గల్ఫ్ ఇంధన వనరులే లక్ష్యం ∙మంటల్లో ఖతర్ ఎల్‌ఎన్‌జీ క్షేత్రం
17 శాతం ఉత్పత్తి కేంద్రాలు బుగ్గి?
భారీ నష్టం, కోలుకునేందుకు ఐదేళ్లు!
రూ. 2.4 లక్షల కోట్లు అవసరం!
అక్కడినుంచే మనకు ఎల్‌ఎన్‌జీ
సౌదీ అరాంకోపైనా ఇరాన్ దాడులు
కువైట్, అబుదాబి క్షేత్రాలపైకీ డ్రోన్లు
వాటిని నాశనం చేస్తామని హెచ్చరిక
అప్పుడు సౌత్ పార్స్ క్షేత్రం బుగ్గే!
ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం
యుద్ధరంగంలోకి సౌదీ అరేబియా?
దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను నానాటికీ పెను ప్రమాదంలోకి నెడుతోంది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై చేసిన ఇజ్రాయెల్ దాడి తీవ్ర విపరిణామాలకు దారి తీస్తోంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ గురువారం గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలన్నింటికీ నిప్పు పెట్టే ప్రయత్నం చేసింది! ఖతర్, సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి సహా పలుచోట్ల చమురు, సహజవాయు క్షేత్రాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెను కల్లోలం చెలరేగింది.
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎల్‌ఎన్‌జీ క్షేత్రమైన ఖతర్‌లోని రస్ లఫాన్ ఇరాన్ దాడుల్లో భారీగా దెబ్బ తిన్నది. అక్కడి ఉత్పత్తి కేంద్రాల్లో 17 శాతం మేరకు బుగ్గిపాలైనట్టు ఖతర్ ప్రకటించింది. ‘‘ఇది అంచనాలకు అందనంతటి భారీ నష్టమిది! దీన్నుంచి కోలుకునేందుకు కనీసం మూడు నుంచి ఐదేళ్ల సమయం, రూ.2.4 లక్షల కోట్ల (26 బిలియన్ డాలర్ల) నిధులు అవసరం!’’ అని ఖతర్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ కాబి పేర్కొన్నారు! భారత ఎల్‌ఎన్‌జీ అవసరాలను సగానికి సగం రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. దాంతో ఈ దాడి ప్రభావం మనపై తీవ్రంగా ఉండనుంది!!
సౌదీ అరేబియాలో ఎర్రసముద్ర తీరంలో రేవు పట్టణం యన్బులో ఉన్న సమ్రెఫ్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి దిగింది. అరాంకోలో భాగమైన ఆ క్షేత్రంలో భారీగా మంటలు చెలరేగాయి. నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నట్టు సౌదీ రక్షణ శాఖ పేర్కొంది. ‘‘ఇరాన్ తీరుతో విసిగిపోయాం. మా ఓపికకూ హద్దుంటుంది! పరిస్థితి చేయి దాటితే ఇరాన్‌పై యుద్ధంలోకి మేమూ ప్రవేశించాల్సి వస్తుంది’’ అంటూ సౌదీ రాకుమారుడు, విదేశాంగ మంత్రి ఫైసల్‌బిన్ ఫర్హాన్ అల్ సౌద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘తిరుగులేని ఆయుధ సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత సౌదీ, దాని భాగస్వామ్య దేశాల సొంతం.
అవసరమైతే వాటిని ఇరాన్‌పై ప్రయోగించేందుకు ఏమాత్రమూ వెనకడబోమని గుర్తుంచుకుంటే మంచిది’’ అని హితవు పలికారు. ఇరాన్ డ్రోన్లు కువైట్‌లో కూడా అల్ అహ్మదీ, మైనా అబ్దుల్లా చమురు క్షేత్రాలకు, యూఏఈ, అబుదాబిల్లోనూ పలు సహజవాయు కేంద్రాలకు నష్టం కలిగించాయి. తమ ఇంధన వ్యవస్థలపై దాడులకు దిగి ఇజ్రాయెల్ దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసిందని ఇరాన్ ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ‘‘నిజానికి పొరుగు దేశాల ఇంధన క్షేత్రాలపై దాడులు చేసే యోచనే మాకు లేదు. కానీ మా ఇంధన వ్యవస్థలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో యుద్ధం మరో స్థాయికి చేరింది.
