Andhra Pradesh: ట్రంప్‌ దెబ్బకు కుయ్యో రొయ్యో..! | Donald Trump affect Cold storage in andhra pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ట్రంప్‌ దెబ్బకు కుయ్యో రొయ్యో..!

Dec 1 2025 9:30 AM | Updated on Dec 1 2025 9:30 AM

Donald Trump affect Cold storage in andhra pradesh

లక్ష టన్నులు కోల్డ్‌ స్టోరేజ్‌లోనే.. 

ఇంకా కోలుకోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతి 

ప్రత్యామ్నాయ మార్గాలపై పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం  

6 నెలల్లో రూ. వేల కోట్ల టర్నోవర్‌పై ప్రతికూల ప్రభావం 

కంటైనర్‌ టెరి్మనల్‌ నుంచి గతంలో నెలకు 4000 కంటైనర్ల సీఫుడ్‌ ఎగుమతులు

అమెరికా ప్రభావంతో 3000 కంటైనర్లకు పడిపోయిన ఎక్స్‌పోర్ట్స్‌ 

జూన్‌ నుంచి 30 శాతం వరకు తగ్గిన ఎగుమతులు

ట్రంప్‌ దెబ్బకి.. రొయ్య గడ్డ కడుతోంది. కోల్డ్‌ స్టోరేజ్‌లోనే కాలం సాగిస్తోంది. సముద్ర ఉత్పత్తులు కంటైనర్‌ ఎక్కించేందుకు వ్యాపారులూ గజగజమంటున్నారు. అగ్రరాజ్యం విధించిన సుంకాల ప్రభావం భారత్‌పై కనిపించబోదని కేంద్రం.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించామంటూ రాష్ట్ర ప్రభుత్వం బీరాలు పలుకుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం తిరోగమనం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా పన్ను టారిఫ్‌ల దెబ్బకు విశాఖలోని కంటైనర్‌ కార్గో ఎగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత ఆరు నెలలుగా దాదాపు 20 నుంచి 30 శాతం వరకూ ఎగుమతులు క్షీణించాయి. పన్ను టారిఫ్‌ల వ్యవహారం ఓ కొలిక్కి రాకుండా ఈ వ్యత్యాసం భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: మెరైన్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా ఉండే విశాఖపట్నం.. ఇప్పుడు అమెరికా విధించిన సుంకాల దెబ్బ నుంచి కోలుకోలేకపోతోంది. అమెరికా పన్నుల ప్రభావం భారత్‌పై ఏ మాత్రం ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితుల్లో ప్రతికూల ప్రభా వం ఉంటోంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇందులో 75 శాతం అంతర్గత మత్స్య, ఆక్వా కల్చర్‌ సంపద కాగా 25 శాతం వరకూ సముద్ర రంగం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో 66 శాతం వాటా రొయ్యలదే కావడం విశేషం. 

దేశంలో ముఖ్యంగా విశాఖ నుంచి ఎగుమతయ్యే రొయ్యలకు విదేశాల్లో భారీగా గిరాకీ ఉంది. దాని తర్వాత స్థానంలో ట్యూనా చేపల ఎగుమతులున్నాయి. విశాఖ సముద్ర జలాల్లో దొరికే ట్యూనా చేపలు దాదాపు అన్ని దేశాలకు ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. అమెరికా ఈ ఏడాది మొదట్లో మన ఎగుమతులపై 25 శాతం సుంకాలు విధించడం వల్ల రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విశాఖ నుంచి ఎగుమతయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 52 శాతం వరకూ మార్కెట్‌ అమెరికాలోనే జరుగుతోంది. ట్రంప్‌ సుంకాల పెంపు ఇక్కడ ఎగుమతిదారులకు ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా సీఫుడ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ గణనీయంగా పడిపోయాయి. 

కోల్డ్‌ స్టోరేజ్‌లోనే రొయ్యలు.! 
రాష్ట్రంలోని దాదాపు 45 రొయ్యల ఉత్పత్తుల ఎగుమతి సంస్థలుండగా.. విశాఖ జిల్లాలో 10కిపైగా ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో రకం ప్యాకేజీ విధానాన్ని అమలు చేస్తుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పంపించేందుకు దాదాపు లక్ష టన్నుల వరకూ ప్యాకేజీలు చేసి కోల్డ్‌ స్టోరేజ్‌లోనే మూలుగుతున్నాయి. వీటి ప్యాకింగ్‌ మార్చి.. ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు తలప్రాణం తోకకొస్తోందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా సుంకాల ప్రభావం మత్స్యరంగంపై ప్రతికూల ప్రభావం చూపించకుండా కొత్త మార్కెట్ల విస్తరణపై దృష్టిసారించామని కేంద్రం చెబుతున్నా.. ఆ పరిస్థితులు ఎక్కడా క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదని వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మార్కెట్‌లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని తలలు పట్టుకుంటున్నారు. 

ఆరు నెలలుగా అథఃపాతాళానికి.. 
విశాఖ నుంచి ఆరు నెలలుగా సముద్ర ఎగుమతులు దిగజారుతూ వస్తున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపెడా) నివేదికల ప్రకారం సీఫుడ్‌ ఎక్స్‌పోర్ట్స్‌లో దేశంలోనే విశాఖపట్నం ఏకంగా 26.36 శాతం వాటాని కలిగి ఉంది.  విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యూఏఈ, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. విశాఖపట్నం కంటైనర్‌ టెరి్మనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(వీసీటీపీఎల్‌) ఆధ్వర్యంలో కంటైనర్‌ కార్గో ఎగుమతులు జరుగుతుంటాయి. విశాఖపట్నం పోర్టులో 32 బెర్త్‌లు ఉండగా.. గంగవరం పోర్టులో 9 బెర్తులున్నాయి. ఇందులో మొత్తం 23 బెర్త్‌ల ద్వారా కార్గో కంటైనర్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. 

ఏటా ఇక్కడి నుంచి సుమారు రూ.17 వేల కోట్ల విలువైన 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. ప్రతి నెలా ఇక్కడి నుంచి 4000 రిఫ్రొజినేటెడ్‌ కంటైనర్స్‌(సీఫుడ్‌) ఎగుమతులు జరుగుతుంటాయి. ఒక్కో కంటైనర్‌ ద్వారా 30 టన్నుల సీఫుడ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ జరుగుతుంటాయి. అంటే నెలకు లక్షా 20 వేల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతుండేవి. అమెరికా సుంకాల ప్రభావంతో దాదాపు 30 శాతం వరకూ ఈ ఎగుమతులు క్షీణించాయి. జూన్‌ నెల నుంచి నవంబర్‌ వరకూ చూ స్తే.. ప్రతి నెలా 2000 నుంచి 3000 కంటైనర్లకు మించడం లేదని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల బుకింగ్స్‌ కూడా 20 నుంచి 30 శాతం కంటే దిగువకే ఉన్నాయని పోర్టు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా గడిచిన 6 నెలల్లో వేల కోట్ల టర్నోవర్‌కు బ్రేక్‌ పడిందని పోర్టు వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement