పశ్చిమాసియాలో ప్రపంచీకరణ శిథిలం | Globalization in ruins in West Asia | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియాలో ప్రపంచీకరణ శిథిలం

Mar 17 2026 3:43 AM | Updated on Mar 17 2026 3:43 AM

Globalization in ruins in West Asia

ఇరాన్‌పై లెక్కలేనితనంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదలెట్టిన యుద్ధం ఆయన చేయి దాటిపోయింది. ట్రంప్‌ ప్రభుత్వ సామ్రాజ్యవాద  పర్యవసానంగా నష్టాన్ని చవిచూస్తున్న ఓ భారతీయురాలిగా ఆయన పరాజయం చూసి కొంత పైశాచికానందం పొందాలని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇరాన్‌పై సైనిక చర్య మన ఆర్థిక వ్యవస్థకు వినాశకర పరిణామాలను కలుగజేస్తోంది. మన ఇంధన భద్రతకు ముప్పు తెస్తోంది. మన భౌగోళిక రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తోంది. 

గల్ఫ్‌ దేశాలలో నివసిస్తున్న దాదాపు కోటి మంది భారతీయులు వారు ఏమాత్రం ఆశించని యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. భారతదేశపు ముడి చమురు దిగుమతులలో దాదాపు నలభై శాతం హోర్మూజ్‌ జలసంధి ద్వారానే వస్తాయి. ఆ సముద్ర మార్గం ఇపుడు పూర్తిగా ఇరానియన్ల చేతిలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తాము విధిస్తామని చెప్పిన అపరాధ సుంకాన్ని మాఫీ చేస్తున్నట్లు అమెరికా చెప్పుకొంది. నిజానికి, శ్వేత సౌధం చెప్పుకుంటున్నట్లుగా, మనం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఎన్నడూ ఆపలేదు. అమెరికా రాయితీ అధిక చమురు ధరల నుంచి మనకేమీ రక్షణ కల్పించలేదు. 

పెట్టుబడిదారులకూ రక్షణ కరవు
ఇది పైకి ప్రపంచీకరణ పర్యవసానంగా కనిపించవచ్చు. వాస్తవానికి, ఈ యుద్ధం ప్రపంచీకరణకు వ్యతిరేకమైనది. ట్రంప్‌ పాలన ప్రపంచీకరణకు చెందిన మూల సూత్రాన్నే ధ్వంసం చేసింది. ప్రపంచీకరణ అంటే, కేవలం పరస్పరం ఆధారపడటమే కాదు, ఏకీకరణ చెందడం కూడా. దుబాయ్, అబు దాబీ రోజూ డ్రోన్లు, క్షిపణుల దాడులకు లోనవుతున్నాయి. ప్రపంచీకరణ యుగంలో, పెత్తందారీ దేశాల పెనుగాలుల నుంచి పెట్టుబడిదారీ ఒయాసిస్సులకు రక్షణ ఉంటుందనే ఆలోచనను ట్రంప్‌ యుద్ధం పటాపంచలు చేసింది.

ట్రంప్‌ అచ్చం ఒక నిర్దాక్షిణ్య నయా సామ్రాజ్యవాదిగానే ప్రవర్తిస్తున్నారు. అమెరికా అణు జలాంతర్గామి ఒకటి అంతర్జాతీయ జలాలలో ఇరానియన్‌ యుద్ధ నౌకను ముంచేసింది. ‘మిలన్‌’ నౌకాదళ విన్యాసాలలో అది భారతదేశానికి అతిథిగా వ్యవహరించిన రెండు వారాలకే ఆ దుర్ఘటన చోటుచేసుకుంది. అమెరికా దుశ్చర్య ఒక ప్రమాదకర, అశాంతిదాయక ప్రమాణాన్ని నెలకొల్పింది. రేపు, చైనా కూడా తన స్వీయ సైనిక చర్యకు తన నౌకలను ఇలాగే హిందూ మహా సముద్రంలోకి పంపించవచ్చు.

భారత్‌కు రెండు వైపులా పాఠాలు
ఉన్న సమాచారం మేరకు, ఆ తర్వాత, భారత్‌ మంచి పనే చేసింది. శరణు కోరిన మూడు ఇరానియన్‌ నౌకలకు అభయమిచ్చింది. ఆ నౌకలకు 24 గంటల్లోగా అండగా నిలిచింది. కొలంబోలో ఉన్న ఐ.ఆర్‌.ఐ.ఎస్‌. దేనా నౌక నుంచి ఆపదలో ఉన్నట్లు సంకేతం రాగానే అన్వేషణ, రక్షణ సిబ్బందితో రంగంలోకి దిగింది. 