అందుకే గల్ఫ్ దేశాల ఇంధన వ్యవస్థలపై మేమూ దాడులకు దిగాం. మా ఇంధన వ్యవస్థలపై మరోసారి దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని సదరు వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి తీరతాం’’ అంటూ హెచ్చరించింది! రస్ లఫాన్‌పై దాడుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దానిపై మళ్లీ దాడికి దిగితే కనీవినీ ఎరగని స్థాయి దాడులతో సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రాన్ని పూర్తిగా బుగ్గిపాలు చేసేస్తామని ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయబోదని అధ్యక్షుడు హామీ ఇచ్చారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తూ 12 అరబ్, ఇస్లామిక్ దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ‘‘దాడులను ఇరాన్ తక్షణం మాను కోవాలి. లేదంటే స్వీయరక్షణ చేసుకునే హక్కు గల్ఫ్ దేశాలకు ఉంటుంది’’ అని హెచ్చరించాయి. నౌకలు, ఇంధన వ్యవస్థలపై ఇరాన్ దాడులను జపాన్‌తో పాటు పలు యూరప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. రస్ లఫాన్‌పై దాడికి నిరసనగా ఇరాన్ దౌత్య కార్యాలయంలోని అధికారులంతా 24 గంటల్లోపు దేశం వీడాలని ఖతర్ ఆదేశించింది. తాజా పరిణామాలో చమురు ధరలు మరింతగా భగ్గుమన్నాయి. గురువారం బ్యారెల్ ధర 119 డాలర్ల దాకా ఎగబాకింది!
ఇరాన్ జలాంతర్గాములు ఖతం!
ఇరాన్ జలాంతర్గాములన్నింటినీ ధ్వంసం చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఆ దేశం వద్ద ఉన్న 11 జలాంతర్గాములనూ బుగ్గిపాలు చేసినట్టు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇరాన్ పౌర, సైనిక నేతలందరినీ లక్ష్యం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పడవలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించినట్టు అమెరికా ప్రకటించింది.
ఇరాన్ భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలపై 5,000 పౌండ్ల బరువైన భారీ బాంబులు వేసినట్టు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ వెల్లడించారు. మరోవైపు, కాస్పియన్ సముద్రంలో పలు ఇరాన్ లక్ష్యాలపై తొలిసారి దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఒక నౌకాశ్రయం, పలు నౌకలు, కమాండ్ సెంటర్‌పై క్షిపణుల వర్షం కురిపించినట్టు వెల్లడించింది. అంతేగాక టెహ్రాన్‌తో సహా ఇరాన్‌వ్యాప్తంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల పరంపర గురువారం కూడా తీవ్రస్థాయిలో కొనసాగింది. కొన్ని వందల లక్ష్యాలను క్షిపణులు, బాంబులతో ధ్వంసం చేసినట్టు ఇరు దేశాలు ప్రకటించాఇయి.
ఇజ్రాయెల్‌పైనా దాడులు
ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్ గురువారం ఎడాపెడా దాడులకు దిగింది. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు పలు నగరాల్లో జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీశారు. చాలాచోట్ల భవనాలు భారీగా దెబ్బ తిన్నాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లో కీలకమైన విద్యుత్ గ్రిడ్ బాగా క్షిపణి దాడుల్లో దెబ్బ తిన్నట్టు ఇంధన మంత్రి ఎలీ కోహెన్ చెప్పారు. హైఫియా నగరంలో చమురు రిఫైనరీకి కూడా దాడుల్లో నష్టం జరిగింది. అక్కడినుంచి భారీగా పొగ వెలువడుతున్న దృశ్యాలను ఇజ్రాయెల్ మీడియా ప్రసారం చేసింది.
లెబనాన్‌లో 1,000 దాటిన మృతులు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ దేశంలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 1,000, నిర్వాసితుల సంఖ్య 10 లక్షలు దాటినట్టు ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. లెబనాన్‌లో 500 మందికి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.
పొంచి ఉన్న ఇంటర్నెట్ సంక్షోభం
సముద్ర ఇంటర్నెట్ కేబుళ్లను ఇరాన్ కత్తిరిస్తుందా?
ఇప్పటికే పశి్చమాసియాలో అమెరికా మిత్రదేశాలపై మిస్సైళ్లతో దాడిచేస్తున్న ఇరాన్ ఇకపై హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న సముద్రగర్భ ఇంటర్నెట్ భారీ కేబుళ్లను కత్తిరిస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఆయా కేబుళ్లపై ఆధారపడిన దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. నిజంగానే ఇరాన్ కేబుళ్ల కత్తిరింపు పర్వానికి తెరలేపితే మళ్లీ కేబుళ్ల పునరుద్ధరణకు వారాలు లేదా నెలల సమయం పడుతుందని అంతర్జాతీయ కేబుల్ నెట్‌వర్క్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ డిజిటల్ గుండెకు ఈ సముద్రకేబుళ్లను కవాటాలుగా చెప్పొచ్చు.
