దాచేపల్లి వద్ద కృష్ణా నదిలో ప్రమాదకర రసాయనాల తెట్టు
కెమికల్, సిమెంట్ కంపెనీల వ్యర్థ రసాయనాలను నదిలో వదిలేసినట్లు అనుమానం
రంగుమారి కలుషితమైన నీరు... తీవ్ర దుర్వాసన
నదిలో నీటిని పట్టుకుంటుంటే చేతులు మండుతున్నాయంటున్న మత్స్యకారులు
భయాందోళనలకు గురవుతున్న స్థానికులు
దాచేపల్లి: కృష్ణానదిలో ప్రమాదకర రసాయనాల తెట్టు ప్రజలను కలవర పెడుతోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ, ఏలియంపేట గ్రామాల వద్ద కృష్ణానదిలో ఇటీవల భారీగా రసాయనాల తెట్టుని స్థానికులు గుర్తించారు. నీటిపై రంగురంగులుగా రసాయనాల తెట్టు తేలియాడుతూ దిగువకు వెళుతోంది. కొన్నిచోట్ల నది ఒడ్డుకు వచ్చి పేరుకుపోయింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నదిలోని నీరు రంగు మారిపోయింది.
రకరకాల రంగులు, కెమికల్స్ కలిసి ఉండటంతో ఆ తెట్టు పేరుకుపోయిన ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తోంది. తెట్టు ఉన్న ప్రాంతంలో నీటిని పట్టుకుంటే చేతులు మంటలు వస్తున్నాయని నదిలో వేటకు వెళ్తున్న మత్స్యకారులు చెబుతున్నారు. దాచేపల్లి మండల పరిధిలో ఉన్న కెమికల్, సిమెంట్ పరిశ్రమల నుంచి రసాయనాల వ్యర్థాలు తెచ్చి నదిలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ నీటిని తాగితే ప్రాణాలు పోతాయని భయాందోళనలకు గురవుతున్నారు.
ఆ నీరే ప్రజలకు సరఫరా
కృష్ణానది నుంచి తంగెడ గ్రామంలోని సుమారు 6వేల మంది ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ ద్వారా నదిలో నీటిని పంపింగ్ చేసి పైపుల ద్వారా ట్యాంకుల్లో నింపి అక్కడ నుంచి కుళాయిల ద్వారా తాగునీటిని ఇళ్లకు సరఫరా చేస్తారు. కొద్ది రోజులుగా కృష్ణానదిలో రసాయనాల తెట్టు ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు ఆ నీటినే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కృష్ణానది ఒడ్డునే ఏలియంపేట గ్రామం ఉంది.
ఇక్కడున్న 50 కుటుంబాలవారు నదిలో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరు పూర్తిస్థాయిలో కృష్ణానది నీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు నదిలోని నీటిని తాగుతున్న వారంతా తమకు ఏమవుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు కృష్ణానదికి అవతలి వైపు ఉన్న తెలంగాణలోని కొన్ని గ్రామాల వెంట కూడా నదిలో ఈ రసాయనాల తెట్టు కనిపిస్తోంది.
అధికారుల ఆరా... నది నుంచి నీటి సరఫరా నిలిపివేత
కృష్ణానది నీటిలో రసాయనాలు కలవటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎక్కడ నుంచి అయినా రసాయనాలు తెచ్చి ఇక్కడ నదిలో వదిలేశారా? దాచేపల్లి మండల పరిధిలో ఎక్కువగా ఉన్న కెమికల్, సిమెంట్ పరిశ్రమల వారే వ్యర్థ రసాయనాలను నదిలో కలిపేశారా? అనే దానిపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. మూడు విభాగాల అధికారులు ఆదివారం తంగెడ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. గ్రామానికి నది నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. గ్రామంలోని బోర్ల ద్వారా నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు.


