ఉక్రెయిన్‌ బస్సుపై డ్రోన్‌ దాడి.. మైనర్లతో సహా భారీగా మృతులు | Russia attacks Ukraine with drones | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ బస్సుపై డ్రోన్‌ దాడి.. మైనర్లతో సహా భారీగా మృతులు

Feb 2 2026 3:04 AM | Updated on Feb 2 2026 3:09 AM

Russia attacks Ukraine with drones

రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో రష్యా మరోసారి ఉ‍క్రెయిన్‌పై దాడి చేసింది. ఆ దేశంలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్‌లతో విరుచుకపడింది. ఈ దాడుల్లో 15 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎంతకీ కొలిక్కి రావడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అయితే యుద్ధాన్ని ముగించడం కోసం ఇరు దేశాలు చర్చలు జరిపినా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అయితే  రెండు దేశాల మధ్య త్వరలో మూడోసారి చర్చలు జరగనున్నాయి.  అంతేకాకుండా ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని రష్యా చర్చలకోసం మాస్కోకి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఇకనైనా యుద్ధానికి ముగింపు దొరుకుతుందా అని అంతా అనుకున్నారు. అయితే మరోసారి సీన్ రివర్స్ అయ్యింది. తాజాగా రష్యా, ఉక్రెయిన్‌పై మరోసారి డ్రోన్‌లతో విరుచుకపడింది.

ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ డీటీఈకే టార్గెట్‌గా డ్రోన్ దాడులు జరిపిందని అధికారులు తెలిపారు. కార్మికులు ఫ్యాక్టరీలో పనులు ముగించుకొని బస్సులో తిరిగి వెళుతుండగా బస్సుపై డ్రోన్‌ దాడి జరిపిందన్నారు. ఈ దాడిలో 15 మంది అక్కడికక్కడే మరణించారని పేర్కొన్నారు. మరణించిన వారిలో మైనర్లు ఉన్నారన్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాలలో  దాదాపు 90 కిపైగా డ్రోన్‌లతో తమ దేశంపై దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 

అయితే ఈ దాడులను రష్యా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయతే రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని జెలెన్‌స్కీ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement