ఇరాన్, రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ యుద్ధం వల్ల కలిగే ప్రమాదాలపై లండన్‌లోని వెస్ట్ మినిస్టర్‌లో మాట్లాడుతూ.. ఇరాన్-రష్యా ప్రభుత్వాలను ద్వేషంలో సోదరులుగా అభివర్ణించారు.
ఇరాన్ తయారు చేసిన షాహెడ్ ‘కామికాజే’ డ్రోన్లు రష్యాకు విక్రయించబడుతున్నాయని, అవి ఉక్రెయిన్‌పై దాడుల్లో ఉపయోగించబడుతున్నాయని వివరించారు. రష్యా చమురుపై ఆంక్షలను సడలించడం ప్రమాదకరమని, మాస్కోపై ఒత్తిడి కొనసాగించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
జెలెన్‌స్కీ తన ప్రసంగంలో మధ్యప్రాచ్య యుద్ధాన్ని ఉక్రెయిన్‌లో జరుగుతున్న దీర్ఘకాలిక యుద్ధంతో అనుసంధానిస్తూ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఆధునిక యుద్ధంలో పయనీకులుగా మారిందని, తమ అనుభవాన్ని మిత్రదేశాలతో పంచుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ చౌకగా తయారయ్యే ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను ఉపయోగించి రష్యా దాడులను ఎదుర్కొంటోందని తెలిపారు.
ప్రస్తుతం 201 మంది ఉక్రెయిన్ సైనిక నిపుణులు మధ్యప్రాచ్యంలో ఉన్నారని, మరో 44 మంది అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరంతా ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొనే విధానాలను మిత్రదేశాలకు బోధిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, రక్షణ మంత్రి జాన్ హీలీ, ప్రతిపక్ష నాయకులు, 60 మంది ఎంపీలు, లార్డులు పాల్గొన్నారు.


