అమెరికా రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతకాలు, ‘ఫీఫా’ వరల్డ్ కప్ సాధించడంలో అబీ వోమ్‌బాక్ కీలక పాత్ర వహించారు. 2015లో మహిళల ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రిటైరయ్యారు. న్యూయార్క్‌లోని బర్నార్డ్ మహిళా కళాశాల పట్టభద్రులను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం..
విద్యార్థినులారా! దీన్ని అథ్లెట్లు బాగా అర్థం చేసుకోగలరు. వైఫల్యానికి సిగ్గు పడనవసరం లేదు. అదొక శక్తినిచ్చే సాధనం. ఆవిరి యంత్రానికి అవసరమైన బొగ్గు లాంటిది. నేను జాతీయ యువ జట్టులో ఉన్నపుడు ‘నా హీరో’ మియా హ్యామ్‌తో కలసి ఆడాలని కలలు కనేదాన్ని. ఒకసారి జాతీయ జట్టు లాకర్ రూమును చూసే అవకాశం లభించింది. అపుడు నన్ను ఆకట్టుకున్నది ఆమె చేసిన ప్రాక్టీసును పట్టి చూపే ఆమె షూల కింది భాగానికి అతుక్కున్న గడ్డి పరకలు కావు. లాకర్ల పైనున్న వారి పేర్లు, వేలాడుతున్న నంబర్లు కూడా కాదు. అది ఎవరో తలుపు పక్కన టేపుతో అతికించిన పోస్టరు.
మైదానంలోకి వెళ్ళే ప్రతి క్రీడాకారిణి దృష్టినీ ఆకర్షించే విధంగా దాన్ని అమర్చారు. అది వారి కడపటి ఘన విజయాన్ని చూపే చిత్రమని మీరు అనుకోవచ్చు. లేదా పోడియంపై నిలుచుని స్వర్ణ పతకాలు స్వీకరించినదని అనుకోవచ్చు. కానీ అది వారి చిరకాల ప్రత్యర్థి నార్వే జాతీయ జట్టు 1995 ప్రపంచ కప్‌లో అమెరికాను ఓడించిన తర్వాత చేసుకున్న సంబరాన్ని చూపే పోస్టరు. ఆనాడే గ్రహించాను: మైదానంలోనైనా, జీవితంలోనైనా విఫలమైనపుడు అది రేకెత్తించిన భావాలను, వైఫల్యం నేర్పిన పాఠాలను నా శక్తిగా మలచుకుంటూ ముందుకు సాగిపోవాలని!
విజయంలో వైఫల్యం పాత్ర
విద్యార్థినులారా! బాగా గుర్తు పెట్టుకోండి. ఒకసారి విఫల మైనందుకు తదుపరి అవకాశాలను చేజార్చుకోకండి. మనల్ని పక్కన పెట్టినంత మాత్రాన పరువు పోయినట్లు కాదు. మనం అత్యధిక సంఖ్యలో గోల్స్ చేసినవాళ్ళం అనుకుందాం. ఇంచుమించు ప్రతి కేటగిరీలోనూ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహ
రించాం అనుకుందాం. కానీ, ఒకానొక సందర్భంలో, ప్రపంచకప్ లాంటి పెద్ద పోటీలో మనకు ఆడే అవకాశం ఇవ్వకపోవచ్చు. అది మనల్ని బాధిస్తుంది. అంతటితో మన పని అయిపోలేదని గుర్తుంచుకోవాలి. జీవితం మిమ్మల్ని ఒక్కోసారి పక్కన కూర్చోబెడితే కూర్చోండి. కానీ, అక్కడ నుంచి నేతృత్వం వహించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. కడచిన ప్రపంచ కప్ గెలవడానికి ‘బెంచి నుంచి’ నేనిచ్చిన మద్దతు, చాంపియన్ షిప్ గెలవడానికి అవసరమైన విశ్వాసాన్ని ఇచ్చాయని జట్టులో తోటి సభ్యులు నాతో అన్నారు.
బెంచి మీద ఉన్నపుడు మీరు వారితో కెప్టెన్‌గా వ్యవహరించకపోతే, మైదానంలో తమ నాయకురాలిగా అంగీకరించరు. ప్రతిచోటా నాయకురాలిగా ఉండాలి.
మీరు ఎక్కడ ఉన్నా, అక్కడే అగ్ర భాగాన నిలవండి. తొంభై నిమిషాలపాటు సాగే ప్రతి ఫుట్ బాల్ మ్యాచ్‌లోనూ అద్భుతమైన క్షణాలు కొన్ని ఉంటాయి. బంతి కీపర్‌ను దాటి నెట్‌ను తాకితే గోల్ కొట్టినట్లు! గోల్ కొడితే అన్నీ సక్రమంగా కుదిరినట్లు లెక్క. బంతి ఒకరి నుంచి ఒకరికి సక్రమంగా పాస్ అవ్వాలి. దాన్ని తన్నుకుంటూ గుర్రంలా పరుగెత్తాలి. ప్రతి క్రీడాకారిణీ సరైన సమ యానికి సరైన చోట ఉండాలి. పడిన ఆ ఒక్క గోల్ వెనుక జట్టులో ప్రతి సభ్యు రాలు, కోచ్, చేసిన ప్రతి ప్రాక్టీసు, ప్రతి పరుగు, ప్రతి సందేహం, చివరకు ప్రతి వైఫల్య ప్రభావం కూడా ఉందని మరచి పోకూడదు.
