ఉద్దేశాలు మంచివైనప్పుడు దాపరికాలు అవసరం లేదు. జనానికి మేలు చేయటమే ధ్యేయమైనప్పుడు చాటుమాటు చర్యలు సరికాదు. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘సంచార్ సాథీ’ యాప్ మూణ్ణెల్లలో ఫోన్లలో ఉండితీరాలంటూ కేంద్రం మొబైల్ ఉత్పత్తిదారులకు మొన్న శుక్రవారం చడీచప్పుడూ లేకుండా ఇచ్చిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదం కావటం ఇందువల్లే. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన విమర్శలకు జడిసి ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
ఇక్కడ ఉత్పత్తవుతున్న, దిగుమతవుతున్న ఫోన్లకు వర్తించటంతోపాటు ఇప్పటికే వినియోగదారుల దగ్గరున్న ఫోన్లకు సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ యాప్‌ను చేరేయాలని టెలికమ్యూనికేషన్ల విభాగం మూడు రోజుల క్రితం మొబైల్ ఉత్పత్తిదారుల్ని ఆదేశించింది. తాజాగా అది తప్పనిసరి కాదంటూ ప్రకటించింది. పౌరుల శ్రేయస్సును ఆశించి, వారు మోసగాళ్ల బారిన పడకుండా చూసేందుకు ఇది రూపొందించామనీ, ఇందులో గూఢచర్యం లేదా ఫోన్ సంభాషణల పర్యవేక్షణ ఉద్దేశం లేనేలేవనీ కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంజాయిషీ ఇచ్చారు.
దాదాపు కోటిన్నరమంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని లబ్ధి పొందుతున్నారనీ, 41 లక్షల మోసపూరిత మొబైల్ నంబర్లను గుర్తించి నిరోధించామనీ, అపహరించిన దాదాపు 26 లక్షల మొబైల్ సెట్ల జాడ కనిపెట్టి 7 లక్షల సెట్లను వాటి యజమానులకు అందించా మనీ సింధియా చెబుతున్నారు. ఈ గణాంకాలతో విభేదించాల్సిన అవసరం లేదు. కానీ యాప్ ద్వారా ప్రయోజనాలు వెల్లువెత్తుతుంటే ఆ మాటే చెప్పి, మరింతమందిని ప్రోత్స హించవచ్చు. తదుపరి చర్యలు అవసరమనుకుంటే వెల్లడించవచ్చు. ఇదేం లేకుండా రహస్య చర్య ఆంతర్యమేమిటి?
దాదాపు నలభయ్యేళ్ల క్రితం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ‘పోస్టల్ బిల్లు’ తీసుకొచ్చి నప్పుడు జరిగిందేమిటో పాలకులు గ్రహించివుంటే వ్యక్తిగత గోప్యతను పౌరులు ఎంత ప్రాణప్రదంగా పరిగణిస్తారో అర్థమై ఉండేది. కనీవినీ ఎరుగని స్థాయిలో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని, తిరుగులేదనుకున్నవేళ పౌరులకు తెలియకుండా వారి ఉత్తరా లను చదివేందుకుద్దేశించిన బిల్లు తీసుకొచ్చి ఆయన అభాసుపాలయ్యారు.
జస్టిస్ పుట్టస్వామి కేసులో 2017లో సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుల్లో చేర్చింది. జాతీయ భద్రత లేదా సముచిత ప్రజాప్రయోజనం ఉన్నదని ప్రభుత్వం భావిస్తే గోప్యత నియంత్రణకు తగిన చట్టం తీసుకురావొచ్చని స్పష్టం చేసింది. అప్పుడు ప్రజల్లో, పార్లమెంటులో విస్తృత చర్చ జరుగుతుంది. ఇవేమీ లేకుండా ఒక నోటీసు ద్వారా పనికానిచ్చేద్దామనుకోవటం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా?
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా మన దగ్గర డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. క్రయవిక్రయాలు, చెల్లింపులు, వసూళ్లు, ఆన్‌లైన్ నమోదులు ముమ్మర మయ్యాయి. వాటితోపాటే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. డిజిటల్ అరెస్టు పేరుతో మోసగాళ్లు కోట్లు కాజేస్తున్నారు. ఆ నేరగాళ్లను పట్టుకోవటానికీ, పోగొట్టుకున్న ఫోన్లు పొందేందుకూ ‘సంచార్ సాథీ’ తోడ్పడటం నిజమే కావొచ్చు. కానీ గుప్పెడుమంది నేరగాళ్లను పట్టుకోవడానికి కోట్లాదిమందిని నిఘా నీడలోకి తెస్తామనటం ఏం తర్కం? ఉత్పత్తిదారులకు తప్పనిసరంటూ ఆదేశాలిచ్చి, ఇష్టపడకపోతే వినియోగదారులు తొలగించుకోవచ్చని చెప్పడంలో మర్మమేమిటి?
వ్యక్తిగత గోప్యత విషయంలో పౌరులకు ఎంత పట్టింపు ఉంటుందో నిత్యజీవితంలో చూస్తుంటాం. తల్లిదండ్రులు తమ ఫోన్లు గమనిస్తున్నారంటే పిల్లలకు కోపం. ప్రాణ స్నేహితుడైనా చాటుగా ఫోన్ చూస్తే సహించరు. భార్యాభర్తలే ఒకరి ఫోన్లు మరొకరు చూశారని తెలిస్తే దుమ్మెత్తిపోసుకుంటారు. అలాంటిది ప్రభుత్వ నిఘాకు అవకాశమిచ్చే యాప్‌ను జనం అంగీకరించగలరా? కాల్స్ వినేందుకూ, ఎస్సెమ్మెస్‌లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు వగైరాలన్నిటినీ చూసేందుకూ... ఆఖరికి మనకు తెలియకుండా కెమెరా వినియోగానికి కూడా ఈ యాప్ అవకాశమిస్తుందన్నది నిపుణుల మాట. బహుశా ‘1984’ రచయిత జార్జి ఆర్వెల్ కూడా ఇంత చేటు నిఘా ఊహించలేదు. ఏదేమైనా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అది వివేకవంతమైన చర్య.


