప్రజా స్వామ్యం గురించి గంభీరోపన్యాసాలివ్వటం... విపక్షంలో ఉంటే సమావేశాలకు ఆటంకం కలిగించటం రివాజైంది. ఆ తర్వాత చానెళ్లకొచ్చి మహోద్రేకంతో ఊగిపోతూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవటం దానికి అదనం. ఈ మొత్తం వ్యవహారంలో సామాన్య పౌరులకు పనికొచ్చేది ఒక్కటీ ఉండదు.
పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగకపోవటం వల్ల ప్రజలకు జరిగే అన్యాయం సాధారణమైనది కాదు. ఎంతో కీలకమనుకున్న బిల్లులు సైతం ప్రవేశపెట్టిన కొన్ని రోజుల్లోనే ఆమోదం పొంది చట్టంగా మారుతున్నాయి. వాటిని అధ్యయనం చేయ టానికీ, అభ్యంతరాలు చెప్పటానికీ, సవరణలు ప్రతిపాదించటానికీ సమయం ఎక్కడ? కొన్ని బిల్లులైతే నిండా గంట పాటైనా చర్చించిన దాఖలా ఉండటం లేదు.
చాలా బిల్లులు విపక్షాల ఆందోళనల మధ్యే ఆమోదం పొందినట్టు ప్రకటించటం ఇటీవలి కాలంలో పెరి గింది. బడ్జెట్ ప్రతిపాదనలూ, ద్రవ్యబిల్లులు కూడా ఏ చర్చా లేకుండానే సునాయాసంగా గట్టెక్కుతున్నాయి. పార్లమెంటులో ఎంతో ప్రాధాన్యం ఉండే ప్రశ్నోత్తరాల సమయం వాయిదాల కారణంగా కుంచించుకుపోతోంది.
‘సర్’ చాటున తనకు సంబంధం లేని పౌరసత్వ నిర్ధారణ బాధ్యతను ఈసీ భుజాన కెత్తుకుంది. ఇందువల్ల ఓటర్‌గా నమోదు కావాలంటే ముందు ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత జనం పైనే పడింది. అందుకోసం గడువులోగా దాఖలు చేయాల్సిన పత్రాలు అందరి వద్దా అప్పటికప్పుడు లభ్యమయ్యేవి కాదు. తల్లితండ్రుల పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన పత్రాలు సైతం తెచ్చివ్వాలంటే కూలీ నాలీ చేసుకునే పౌరులు ఎక్కడికని, ఎంతకని తిరుగుతారు? ఈ స్థితిలో బిహార్‌లో ఓటుహక్కు కోల్పోయిన 47 లక్షల మందిని ‘విదేశీయులు’గా ముద్రేయటం సాధ్యమేనా? చిత్ర మేమంటే ఇంతటి కీలకమైన నిర్ణయంపై ముందుగా పార్లమెంటు చర్చించలేదు.
ప్రస్తుతం ఆ అంశాన్ని సుప్రీంకోర్టు విచారిస్తుండగా సభలో చర్చకు రాబోతోంది! ఇది కూడా మొత్తంగా ఎన్నికల సంస్కరణలపై కావటం వల్ల ఆ చర్చ కాస్తా ఎటు మళ్లుతుందో తెలియదు. ఇటీవలి కాలంలో ఈవీఎంల వింతలూ, ఎన్నికలైనాక ప్రకటించే పోలింగ్ శాతం పెరుగుతూ పోవటం వంటి అంశాల్లో ఈసీ మౌనమే సమాధానమవుతోంది. ఎన్నికల సంస్కరణల కన్నా ముందు ఈసీ పనితీరు ప్రక్షాళన, ఆ సంస్థ జవాబు దారీతనం పెంచటం వగైరాల అవసరం ఉంది. వీటన్నిటినీ పార్లమెంటు సమగ్రంగా చర్చిస్తుందా? పరస్పర నిందారోపణలతో కాలం గడుస్తుందా? ఈ నెల 9న జరగబోయే చర్చను దేశమంతా ఆసక్తితో గమనిస్తుంది.


