5 పైసల క్షీణతతో 92.30కు
ఇంట్రాడేలోనూ రికార్డ్ కనిష్టం
ముంబై: చమురు ధరల సెగతో దేశీ కరెన్సీ విలువ కరుగుతూనే ఉంది. తాజాగా డాలరుతో మారకంలో రూపాయి 5 పైసలు క్షీణించి 92.30 వద్ద ముగిసింది. వెరసి వరుసగా మూడో రోజు సరికొత్త కనిష్టానికి చేరింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 1.5 శాతం పుంజుకుని 102 డాలర్ల ఎగువకు చేరడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం బలపడి 100ను అధిగమించడం రూపాయిని దెబ్బతీశాయి.
దీంతో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 92.33 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి ఇంట్రాడేలో 92.47 వద్ద మరోసారి చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు కొనసాగుతుండటం సైతం రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.