అందరికోసం అందరం!
ప్రతి మహిళా చాంపియన్‌గా అవతరించే విధంగా మనం ఒకరి కొకరం తోడ్పడాలి. అది మనకు కష్టమే కావచ్చు. జట్టులో చోటు కోసం మనం మరో మహిళతోనే పోటీపడవలసి వస్తుంది. అలా తలపడటం సృష్ట్యాది నుంచీ ఉంది. కొరతను మన లోపల, మన మధ్యన సృష్టించారు. ఈ కొరతకు మనం బాధ్యులం కాము. కానీ, అది మన సమస్య. కొరత ఉన్న చోటల్లా మహిళలకు అవకాశాలు పుష్కలంగా సృష్టించగలిగిన శక్తి మన చేతుల్లోనే ఉంది. ప్రపంచంలోకి అడుగిడబోతున్న మీరు ఒకరి గొంతును ఒకరు బిగ్గరగా విని పించండి. నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో మహిళలకు, ముఖ్యంగా అన్ని వర్ణాల మహిళలకు, బడుగు వర్గాల నుంచి వచ్చినవారికి స్థానం కోసం డిమాండ్ చేయండి.
అమెరికాలో ఒక శ్వేతజాతి పురుషుడు చేసే పనికి ఒక డాలర్ దక్కుతున్నప్పుడు, దానితో పోల్చితే మహిళకు దక్కేది 80 సెంట్లే! అదే నల్లజాతి మహిళకైతే 63 సెంట్లే!! ఇక లాటిన్ అమెరికన్లకు వచ్చేది కేవలం 54 సెంట్లు. ఈ అంతరం గురించి ప్రశ్నించాలి. చరిత్రలో ఈ క్షణం మన నాయకత్వాన్ని కోరుకుంటోంది. అవకాశాన్ని ఇవ్వాలని అడగండి. జాబ్ కోసం డిమాండ్ చేయండి. పక్కనున్న అబ్బాయి కిస్తున్న పారితోషికంతో సమానమైన పారితోషికం కోసం పట్టుబట్టండి. పదో న్నతి, మైక్రోఫోన్‌లను అడగండి. నేను గడించుకున్న గౌరవాన్ని నాకివ్వమని డిమాండ్ చేయండి.
వ్యక్తిత్వమే మనం!
చివరగా, సాకర్ నుంచి నిష్క్రమించిన తర్వాత, నేను నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన పాఠాన్ని మీకు చెప్పదలచు కున్నాను. రిటైరైనపుడు, నన్ను స్పాన్సర్ చేస్తూ వచ్చిన గేటరేడ్ ఒక వాణిజ్య ప్రకటనకు ప్లాన్ చేసి, నన్ను ఆశ్చర్యపరచింది. ‘నన్ను మరచిపోండి’ అన్నదే దాని సారాంశం. నేను నా జీవి తాన్ని ఏ క్రీడకు అంకితం చేశానో, నా వారసత్వం ఆ క్రీడ భవిష్యత్ విజయాలకు పూచీ నివ్వాలని కోరుకుంటున్నానని వారికి తెలుసు. నన్నే తలచుకుంటూ కూర్చోకుండా ఉంటేనే, నా వెనుక వచ్చిన క్రీడాకారిణులు రికార్డులను బద్దలు కొడతారు. చాంపియన్ షిప్‌లు గెలుస్తారు. క్రీడను కొత్త శిఖరాలకు తీసుకువెళతారు. ఆ కమర్షియల్ షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు నా కళ్ళు చెమర్చాయి.
రిటైరైన తర్వాత, కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాను. గ్లెనాన్‌ను పెళ్ళి చేసుకున్నాను. ముగ్గురు పిల్లలకు తల్లినయ్యాను. వ్యాపారసంస్థకు యజమానినయ్యాను. ఉద్యమకారిణిగా మారాను. నా పదేళ్ళ కూతురు ఉన్న జట్టుకు కోచింగ్ ఇచ్చి, వారిని విజేతలుగా తయారు చేశాను. కానీ, నేను ఇప్పటికీ అబీ వోమ్‌బాక్‌నే! చేపట్టిన పనిలో 100 శాతం అంకిత భావాన్ని కనబరుస్తాను. తదుపరి తరానికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ప్రతి రోజూ పోరాడతాను. సాకర్ నన్ను తీర్చిదిద్దలేదు. నేను సాకర్‌కు నా వ్యక్తిత్వాన్ని అద్దాను. మనం చేసే పని మనల్ని ఎన్నడూ నిర్వచించదు. మన వ్యక్తిత్వమే మనల్ని ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీకు ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండండి, కానీ మీరు అర్హమైనదాన్ని కచ్చితంగా డిమాండ్ చేయండి.


