ఆలోచనకూ, అది సాకారం కావటానికీ మధ్య ఇరవై రెండేళ్ల సుదీర్ఘకాలం పట్టిందంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ)ల మధ్య మంగళవారం సంతకాలైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) వెనక ఇలాంటి ఆశ్చర్య పోయే సంగతులు చాలానే ఉన్నాయి. బహుశా ‘నియమాల ఆధారిత’ అంతర్జాతీయ క్రమాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్వంసించటం మొదలెట్టకపోతే ఈ ఎఫ్‌టీఏకు మరికొంత సమయం పట్టేదేమో! ఈయూతో ఒప్పందమంటే ఆర్థిక స్థోమత పుష్కలంగా ఉన్న 27 యూరోప్ దేశాలతో బహువిధ రంగాల్లో ప్రగాఢమైన అనుబంధం ఏర్పడటమే! అందుకే ఈ ఒప్పందాన్ని ‘సకల ఒప్పందాలకూ తల్లిలాంటిద’ని చెప్పటంతో పాటు, దీన్ని కేవలం వాణిజ్య ఒప్పందంగా కాక, ఉమ్మడి శ్రేయస్సు కోసం రూపొందించిన ‘బ్లూ ప్రింట్’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.
భారత్, ఈయూలు రెండూ ప్రపంచ జీడీపీలో 25 శాతం, వాణిజ్యంలో మూడోవంతు వాటా కలిగివున్న రెండు ప్రధాన ఆర్థికవ్యవస్థలు. విడిగా చూస్తే మన దేశం ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. కూటమిగా ఈయూ రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఉక్రెయిన్ యుద్ధం వంటి ఆటుపోట్లు... అమెరికా, చైనాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా ఈయూ ఆర్థిక వ్యవస్థ నిలబడగలుగుతోంది. మన డెయిరీ రంగానికి ఎఫ్‌టీఏలో మినహాయింపు ఇచ్చేందుకు ఈయూ అంగీకరించింది. అయితే చిన్న, మధ్యతరహా సంస్థల ప్రవేశానికీ, సర్వీసుల రంగానికీ మన దేశం వెసులుబాటు నిచ్చింది. కార్ల దిగుమతిపై ఉన్న 110 శాతం సుంకాలు పది శాతానికి పడిపోతాయి.
ఎన్నడో 2004లో ఒక ఆలోచనగా బయల్దేరిన ఎఫ్‌టీఏ జాప్యం కావటంలో ఈయూ మొండి వైఖరే ప్రధాన కారణం. అసలు దానిపై చర్చల ప్రారంభానికే మూడేళ్లు పట్టింది. అప్పట్లో ఈయూకు చైనాయే ఇష్టసఖి. అందుకే భారత్‌ను పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ అమెరికాతో మనకు కుదిరిన పౌర అణు ఒప్పందం ‘123’ దాని కళ్లు తెరిపించింది. 2013లో ఎఫ్‌టీఏ కోసం ఈయూ విధించిన షరతులు లీకైనప్పుడు నిరస నలు వెల్లువెత్తాయి. మేధాసంపత్తి హక్కుల పేరిట తన ఫార్మా రంగాన్ని రక్షించుకోవ టానికి ఎఫ్‌టీఏలో ఈయూ పెట్టిన నిబంధన మన ప్రజారోగ్య రంగానికి చేటు తెస్తుందని, జెనెరిక్ మందుల ఉత్పత్తి నిలిచిపోతుందని ఆక్స్‌ఫావ్‌ు వంటి సంస్థలు హెచ్చరించాయి.
సాగు రంగంపై అది చూపగల ప్రభావంపైనా భయాందోళనలు వ్యక్తమ య్యాయి. ఇవి గాక అనంతర కాలంలో కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వగైరాలు ఈయూకు అభ్యంతరకరం అనిపించాయి. ఈమధ్య పలు దేశాలతో మనకు ఎఫ్‌టీఏలు కుదిరాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, మారిషస్, యూఏఈలతోపాటు ఐస్‌ల్యాండ్, లిచెన్‌స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్‌లతో కూడిన యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం(ఈఎఫ్‌టీఏ)తో సైతం ఎఫ్‌టీఏలపై సంతకాలు చేసింది. ఈయూతో సంబంధంలేని కూటమి ఈఎఫ్‌టీఏ.
ఉభయపక్షాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ నిరుడు మార్చి ఆఖరునాటికి 13,600 కోట్ల డాలర్లు. ఈయూ సరుకుల ఎగుమతుల జాబితాలో భారత్‌ది అగ్రస్థానం. అయితే తాజా ఎఫ్‌టీఏ అమల్లోకి రావటానికి కొన్ని అవరోధాలున్నాయి. ఈ నెల 1 నుంచి కార్బన్ బోర్డర్ అడ్జెస్ట్‌మెంట్ మెకానిజం(సీబీఏఎం) పేరిట ఈయూ అమల్లోకి తెచ్చిన ‘పర్యా వరణ పన్ను’ ప్రధాన అవరోధం. ఉక్కు, సిమెంట్, అల్యూమినియం, ఎరువుల వంటివి చవగ్గా ఉత్పత్తి చేయటానికి కర్బన ఉద్గారాల ముప్పును భారత్ పట్టించుకోవటం లేదని, అందుకే ఇది అవసరమని ఈయూ వాదన. దీన్ని మన దేశం ఖండిస్తోంది.
కేవలం తమ ఉత్పత్తుల్ని రక్షించుకోవటానికి ఇదొక సాకు మాత్రమేనన్నది మన వాదన. సీబీఏఎం నుంచి భారత్‌కు మినహాయింపు ఇస్తుందా, అసలు దాని అమలునే ఈయూ వాయిదా వేస్తుందా అన్నది చూడాలి. ఇవిగాక ఆరోగ్యం, భద్రత ప్రమాణాలు... కార్మిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటివి కూడా ఉన్నాయి. కానీ ట్రంప్ దూకుడు నుంచి కాపాడుకోవాలంటే ఇలాంటి సాకులు వదులుకోక తప్పదు. మొత్తానికి 27 యూరోప్ దేశాల చట్టసభలతోపాటు ఈయూ పార్లమెంటు, మన పార్లమెంట్ ధ్రువీకరించాక ఎఫ్‌టీఏ అమలు మొదలవుతుంది. దానికెంత కాలం పడుతుందో చూడాలి.