పలు దేశాల బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, మెయిళ్లు, కృత్రిమమేధ సేవలు, వీడియో కాల్స్‌కు సంబంధించిన డేటా మొత్తం ఈ కేబుళ్ల ద్వారానే బదిలీ అవుతోంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య ఇంటర్నెట్ వారధులుగా ఈ సముద్ర కేబుళ్లు ఖ్యాతిగాంచాయి. హార్మూజ్, ఎర్ర సముద్రం గుండా దాదాపు 17 భారీ ఇంటర్నెట్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఏఏఈ–1, ఫాల్కన్, ‘గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కేబుల్ సిస్టమ్’, ‘టాటా–టీజీఎన్ గల్ఫ్ కేబుల్’వంటి పలు కేబుళ్లు పర్షియన్ గల్ఫ్ జలాల గుండా వెళ్తున్నాయి. ఇవన్నీ భారత విదేశీ డేటా కనెక్షన్లకు కీలకం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో పెద్ద డేటా సెంటర్లను నెలకొల్పేందుకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి.
ఇక్కడి డేటా సెంటర్లను విదేశాల్లోని వినియోగదారులు, మార్కెట్లతో అనుసంధానించి గల్ఫ్‌దేశాలను భవిష్యత్‌లో ఏఐ కేంద్రాలుగా మార్చాలని ఆశిస్తున్నాయి. వీటికి ఇవే కేబుళ్లు ప్రాణాధారం. ఇప్పుడు ఈ కేబుళ్లను ఇరాన్ సముద్ర మందుపాతరలతో నాశనంచేస్తే వెంటనే పునరుద్ధరించడం కష్టం. కొత్త కేబుళ్లు అమర్చేందుకు ప్రత్యేక నౌకలు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అవి రావడం దాదాపు అసాధ్యం. దీంతో పునరుద్ధరణ పనులు ఆగిపోయి వారాలు లేదా నెలల తరబడి ఈ మార్గంలో డిజిటల్ లావాదేవీలు, డేటా బదిలీ ఆగిపోయే ప్రమాదముందని కేబుల్ సేవాలరంగ సంస్థ ‘టెలీజియోగ్రఫీ’లో నిపుణుడు అలాన్ మౌల్దీన్ చెప్పారు.
ఇరాన్‌పై యుద్ధం కోసం... రూ.18.5 లక్షల కోట్లు
పెంటగాన్ అభ్యర్థన
వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధం నిమిత్తం ఏకంగా మరో రూ.18.5 లక్షల కోట్ల (200 బిలియన్ డాలర్ల) అదనపు నిధులు కావాలని అమెరికా అంచనా వేసింది! వాటిని విడుదల చేయాల్సిందిగా కాంగ్రెస్‌ను పెంటగాన్ అభ్యరి్థంచింది. ఈ మేరకు వైట్‌హౌస్‌కు ఇప్పటికే లేఖ పంపినట్టు వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించింది. దీనిపై మీడియా ప్రశ్నలకు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నేరుగా బదులివ్వలేదు. దుష్ట నిర్మూలనకు నిధులు కావాల్సిందేనంటూ సరిపెట్టారు. ఇంత భారీ నిధులకు కాంగ్రెస్ ఆమోదం అనుమానమే.దీనిపై ట్రంప్ సర్కారుకు చట్టసభ నుంచి పలు ప్రశ్నలు ఎదురవడం ఖాయమని భావిస్తున్నారు.
యూఏఈ నుంచి ‘యాపిల్’ ఔట్?
పశి్చమాసియా ఉద్రిక్తతల కారణంగా దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ల నిల్వ కేంద్రాన్ని యూఏఈ నుంచి తరలిస్తోంది. యాపిల్‌కు భారత్‌లో భారీ ఐఫోన్ తయారీ కేంద్రమున్న విషయం తెలిసిందే. వాటిని అమెరికాకు రవాణా చేసే క్రమంలో దుబాయ్ అతి పెద్ద నిల్వ కేంద్రంగా ఉపయోగపడుతోంది.
గల్ఫ్‌కు భారత యుద్ధనౌకలు
హార్మూజ్‌ను దాటేందుకు ఎదురుచూస్తున్న తన నౌకల రక్షణ నిమిత్తం భారత్ మరిన్ని యుద్ధ నౌకలను గల్ఫ్ తీరానికి తరలిస్తోంది. నావికాదళం ఇప్పటికే ఆరుకు పైగా యుద్ధ నౌకలను మోహరించినట్టు తెలుస్తోంది. హార్మూజ్ వద్ద 22 భారత నౌకలు చిక్కుబడి ఉండటం తెలిసిందే. వీటిలో సగానికి పైగా చమురు, ఎల్పీజీ నిల్వలతో కూడినవే.
అమెరికా విమానం కూల్చివేత!
ఇరాన్ గురువా రం అమెరికా ఎఫ్–35 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు తెలుస్తోంది! ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచీ అగ్ర రాజ్య ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు, ఇరాన్‌పై అణ్వస్త్ర దాడికి అమెరికా యోచన చేస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


