దళవాయి చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
మూడు నెలలుగా యథేచ్ఛగా తరలింపు
హైవే పేరిట అక్రమ రవాణా
గుట్టుగా ఇటుక బట్టీలకు విక్రయం
ప్రమాదకర స్థితికి చేరిన చెరువు కట్ట
32 పంచాయతీలకు పొంచి ఉన్న ముప్పు
పట్టించుకోని అధికారులు
మొత్తం వ్యవహారం నడిపిస్తున్న బీజేపీ నేత
అక్రమార్జనే లక్ష్యంగా తిరుపతి జిల్లాలో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. ప్రకృతి వనరులను ఎవరికి దొరికింది వారు దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. అందులో భాగంగా ఓ బీజేపీ నేత ఆబగా దళవాయి చెరువుపై పడి ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. జాతీయ రహదారి పనుల పేరిట భారీ యంత్రాలతో గ్రావెల్ తరలించేస్తున్నారు.
వందలాది టిప్పర్లతో యథేచ్ఛగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. పగలు హైవే నిర్మాణానికి.. రాత్రివేళ ఇటుక బట్టీలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం మూడు నెలల్లోనే దాదాపు రూ.15 కోట్ల మట్టిని కొల్లగొట్టేశారు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కళ్లెదుటే చెరువు గుంతలమయంగా మారిపోతున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
చంద్రగిరి : తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె పంచాయతీ దళవాయి చెరువును బీజేపీ నేత ఒకరు కబళించేస్తున్నారు. ఇటీవల ఆయన పూతలపట్టు–నాయుడు జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి 8 కిలోమీటర్ల పనులకు కాంట్రాక్టు పొందాడు. తిరుచానూరు నుంచి బాలాజీ డెయిరీ వరకు గ్రావెల్ తరలింపు పనులను ఒప్పుకున్నాడు. దీంతో ఆ నేత చూపు దళవాయి చెరువుపై పడింది. సుమారు మూడు నెలలుగా పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఎర్రమట్టిని తరలించేస్తున్నారు.
అనుమతులు లేకుండానే..!
దళవాయి చెరువు నుంచి రహదారి పేరిట తరలిస్తున్న ఎర్రమట్టికి సంబంధించి సదరు బీజేపీ నేత ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అయినప్పటికీ పట్టపగలే గ్రావెల్ దోచుకెళుతుంటే రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశి్నస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నేత భారీగా ముడుపులు
చెల్లించి అధికారుల నోరు మూయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కట్ట తెగితే ముప్పు తప్పదు
బీజేపీ నేత మట్టి దోపిడితో దళవాయి చెరువు ప్రమాదకర స్థితికి చేరుకుంది. 40 అడుగుల మేర గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువు నిండితే కట్ట తెగిపోయే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెరువు కట్ట తెగితే పెరుమాళ్ల పల్లె, పుదిపట్ల, చెర్లోపల్లె, పేరూరు చెరువులకు వరద ముప్పు తప్పదు. అలాగే తిరుచానూరు వరకు సుమారు 32 పంచాయతీలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కేవీబీపురం మండలం ఓళ్లూరు వద్ద రాయలచెరువు కట్ట తెగిన ఘటనలో రెండు ఊళ్లు దెబ్బతిన్న విషయం గుర్తుచేస్తున్నారు. ఆ అనుభవాల నుంచి అధికారులు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.
పగలు ఇటు.. రాత్రి అటు!
హైవే విస్తరణ పనులకు మట్టిని తరలిస్తున్నట్లు కలరింగ్ చేస్తున్న ఆ బీజేపీనే త రాత్రుల్లో నిరంతరాయంగా మల్లవరం నుంచి చెర్లోపల్లె వరకు ఉన్న ఇటుక బట్టీలకు గ్రావెల్ సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. ఇటుక బట్టీలకు టిప్పరు మట్టిని రూ.6వేలకు విక్రయిస్తున్నట్లుగా బట్టీల యజమానులు బహిరంగంగానే చెబుతున్నారు. తాను ఏదో సేవ చేస్తున్నట్లుగా ఆ నాయకుడు చెప్పుకుంటూ ఇలా సహజ వనరులను దోచేస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు.
గుంతలమయంగా చెరువు
దళవాయి చెరువులో మట్టి తవ్వకాలతో సదరు బీజేపీ నేత రూ.కోట్లు వెనకేసునున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 40 అడుగుల మేర భారీ తవ్వకాలను చేపట్టడంతో చెరువు గుంతలమయంగా మారిపోయింది. రెండు హిటాచీలతో లోతుగా తవ్వేస్తూ, నిత్యం 150కు పైగా టిప్పర్ల మట్టిని తరలించేస్తున్నట్లు విశ్వసనీయ సమచారం. ఈ ప్రకారం టిప్పర్ మట్టి సుమారు రూ.4వేలు ఉండగా, రోజుకు రూ.6లక్షల మేర అక్రమార్జన సాగిస్తున్నారు. ఈ లెక్కన మూడు నెలల కాలంలో ఏకంగా రూ.15కోట్ల మేర అక్రమంగా మట్టిని స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు
దళవాయి చెరువులో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ చెరువు నుంచి భారీగా మట్టి తరలిపోతున్నట్లు మాకు సమాచారం అందింది. వెంటనే చెరువును పరిశీలించి, గ్రావెల్ అక్రమ తవ్వకం, రవాణాను అడ్డుకుంటా. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – ప్రసాద్, ఇరిగేషన్ డీఈ


