వలస జీవులపై విషం కక్కే సంస్కృతి ఒడిశాలో ఇంకా పోలేదని అక్కడ జరుగుతున్న దాడులు తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు పిల్లల్ని అపహరించడానికొచ్చారనో, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడబోయారనో బెంగాల్ నుంచి వలసవచ్చి చిన్నా చితకా పనులు చేసుకుంటున్నవారిపై దాడులు జరిగాయి. ఇప్పుడు ‘విదేశీయుల’ పేరిట ఆ వేలంవెర్రి కొనసాగుతోంది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బెంగాల్ నుంచి ఉన్ని దుస్తులు అమ్ముకోవటానికి వచ్చిన యువకులపై అయిదారు నెలలుగా మూకలు దాష్టీకం చేస్తున్నాయి. ఎవరూ అకారణంగా ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి వలసలకు సిద్ధపడరు. సరైన జీవిక దొరక్క తప్పనిసరై వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతారు. కొన్ని వలసలు సీజనల్‌గా ఉంటాయి. తొలకరి సమయంలో పంట పొలాల్లో పనులు దొరుకుతాయని వచ్చేవారుంటారు. శీతకాలం సమీపించే సమయానికి ఉన్ని దుస్తులు, దోమతెరలు వగైరాలు అమ్ముకోవడానికి పోతారు. అదేమీ భద్రమైన జీవితం కాదు.
సంపాదనపై అనిశ్చితి. వచ్చిన తృణమో, పణమో రక్షించుకోవటం కూడా సమస్య. స్థానికుడు కాదని తెలిశాక రౌడీ మూకల ఆగడాలుంటాయి. పోలీసులు సరేసరి. వలస పోయేవారికి శాశ్వత చిరునామా ఉండదు గనుక స్వరాష్ట్రంలోనూ, వలసపోయే రాష్ట్రంలోనూ కూడా తిప్పలే. వారు ఎక్కడా ఓటు బ్యాంకు కాదు. కనుక సంక్షేమం ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది. ఇప్పుడు వలస జీవులను అకారణంగా వేధించటానికి ‘విదేశీయులు’ అనే ఆయుధం అక్కరకొస్తోంది. పార్టీలు తమకు రాలిపడతాయనుకున్న ఓట్ల కోసం ఈ ఆయుధాన్ని నిర్విచక్షణగా ఉపయోగిస్తుంటే రౌడీ మూకలకూ అదే ఆదర్శం! నాలుగు రోజుల క్రితం రాహుల్ ఇస్లాం అనే యువకుడిపై గంజాం జిల్లాలోని గ్రామంలో మూక విరుచుకుపడి తీవ్రంగా దాడిచేసి, అతని దగ్గరున్న రూ. 6,000 అపహరించింది. ఆధార్ కార్డు అడగటం, అది నకిలీదని ఆరోపిస్తూ కొట్టడం సరే.... అతని పేరునుబట్టి వేరే మతం వాడని తెలిశాక ‘జై శ్రీరాం’ అని బలవంతంగా అనిపించి సమస్తం ఊడ్చి పంపారు.
అంతకు నాలుగు రోజుల ముందు బెంగాల్ నుంచి వెళ్లిన మరో ఇద్దరు యువకులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ ఉదంతాలపై పశ్చిమ బెంగాల్ వలస కార్మికుల సంక్షేమ సంఘం ఒడిశా డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఫలితం ఉంటుందా? ఫిర్యాదు చేయడానికి పోతే ‘బతకాలని ఉంటే ఇటువైపు వచ్చే ప్రయత్నం చేయొద్ద’ని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారట. కొన్ని వారాల క్రితం బెంగాల్ నుంచి పోయిన ముగ్గురు కూలీలు పోలీసుల నుంచి ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నారు. వారిపై బంగ్లాదేశీయులన్న ముద్రవేసి మూడు రోజులపాటు పోలీసు స్టేషన్‌లో నిర్బంధించగా, చివరకు పశ్చిమ
బెంగాల్ పోలీసుల జోక్యంతో బయటపడ్డారు. కేంద్రపారా, ఝార్సుగూడ, జగత్‌సింగ్ పూర్ జిల్లాల్లో బెంగాల్ నుంచి వచ్చిన 500 మందికి పైగా వలస కార్మికులను పోలీసులు నిర్బంధించి పలు విధాలుగా వేధించారు.
ఏడేళ్ల క్రితం గుజరాత్‌లో ఒక పసిపాపపై బిహార్‌కు చెందిన యువకుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ వచ్చినప్పుడు మూకలు చెలరేగి ‘బయటి వ్యక్తుల’ని అనుమానం వచ్చినవారిని తీవ్రంగా కొట్టి, వారి గుడిసెలకు నిప్పంటించారు. దాంతో బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది ప్రాణభయంతో స్వస్థలాలకు తరలిపోయారు. ఆలస్యంగానైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని భరోసా ఇచ్చాకే పరిస్థితి చక్కబడింది. ఒడిశాలో రౌడీ మూకల ఆగడాలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటమే కాదు... తనవంతుగా వేధింపులకు దిగుతోంది. ఇది సరికాదు.
వలసలు నిజానికి జనాగ్రహం నుంచి పాలకుల్ని కాపాడే రక్షాకవచాలు. కడుపు మండిన వారు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా, తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ వేరేచోటకు వలసపోవడంలో అభ్యంతరం ఎందుకుండాలి? దేశభక్తి గురించి లెక్చెర్లిస్తూ పక్క రాష్ట్రం నుంచి వచ్చినవారిని విదేశీయులుగా ముద్రేయటం సిగ్గనిపించటం లేదా? ఒడిశా నుంచి కూడా లక్షల మంది వలసపోతుంటారు. ఈ చీడ విస్తరిస్తే అన్ని రాష్ట్రాల వారికీ పరాయి రాష్ట్రాల్లో ఇదే దుఃస్థితి తలెత్తదా? ఈ పోకడలు సమైక్య భారత్ భావనకు ముప్పు కలిగించవా? ఒడిశా పాలకులు ఆలోచించాలి.


