ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావించే కామన్వెల్త్ శతవార్షిక క్రీడా సంరంభం 2030లో నిర్వహించే అవకాశం లాంఛనంగా మన దేశానికి దక్కింది. గత నెలలో కామన్వెల్త్ క్రీడల కార్యనిర్వహణా బోర్డు ఈ క్రీడోత్సవాలకు అహ్మదాబాద్ వేదికైతే బాగుంటుందని సిఫార్సు చేసింది. మనతోపాటు నైజీరియా కూడా పోటీపడినా ఇంత పెద్ద ఉత్సవాన్ని నిర్వహించగల సామర్థ్యం భారత్‌కే ఉన్నదని మెజారిటీ సభ్యులు భావించారు. కామన్వెల్త్ క్రీడల్లో దాదాపు వంద దేశాలకు చెందిన వేలాది మంది మెరికల్లాంటి క్రీడాకారులు, క్రీడాకారిణులు పాల్గొంటారు. బహుళ మాధ్యమాల ప్రభావం ఎంతగానో పెరిగిన వర్తమానంలో ఈ క్రీడలు యువతపై చూపే ప్రభావం అపారం. అయితే అట్టహాసంగా నిర్వహించటం, పరమాద్భుతమని ప్రపంచం మెచ్చటంతోనే సంతృప్తిపడకూడదు. 2036లో ఒలింపిక్ క్రీడోత్సవాల నిర్వహణకు సైతం భారత్ సంసిద్ధంగా ఉన్నదని ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకెళ్లాలి.
ఈ సందర్భంలో 2010 నాటి కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో మనకెదురైన చేదు అనుభవాలు, తత్కారణంగా మన దేశం అభాసుపాలైన వైనమూ దృష్టిలో పెట్టుకోవాలి. అప్పటికే మనకు పలు క్రీడోత్సవాలు నిర్వహించిన నేపథ్యం ఉంది. 1951, 1982 సంవత్సరాల్లో ఆసియా క్రీడోత్సవాలు నిర్వహించాం. 2003లో ఆఫ్రో–ఆసియన్ క్రీడలకు భారత్ వేదిక పరిచింది. ఇక క్రికెట్ టోర్నమెంట్లు, హాకీ ప్రపంచ కప్ ఈవెంట్లు దేశంలో పలు నగరాల్లో నిర్వహించిన అనుభవం ఉంది. అయినా 2010 కామన్వెల్త్ క్రీడోత్సవాల నిర్వహణ అసమర్థంగా, కుంభకోణాలమయంగా మారడం, అందరూ మనల్ని వేలెత్తి చూపే దుఃస్థితి ఏర్పడటం ఎవరూ మరిచిపోలేరు. భారీ మొత్తాలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం, నాసిరకం నిర్మాణ పనులు, అవి కూడా సమయానికి పూర్తికాకపోవటం, ఆర్థిక అవకతవకలు, విధానపరమైన ఉల్లంఘనలు దిగ్భ్రాంతిపరిచాయి.
సీబీఐ దర్యాప్తు, అప్పటి కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ అరెస్టు కావటం, నిర్మాణ పనుల్లో ఏమాత్రం అనుభవం లేనివారికి కాంట్రాక్టులు అప్పగించారనీ, లంచాలు మెక్కి నాసిరకం ఉపకరణాలు కొన్నారనీ సీవీసీ తేల్చటం ఎవరూ మరిచిపోరు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రీడా బృందాలకు అద్భుతమైన సదుపాయాలున్న వసతి కల్పించి, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన బృందాలకు నాసిరకం వసతినిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తమపై జాతివివక్ష చూపారని ఆ దేశాల క్రీడాకారులు తీవ్ర విమర్శలు చేయటం దేశ ప్రతిష్ఠను మట్టిపాలు చేసింది.
భారీ క్రీడోత్సవాలు జరగబోయే నగరాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తాయి. సరికొత్త స్టేడియాలు నిర్మాణమవుతాయి. ఆతిథ్యం ఇచ్చే దేశం గనుక ప్రతి ఈవెంట్‌లోనూ విజయం సాధించేలా క్రీడా బృందాల నైపుణ్యాలకు పదును బెడతారు. అథ్లెట్లకు మంచి సదుపాయాలతోపాటు మెరుగైన పారితోషికాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామస్థాయి వరకూ యువతలో క్రీడలపై ఉత్సాహాన్ని పెంచేలా చేయగలిగితే, ప్రాథమిక పాఠశాలలు మొదలుకొని విద్యా సంస్థ లన్నీ పిల్లల్లో క్రీడాసక్తిని పెంపొందిస్తే, క్రీడా ఉపకరణాల కొనుగోలుకూ, ఈవెంట్ల నిర్వహణకూ, విజేతలకు ప్రోత్సహకాలిచ్చేందుకూ ఇతోధిక కేటాయింపులు చేస్తే భవిష్య త్తరాలు పదునైన క్రీడాకారులను చూడగలుగుతాయి.
స్టేడియంలో గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పక్షాల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టు తలపడటం ఒక్కటే కాదు క్రీడలంటే. అవి యువతకు శారీరక, మానసిక దృఢత్వాన్ని స్తాయి. క్రమశిక్షణను నేర్పుతాయి. నిబంధనల పరిమితుల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించి పైచేయి సాధించటానికి ఏం చేయాలన్న వ్యూహ రచనా నైపుణ్యాన్ని పెంచుతాయి. ఓటమిని సైతం అంగీకరించగల స్థైర్యాన్నందిస్తాయి. ఒక టీమ్‌గా కలిసి పనిచేయటం, ఆ క్షణమే దాని ఫలితాలు కళ్లెదుట కనబడటం క్రీడల్లోనే చూడగలం. అవి అహంభావం స్థానంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రతిష్ఠిస్తాయి. తనలోని దార్ఢ్యమెంతో, పరిమితులేమిటో గుర్తించటానికి క్రీడలే తోడ్పడతాయి. ఈసారి కుంభకోణాల క్రీనీడ పడకుండా నిర్వహించి శభాష్ అనిపించుకుంటామని మన ప్రతినిధులు హామీ ఇచ్చివచ్చారు. చూద్దాం... ఎంతవరకూ నిలబెట్టుకుంటారో!