అమెరికా తన కార్యకలాపాలను హిందూ మహా సముద్రంలో, శ్రీలంకకి సమీపంలోకి విస్తరిస్తున్నట్లు మన నౌకాదళానికి తెలియజేయలేదు. ఎలాంటి కలాపాలు చేపట్టబోతున్నారో మనకేమీ చెప్పనవసరం లేదు. కనీసం తమ ఉనికిని తెలియచేయడం వృత్తిపరమైన మర్యాద అనిపించుకుంటుంది. అదే సమయంలో, అక్కడి జలాలలో ఒక భారతీయ నౌక ఉండి ఉంటే పరిస్థితి ఏమిటి? 

‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. కానీ, ఆ సమరం నాలుగు రోజులకు బదులు నాలుగు వారాల పాటు సాగి ఉంటే పరిస్థితిని ఊహించండి. ఉగ్రవాదులు లేదా పోషకుల చేతుల్లో డ్రోన్లు ఉండి ఉంటే! స్వల్ప కాలిక భద్రతా సవాళ్ళ నుంచి రక్షణకైనా లేదా దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టి అయినా, భారత్‌ సైనిక శక్తిని బలోపేతం చేసుకుని తీరాలి. ఆ దిశగా సాగించే దీర్ఘకాలిక పయనానికి మన ప్రజాస్వామ్యం, వైవిధ్యం, బహుళత్వం, రాజ్యాంగ విలువలకు మనం ఇచ్చే ప్రాధాన్యం కరదీపికలు కావాలి. ట్రంప్‌ గద్దె దిగిన తర్వాత కూడా, ప్రపంచంలో మరెవరైనా ఇదే రీతిలో వ్యవహరించవచ్చు. మన మార్కెట్లు, సైనిక శక్తే మనకు శ్రీరామ రక్ష.  

మరింత తిరోగమన వ్యవస్థలు
అమెరికా అధ్యక్షులలో బాధ్యతారహితమైన యుద్ధాలను ప్రారంభించింది ట్రంప్‌ ఒక్కరే కాదు. దాదాపుగా 1960ల నుంచి ఇదే కథ నడుస్తోంది. క్యూబాలో కెన్నెడీ వేలు పెట్టడం నుంచి అఫ్గానిస్తాన్‌లో పరాభవం వరకు వివిధ దేశాల్లో పాలనా వ్యవస్థలను మార్చడానికి అమెరికా చేసిన ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. వారు ఏ పాలనా వ్యవస్థను కూలదోస్తామని చెబుతున్నారో ఆ పాలనా వ్యవస్థ కంటే రాక్షసమైన వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇరాక్‌లో ‘ఐసిస్‌’ లేదా అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ పునరాగమనం కన్నా నిదర్శనం ఏం కావాలి? 

కాకపోతే దౌత్యానికి సంబంధించిన మొత్తం రీతి రివాజులను పక్కకు నెట్టేసిన మొదటి ప్రభుత్వంగా ట్రంప్‌ ప్రభుత్వం అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ సందర్భంగా, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ దావోస్‌లో చేసిన ప్రసంగం గుర్తుకు వస్తోంది. దౌత్యపరమైన పరిభాష చక్కెర పూతగా మారిందనీ, దౌత్యపరమైన చర్చలు కపటంగానే సాగుతున్నాయనీ ఆయన పేర్కొన్నారు. అది నిజమే కావచ్చు కానీ, కనీసం దానివల్ల కలసి కూర్చుని మాట్లాడుకునేందుకు ఒక ఉమ్మడి భాష అంటూ ఉంటుంది. పాటించవలసిన మానవ మర్యాదలు ఉంటాయి. ముఖ్యంగా, ప్రత్యర్థి దేశాన్ని బలహీనపరచేందుకు సాగే రణ తంత్రాలలో అవి సహాయపడతాయి. 

ఇది ఇరానియన్‌ పాలక వ్యవస్థకో లేదా మరి ఏ ఇతర నిరంకుశ ప్రభుత్వానికో చేస్తున్న సంగ్రహ హెచ్చరిక కాదు. నియంతృత్వాలకు లేదా మతపరమైన ఛాందసవాద పాలకులకు లేదా నియాండర్తల్‌ వ్యవస్థలకు గుణపాఠం నేర్పేందుకు చేసే యుద్ధాలకు ఒక అంతిమ లక్ష్యం అంటూ ఉండాలి. సాధారణ ప్రజానీకంపై విరుచుకుపడటం వల్ల ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి చపలచిత్త ధోరణులు, హద్దులేనితనానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యం అయితే తప్ప ఫలితం ఉండదు. లేదంటే ప్రపంచీకరణ ఛిన్నాభిన్నమవుతుంది. ఏ దేశానికాదేశం అతలాకుతలం అవుతుంది.

-వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ (‘ద హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)
-బర్ఖా దత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement