ఫైనల్లో భారత్‌ | india beat Italy 1-0 in the Semi-Final of FIH Hockey World Cup Qualifiers 2026 | Sakshi
Sakshi News home page

ఫైనల్లో భారత్‌

Mar 14 2026 4:39 AM | Updated on Mar 14 2026 4:39 AM

india beat Italy 1-0 in the Semi-Final of FIH Hockey World Cup Qualifiers 2026

సెమీస్‌లో ఇటలీపై 1–0తో గెలుపు 

ప్రపంచకప్‌ బెర్త్‌ కూడా ఖరారు 

నేడు ఇంగ్లండ్‌తో టైటిల్‌ పోరు

రాత్రి గం. 7:30 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ విజయపరంపర కొనసాగిస్తోంది. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నిలో టైటిల్‌ పోరుకు దూసుకెళ్లింది. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్‌–బెల్జియంలలో జరిగే ప్రపంచకప్‌ టోర్నికి అధికారికంగా అర్హత సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 1–0 గోల్‌ తేడాతో ఇటలీ జట్టును ఓడించింది. ఆట 40 నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను మనీషా చౌహాన్‌ గోల్‌గా మలిచి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది.

ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని టీమిండియా విజయాన్ని అందుకుంది. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన భారత్‌ నాకౌట్‌ మ్యాచ్‌లోనూ రాణించింది. ఇటలీపై అవకాశం దొరికినపుడల్లా దాడులు నిర్వర్తించింది. మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు వచ్చాయి. ఇందులో ఒక దానిని మాత్రమే భారత్‌ సద్వినియోగం చేసుకుంది. 

ఇటలీ తమకు లభించిన ఒక్క పెనాల్టీ కార్నర్‌ను వృథా చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 2–0 గోల్స్‌ తేడాతో స్కాట్లాండ్‌పై గెలిచింది. ఇంగ్లండ్‌ తరఫున లాటీ బింఘామ్‌ (25వ నిమిషంలో), డార్సీ బుర్నీ (29వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ కూడా ప్రపంచకప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. నేడు జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది. మూడో స్థానం కోసం స్కాట్లాండ్‌తో ఇటలీ పోటీపడుతుంది.

9 భారత జట్టు తొమ్మిదోసారి ప్రపంచకప్‌ టోర్నిలో ఆడనుంది. 52 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నిలో భారత జట్టు 1974లో అత్యుత్తమంగా నాలుగో స్థానాన్ని సాధించింది. 1978లో 7వ స్థానంలో, 2018లో 8వ స్థానంలో నిలిచింది.  2010, 2022లో 9వ స్థానం పొందిన టీమిండియా 1983, 2006లలో 11వ స్థానం, 1998లో 12వ స్థానం సంపాదించింది.  

Advertisement
 
Advertisement
Advertisement