యుద్ధమంటే... | Sakshi Editorial On America, Israel, Iran War | Sakshi
Sakshi News home page

యుద్ధమంటే...

Mar 16 2026 12:11 AM | Updated on Mar 16 2026 12:11 AM

Sakshi Editorial On America, Israel, Iran War

యుద్ధమంటే... పరిగెడుతున్న రైలు హఠాత్తుగా పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోవడం; నడుస్తూ నడుస్తూ ఉన్న దారి అకస్మాత్తుగా మూసుకోవడం; ఏళ్ల తరబడిగా సాఫీగా సాగుతున్న జనజీవితం రోజుల వ్యవధిలో సంక్షోభాల ఊబిలోకి దిగబడిపోవడం; యుద్ధ మంటే గతంతో ఒక్కసారిగా లంకె తెగిపోయి భవిష్యత్తు అంధకారబంధురమైపోవడం! మనిషి ఎక్కువకాలం శాంతికి దగ్గరగానూ, యుద్ధానికి దూరంగానూ ఉంటూ వివేకాన్ని చాటుకునేవాడే; కానీ ఏ దుర్ఘడియలోనో ఆ వివేకం నుంచి జారిపోయి విధ్వంసం వైపు అడుగు వేస్తాడు. మానవ స్వభావంలోని వక్రత అదే; మనిషిని పట్టి పీడించే శాపమూ అదే! యుద్ధంలో విజితులూ, విజేతలూ ఉండరనీ, చివరికి అందరూ పరాజితులే అవుతా రనీ అతనికి తెలియదా, తెలుసు! రెండువైపులా చచ్చినవాళ్ళ కోసం ఏడ్చే బంధువుల దుఃఖం ఒక్కలానే ఉంటుందనీ తెలుసు. కానీ ఉన్మాదం... ఉన్మాదం... 

తాజా పశ్చిమాసియా యుద్ధంలో పిల్లలతో సహా ఇప్పటికే వందల సంఖ్యలో చనిపోయారు. అమెరికా చేరికతో అది మినీ ప్రపంచ యుద్ధంగా మారింది ఆర్థిక, వాణిజ్య సంబంధాలూ, వలసలూ, రవాణా సదుపాయాలూ, శాస్త్రసాంకేతికవృద్ధీ  దేశాలను దగ్గరగా ముడివేసి ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన దశలో... మంచైనా, చెడైనా త్రుటిలో ప్రపంచస్థాయి నందుకుంటాయి. ఆ క్రమంలోనే పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలు కుగ్రామ దశను కూడా దాటి నేరుగా వంటింట్లోకి అడుగుపెట్టి సాధారణ గృహిణులలో కూడా అలజడీ, ఆందోళనా రేపుతున్నాయి. సహజవాయు లభ్యతకు అంత రాయం ఏర్పడి, వంటగ్యాస్‌ సరఫరా మందగించడంతో హాహాకారాలు చెలరేగు తున్నాయి. 

యుద్ధం ఇలాగే కొనసాగితే పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితిని ఊహించుకుని కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వాలు అభయమిస్తున్నా పరిస్థితి వాటి చేయి కూడా దాటిపోతే ఏమిటి గతన్న ప్రశ్న గుండెల్ని గునపంలా గుచ్చుతోంది. చిన్నా, పెద్దా హోటళ్ళు మూతపడి సిబ్బంది వీథిన పడుతున్నారు. వాటిపై ఆధారపడే జనాలు తిండికి కటకటలాడే దుఃస్థితి భయపెడుతోంది. కొరతను అడ్డుపెట్టుకుని పెరిగిపోయే వంట గ్యాస్‌ ధరలు జనాల జేబులను కొల్లగొట్టి మరిన్ని కష్టాలలోకి నెట్టే ప్రమాదమూ తలెత్తింది. అలాగని, వెనకటి కట్టెల అడితీలు, బొగ్గుల దుకాణాల రోజులకు వెళ్ళ గలమా, కాలాన్ని వెనక్కి తిప్పగలమా, ఇన్నేళ్ళ గతినీ ప్రగతినీ కొన్ని రోజుల్లోనే యుద్ధం తుడిచిపెడితే ఏమిటి చేయడం?! ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. 

యుద్ధమంటే చావుబతుకులు చెట్టపట్టాలు వేసుకుని ఏకకాలంలో చేసే విలయ తాండవం. చావుకీ, బతుక్కీ తేడా కనిపించని నిర్లిప్తక్షణం. ప్రియకౌగిలికీ, మృత్యు ఆలింగనానికీ మధ్య నిత్యసంచారం. లియో తొలుస్తాయ్‌ ‘వార్‌ అండ్‌ పీస్‌’ అనే తన ఐతిహాసిక నవలలో యుద్ధానికీ, శాంతికీ మధ్య జరిగే ఎడతెగని పెనుగులాటను మహాద్భుతంగా కళ్ళకు కడతాడు. ఆపైన రామాయణ, మహాభారతాల ఉదాహరణాలూ మన ముందు ఉన్నాయి. ‘తపస్సుతో ఇంద్రియాలను జయించిన నీ మీద ఆ ఇంద్రియాలే పగబట్టాయా, సీత పట్ల కామాన్ని జయించలేక ఈ యుద్ధమెందుకు కొనితెచ్చుకున్నావు; భర్తా, కొడుకూ, బంధువులూ చచ్చిన తర్వాత జీవచ్ఛవంలా ఎలా బతక’నంటూ రావణుడి మీదపడి మండోదరి గుండెలవిసేలా రోదిస్తుంది. 

ఎక్కడైనా, ఎప్పుడైనా అంతే! యుద్ధప్రారంభంలో పురుషుడు చూపిన శౌర్యప్రతాపాలు యుద్ధాంతంలో స్త్రీల శోకవిహ్వ లత ముందు నీరుగారిపోతాయి. మహాభారత కథకుడు ‘స్త్రీపర్వం’ పేరిట తల్లుల శోకా నికి ఒక ప్రత్యేక పర్వరూపమే ఇస్తాడు; అందులో, నూరుగురు కొడుకుల్ని కోల్పోయి కడుపుకోత పడుతున్న గాంధారిని నాయిక స్థానంలో ప్రతిష్ఠిస్తాడు. దుఃఖవివశ అయిన ఆమె ముందుకు రావడానికి అంతటి భీముడూ వణికిపోతాడు. ‘తల్లీ! నీ కొడుకుల్ని చంపించిన పాపాత్ముణ్ణి నేనే! నన్ను శపించు!! ’ అంటూ ధర్మరాజు చేతులు జోడిస్తాడు. తల్లి మనసుతో అతణ్ణి మన్నిస్తూనే, పాండవపక్షానికి చెందిన అభిమన్యుడి మరణానికి సైతం భోరున విలపించిన గాంధారిని యావత్‌ సృష్టిలోని మాతృత్వానికి ప్రతీకగా మలచిన ఆ ఘట్టం ప్రపంచ సాహిత్యంలోనే నిరుపమానం. 

అయినా యుద్ధం కలిగించే మోహ, దాహాల ముందు మనిషి ఓడిపోతూనే ఉన్నాడు; ఆత్మవిధ్వంసాన్ని కొని తెచ్చుకుంటూనే ఉన్నాడు; నేటి పశ్చిమాసియా యుద్ధం రేపు ఎన్ని శోకపర్వాలకు రూపుదిద్దబోతోందో! ఈ అగ్నిగుండం ఎప్పటికి ఆరనుందో!! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement