అమెరికా దాడి చేస్తే.. రణరంగమే | Iran supreme leader warns of regional war in Middle East if USA attacks | Sakshi
Sakshi News home page

అమెరికా దాడి చేస్తే.. రణరంగమే

Feb 2 2026 4:15 AM | Updated on Feb 2 2026 4:15 AM

Iran supreme leader warns of regional war in Middle East if USA attacks

ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ హెచ్చరికలు

దుబాయ్‌: అగ్ర రాజ్యం అమెరికా తమపై దాడి చేసిన పక్షంలో పశ్చిమాసియా యుద్ధ రంగంగా మారుతుందని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ(86) తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజల నిరసనలను హింసాత్మక అణచివేయాలని చూస్తే తీవ్ర దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరించడం తెల్సిందే. 

విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్, ఇతర యుద్ధ నౌకలు అరేబియా జలాల్లోకి ప్రవేశించిన వేళ ఖమేనీ అమెరికానుద్దేశిస్తూ సూటిగా చేసిన హెచ్చరికలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా ముదిరే ప్రమాదముందని భావిస్తున్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలను తిరుగుబాటుగా ఖమేనీ అభివర్ణించారు. తమపై దాడులకు దిగితే అది ఈసారి ప్రాంతీయ యుద్ధంగా మారుతుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. ‘మేం రెచ్చగొట్టే వాళ్లం కాము. 

మేం ఎవరిపైనా యుద్ధానికి వెళ్లాలనుకోవడం లేదు. మమ్మల్ని వేధించాలని చూసినా, దాడులకు పాల్పడినా తీవ్రస్థాయిలో ప్రతిచర్యలు తప్పవు’అని ప్రకటించారు. అదేవిధంగా, గతంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు నిరసనలకు పాల్పడుతున్నారంటూ గతంలో వ్యాఖ్యానించిన ఖమేనీ ఈసారి ఆందోళనకారులపై స్వరం పెంచారు. ‘ఇటీవల జరుగుతున్న నిరసనలు తిరుగుబాటుతో సమానమైనవి. అందుకే ఆ తిరుగుబాటును అణచివేశాం. దేశాన్ని నడిపించే కీలక వ్యవస్థలను ధ్వంసం చేయడమే నిరసనకారుల లక్ష్యం. అందుకే వారు పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, రివల్యూషనరీ గార్డుల కేంద్రాలు, బ్యాంకులు, మసీదులపై దాడులకు పాల్పడ్డారు. ఖురాన్‌ ప్రతులను దహనం చేశారు’అని ఆరోపించారు.

ఈయూ సైనికులూ ఉగ్రవాదులే
నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న రివల్యూషనరీ గార్డ్స్‌ విభాగం బలగాలను యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)ఉగ్రవాదులుగా పక్రటించడంపై ఇరాన్‌ మండిపడింది. ఈయూ సభ్యదేశాల మిలటరీని కూడా ఉగ్ర గ్రూపులుగా ప్రకటించే విషయం పరిశీలిస్తున్నామని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం 2019లోనే రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించింది. బదులుగా ఇతర దేశాల మిలటరీని ఉగ్రవాద గ్రూపుగా ప్రకటించే విషయం తామూ పరిశీలిస్తామని అప్పట్లోనే ఇరాన్‌ తెలిపింది. రివల్యూషనరీ గార్డు విభాగం సుప్రీం నేత ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. 

అయితే, యూరప్‌లోకి ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా కట్టడి చేస్తున్న రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించడం ద్వారా యూరప్‌ తనకంటిని తానే పొడుచుకుందని గార్డుల మాజీ కమాండర్‌ మహ్మద్‌ బఘెర్‌ వ్యాఖ్యానించారు. అమెరికా మాట విని ఈయూ గుడ్డిగా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. మరో పరిణామంలో...వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ ఆది, సోమవారాల్లో లైవ్‌ ఫైర్‌ మిలటరీ డ్రిల్‌ చేపడుతోంది. ప్రపంచంలో జరిగే చమురు రవాణాలో ఐదో వంతు పర్షియన్‌ గల్ఫ్‌లోని ఈ జలసంధి ద్వారానే సాగుతోంది. తమ యుద్ధ నౌకలు, విమానాలకు నష్టం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా మిలటరీ సెంట్రల్‌ కమాండ్‌ హెచ్చరికలు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement