‘నువ్వు ఎవడివిరా... నీకు నచ్చినట్టు పనిచేస్తే కుదరదు.. మేము చెప్పిందే చేయాలి.. ఇది మా ప్రభుత్వం..’ అంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు నానా దుర్భాషలాడాడు. నీకు నచ్చినట్టు పనిచేస్తే కుదరదని.. తాము చెప్పిన వారికే పథకాలు ఇవ్వాలని... నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అధికార టీడీపీ నాయకులు గ్రామాల్లో చేస్తున్న రుబాబులు, బెదిరింపులు రోజుకో చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా చోడవరం మండలం రామజోగిపాలెం గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడు ఒక పంచాయతీ సెక్రటరీని బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్ ఆడియో క్లిప్పింగ్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
చోడవరం: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి ప్రస్తుతం గ్రామాల్లో లబి్ధదారుల ఎంపిక జరుగుతోంది. గడువు నవంబరు 30వ తేదీ కావడంతో గ్రామాల్లో ఇంటి స్థలాలు ఉన్నవారికి ఈ పథకం కింద ఇళ్లు మంజూరు చేసేందుకు పంచాయతీ, సచివాలయ సిబ్బంది నిరి్వరామంగా దరఖాస్తులు తీసుకొని, పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలో చోడవరం మండలం చాకిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న చాకిపల్లి, రామజోగిపాలెం గ్రామాల్లో కూడా లబి్ధదారు ల ఎంపికను పంచాయతీ కార్యదర్శి అప్పలస్వామి నిర్వహిస్తున్నారు. ఆయన కన్నంపాలెం పంచాయ తీ కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తుండగా అదనంగా చాకిపల్లి పంచాయతీని అప్పగించారు.
ఆయన గత ఐదు రోజులుగా చాకిపల్లి, రామజోగిపాలెం గ్రామాల్లో లబి్ధదారుల ఎంపిక చేస్తున్నారు. ఇంతలో రామజోగిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రొంగలి వెంకటరమణ పంచా యతీ కార్యదర్శిపై విరుచుకుపడ్డారు. శుక్రవారం రాత్రి ఫోన్ చేసి కార్యదర్శి అప్పలనాయుడును నానా దుర్భాషలాడారు. అధికార మదంతో రెచ్చిపోయి ‘ప్రభుత్వం మాది.. మేము చెప్పినట్టుగానే నువ్వు పనిచేయాలి.. నీకు నచ్చినట్టు నువ్వు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల పేర్లను నమోదు చేస్తే కుదరదు.. నీకు ఎవడు ఇచ్చాడు అధికారం.. నేను చెప్పిన వారి పేర్లే నమోదు చేయాలి... నువ్వు ఎస్టీ కులానికి చెందినవాడివంట కదా.. కులంతో బెదిరించాలని చూస్తున్నావా.. నీ అంతు చూస్తాను.. నువ్వు ఇక్కడ ఎలా పనిచేస్తావో చూస్తానం’టూ బెదిరింపులకు దిగారు.
కార్యదర్శి అప్పలనాయుడు వివరణ ఇచ్చేందుకు ఎంత ప్రయతి్నంచినా టీడీపీ నాయకుడు వెంకటరమణ మాత్రం రెచ్చిపోయి నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడాడు. దీనిపై కార్యదర్శి ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటనపై ఆయన ఎంపీడీవోకి మౌఖికంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. టీడీపీ నాయకుడి దౌర్జన్యం సర్వత్రా చర్చనీయాంశమైంది. రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ టీడీపీ అధినాయకత్వం బరితెగిస్తుంటే.. గ్రామస్థాయిలో ఆ పార్టీకి చెందిన చోటా నాయకులు సైతం అధికారులు, ఉద్యోగులు, ప్రజలపై వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం దురాగత పాలనకు అద్దం పడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


