‘ఆత్రగాడికి బుద్ధి మట్టు...’ అనే నానుడి ఉత్తపుణ్యాన రాలేదు. ప్రత్యర్థులపై బురద జల్లడం కోసం, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ఎంతకైనా దిగజారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్మాదం ఆవహించిన చందాన 2024 సెప్టెంబర్‌లో ఒక మహాపరాధానికి పాల్పడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ఆరోపణకు సాహసించి ప్రపంచవ్యాప్తంగావున్న కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.
నిజం నిలకడ మీద తేలుతుందన్నట్టు ఇన్ని నెలల తర్వాత ఇదంతా పచ్చి బూటకమని సీబీఐ దర్యాప్తు నిగ్గుతేల్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి లడ్డూకు వాడిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలో ఆవగింజంతైనా నిజం లేదని నిర్ధారించింది.
హరియాణాలోని ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ)లు వేర్వేరుగా ఆ నెయ్యి నమూనాలను పరీక్షించి వెల్లడించాయని సీబీఐ తన చార్జిషీటులో తెలియజేసింది. ఈ నమూనాలు నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి సేకరించామని వివరించింది. చిత్రమేమంటే తమ కుట్ర భళ్లున బద్దలైనా టీడీపీ నాయకు లకూ, వారి వందిమాగధ మీడియాకూ బుద్ధి రాలేదు. కిందపడ్డా తమదే పైచేయి అని చెప్పటానికి నానా తంటాలూ పడుతున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మరిన్ని వేల అబద్ధాలు వల్లెవేస్తున్నారు.
ఇలాంటి వంచకులను ఆ భగవంతుడు క్షమిస్తాడా? ప్రత్యర్థులపై పైచేయి సాధించ టానికి ఎత్తులు, పైయెత్తులేయటం... ఎలాగైనా గెలిచితీరాలని ఆత్రపడటం రాజకీ యాల్లో సర్వసాధారణం. కానీ మనిషి జన్మ ఎత్తినందుకు కనీసంగానైనా ఇంగితంఉండొద్దా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంపైనే నదురూ బెదురూలేకుండా విషం చిమ్మటం మహాపచారమన్న స్పృహ ఉండనవసరం లేదా? ఈ కుట్ర వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయి.
అప్పటికి ఎడతెరిపి లేని వానలతో పొంగి ప్రవహిస్తున్న బుడమేరును కనీస ముందస్తు హెచ్చరిక లేకుండా, చడీచప్పుడూ కాకుండా వదలటం వల్ల విజయవాడ లోతట్టు ప్రాంతాలు మునిగాయి. 50 మందికి పైగా దుర్మ రణం పాలయ్యారు. అది సర్కారీ జలప్రళయమని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు తన కొంప కాపాడుకునేందుకే ఇలా చేయించారన్న విమర్శలూ వచ్చాయి.
అంతేకాక ఎన్నికల సంఘం ఎంతో తాత్సారం చేసి, నిబంధనలు కాలరాసి ఏపీలో ఎన్నికలు జరిగిన 108 రోజుల తర్వాత బూత్‌ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయన్న వివరాలతో కూడిన ఫామ్–20ని సెప్టెంబర్ 19న ఆన్‌లైన్‌లో పెట్టడానికి నిర్ణయించుకుంది. సరిగ్గా ఈ రెండు ఉపద్రవాలనుంచీ కాపాడుకోవటం కోసం అర్జెంట్‌గా జనందృష్టిని మళ్లించాలన్న ఆత్రుతలో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు కూతలు మొదల య్యాయి. ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పక్కతాళం వేశారు.
అయోధ్యకు జంతువుల కొవ్వు కలిసిన లక్ష లడ్డూలు వెళ్లాయంటూ వదిరారు. ఇరు పార్టీలూ ఇలా దుష్ప్రచారం చేస్తున్నా, అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. సొంత మనుషులతో సిట్ వేసే ప్రయత్నం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌తో బెడిసికొట్టింది.అవకాశం దొరికినప్పుడల్లా ‘నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువున’ని స్వోత్కర్షలకు పోయే చంద్రబాబుకు వాస్తవంగా అలవాటైన ఏకైక విద్య అబద్ధాలాడటం. దాని సాయంతోనే తన మామ ఎన్టీఆర్ నుంచి కుట్రపూరితంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
అంతకు ముందూ తర్వాతా కూడా తన ఎదుగుదల కోసం ఆయన చేయని పాపమంటూ లేదు. వీటన్నిటికీ పరాకాష్ఠ లడ్డూ ప్రసాదంపై సాగించిన దుష్ప్రచారం. ఇదే నేరాన్ని మరెవరైనా చేసివుంటే వ్యవస్థలు ఊరుకుంటాయా? కేసులు, శిక్షలూ లేకుండా వదులుతాయా? అందలాలెక్కినవారికి మాత్రం ఎందుకు మినహాయింపులుండాలి? ఇన్నేళ్ల పాపాలను ఈ అవసాన దశలోనైనా కడిగేసుకుందామనీ, ఇక బుద్ధెరిగి ప్రవర్తిద్దామనీ చంద్రబాబు అనుకోకపోవటం తెలుగు ప్రజల దురదృష్టం.


