ప్రపంచవ్యాప్తంగా అలముకున్న అనిశ్చితికి తోడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాలు, పడిపోతున్న రూపాయి విలువ, ఉపాధి లేమి తదితరాలు హడలెత్తిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో దేన్నయినా అంచనా వేయటమంటే కత్తి మీద సాము. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటుకు ఆర్థిక సర్వే సమర్పించారు. ముగియబోతున్న ఆర్థిక సంవత్సరంలో మన స్థితిగతులెలా ఉన్నాయో వివరించి, ఇకముందు రాగల సవాళ్లేమిటో... వాటిని అధిగమించటానికి ప్రభుత్వానికున్న ఆలోచనేమిటో స్థూలంగా వివరించటం ఆర్థిక సర్వేల లక్ష్యం. నిజానికి ఆర్థిక సర్వేకు ముందురోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో సంస్కరణలు మరింత వేగవంతం కాబోతున్నాయని సూచనప్రాయంగా చెప్పారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ 6.8–7.2 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రపంచ దేశాలన్నిటా ఆర్థికంగా మందగమనం కొనసాగుతున్నా మన దేశం ‘వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ’గా కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలా ఆశించటానికి కారణం ఉంది. వృద్ధి రేటు బలంగా ఉండటం, మునుపెన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక నిపుణులు ‘గోల్డీలాక్స్ ఎకానమీ’ అంటారు. దేశం ఏదైనా, పాలకులు ఎంతగానో కోరుకునే సమతౌల్య స్థితి ఇది. స్వేచ్ఛగా ప్రాథమ్యాలను ఎంచుకోవటానికీ, దూకుడుగా ముందుకు పోయేందుకూ అనువైన బడ్జెట్‌ను రూపొందించుకొనేందుకు ఇది వీలు కల్పిస్తుంది. కానీ ఒడుదొడుకులు ఉన్నా యని ఆర్థిక సర్వే గమనిస్తే అర్థమవుతుంది.
2025–26 సంవత్సరానికి గణాంకాల మంత్రిత్వ శాఖ లోగడ అంచనా వేసిన వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.4 శాతంకాగా, అది అంతకన్నా తక్కువే ఉంటుందని సర్వే చెబుతోంది. పన్ను వసూళ్లలో 11 శాతం వృద్ధి ఉండొచ్చని నిరుడు అంచనా వేస్తే అది 8 శాతం మించలేదు. నిరుడంతా విదేశీ మదుపుదారులు 1,900 కోట్ల డాలర్లమేర వెనక్కి తీసుకోగా, ఈ జనవరిలోనే 400 కోట్ల డాలర్ల ఈక్విటీలు విక్రయించారు. సంస్కరణలు మొదలయ్యాక ఇలా జరగటం ఇదే ప్రథమం. అయితే విదేశీ మారక నిల్వల్లో మనం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నామని సర్వే వివరిస్తోంది. ఈ నిల్వలు 701.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని చెబుతోంది. అలాగే ప్రవాస భారతీయుల ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం కూడా భారీగా పెరిగింది. ముగుస్తున్న సంవత్సరంలో ఇది 135.4 బిలియన్ డాలర్లు.
దేశ ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న సమస్యలకు మూలం ప్రపంచ స్థితిగతుల్లో ఉంది తప్ప అది అంతర్గతమైంది కాదని సర్వే ప్రకటించింది. అయితే తయారీ రంగ పరిశ్రమలు విస్తరించి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా చూడటం మన బాధ్యతే. కృత్రిమ మేధ(ఏఐ)తో ఉద్యోగాలు పోతాయన్న భయాలు అవాస్తవమనీ, పైపెచ్చు తగిన మార్పులు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనీ సర్వే అంటున్నది. డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా, యాప్‌ల ద్వారా దేశంలో శరవేగంతో విస్తరిస్తున్న ‘గిగ్ ఎకానమీ’పై ఈ సర్వే దృష్టి సారించటం ప్రశంసనీయం. 2021లో ఈ రంగంలో 77 లక్షల మంది ఉండగా, వారి సంఖ్య ప్రస్తుతం కోటీ 20 లక్షలు. కానీ దాదాపు 40 శాతం మంది నెలకు రూ. 15,000 కన్నా తక్కువే సంపాదిస్తున్నారని చెబుతూ... గంటకు నిర్ణీత మొత్తం ఇచ్చేలా, లేక నిర్దేశించిన లక్ష్యానికి ఫలానా మొత్తం అనే విధంగా ఉంటే మెరుగైన ఆర్జన సాధ్యమవుతుందని సర్వే భావించింది. వారి పని పరిస్థితులు మెరుగయ్యేలా చూస్తామని వాగ్దానం చేస్తోంది.
అయితే సామాజిక రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని మరింత పెంచితే తప్ప, ఉగ్రరూపం దాలుస్తున్న ఉపాధి లేమిని సరిచేస్తే తప్ప వాస్తవ అభివృద్ధి సాధ్యపడదు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ వ్యయం చాలా తక్కువుంది. ఆ రంగాలపై శ్రద్ధ పెట్టనంతకాలం నాసిరకం చదువులు, అనారోగ్యం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు పీడిస్తూనే ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదేమిటో రెండు రోజుల్లో రాబోయే బడ్జెట్ తేటతెల్లం చేస్తుంది.


