హ్యాపినెస్‌లో భారత్‌ స్థానం ఎంతో తెలుసా..? | World Happiness Report 2026: Finland and Afghanistan maintain top and bottom positions respectively, India improves ranking | Sakshi
Sakshi News home page

హ్యాపినెస్‌లో భారత్‌ స్థానం ఎంతో తెలుసా..?

Mar 20 2026 1:34 AM | Updated on Mar 20 2026 9:30 AM

World Happiness Report 2026: Finland and Afghanistan maintain top and bottom positions respectively, India improves ranking

వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026 మార్చి 19న విడుదలైంది. ఈ నివేదికలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదో ఏడాది ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ రూపొందించిన ఈ నివేదికలో జీవన సంతృప్తి, సామాజిక మద్దతు, అవినీతి తక్కువ స్థాయిలు వంటి అంశాలు ప్రధానంగా పరిగణించబడ్డాయి.

ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో ఐస్లాండ్ రెండో స్థానంలో, డెన్మార్క్ మూడో స్థానంలో నిలిచాయి. లాటిన్ అమెరికా దేశమైన కోస్టా రికా నాలుగో స్థానాన్ని సాధించడం విశేషం. ఇది ఆ దేశానికి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ర్యాంక్. స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వరుసగా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.  

భారత్‌ ఎక్కడ..?
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన 147 దేశాల జాబితాలో భారత్‌ 116 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రెండు స్థానాలు మెరుగుపడింది. 2025లో ఈ జాబితాలో భారత్‌ 118 స్థానంలో ఉండింది.

చిట్టచివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్‌
అతి తక్కువ సంతోషకరమైన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్‌ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ దేశం 147వ స్థానానికి పరిమితం కాగా.. దానికి ముందు స్థానాల్లో నియెర్రా లియోన్‌, మాలావీ, జింబాబ్వే, బోట్స్‌వానా వంటి దేశాలు ఉన్నాయి.

అమెరికాలో సంతోషం క్రమంగా తగ్గిపోతుంది..!
వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026లో అమెరికా 23వ స్థానంలో నిలిచింది. గత కొద్ది రోజులుగా ఈ జాబితాలో అమెరికా ర్యాంక్‌ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. 2022లో 15వ స్థానంలో ఉండిన ఆ దేశం.. నాలుగేళ్లు తిరిగేసరికి 8 స్థానాలు దిగజారి 23వ స్థానానికి పడిపోయింది.

ఈ జాబితాలో అమెరికా సహా ఇంగ్లీష్‌ మాట్లాడే దేశాలు ఒక్కటి కూడా టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. నార్డిక్ దేశాలు మళ్లీ అగ్రస్థానాలను ఆక్రమించాయి. ఈ దేశాల్లో సామాజిక మద్దతు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, తక్కువ అవినీతి వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని పెంచుతున్నాయని నిర్ధారించబడింది. 

కోస్టా రికా లాంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంస్కృతిక విలువలతో సంతోష సూచీలో గణనీయమైన పురోగతి సాధించాయి. అమెరికా, భారత్ వంటి పెద్ద దేశాలు సంతోష సూచీలో వెనుకబడటానికి ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక విభజన, రాజకీయ అస్థిరత వంటి అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ నివేదికలో సోషల్ మీడియా, టెక్నాలజీ ప్రభావం వెల్‌బీయింగ్‌పై ఎలా ఉందో ప్రత్యేకంగా విశ్లేషించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement