ప్రభుత్వాలు ఆదుకోవాలి
ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మిథున్‌రెడ్డి, సుభాశ్ చంద్రబోస్
సమస్యలపై మాట్లాడేందుకు సభలో తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్సార్‌సీపీ ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాశ్ చంద్రబోస్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని సమస్యలను కేంద్రం దృష్టికి తెచ్చారు. ‘పలు సమస్యలపై మాట్లాడేందుకు సభలో సమయం ఇవ్వాలి. మేము లేవనెత్తిన ప్రతి ఒక్క అంశంపై కేంద్రం పరిష్కారాన్ని చూపాలి. జాతీయ స్థాయిలో 2023–24లో కోటి 84 టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులు నమోదయ్యాయి. ఇందులో 51.58 లక్షల టన్నుల
ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. వ్యవసాయ అనుబంధ
రంగాల స్థూల ఆదాయ నిష్పత్తిలో 9.15 శాతం ఆక్వా రంగం నుంచే వస్తోంది. ట్రంప్ విధించిన టారిఫ్‌ల కారణంగా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. వీరిని ఆదుకునేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలి
సమావేశం అనంతరం పార్టీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వైద్యరంగం బలోపేతం కోసం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీసుకొచి్చన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు. ఈ ప్రైవేటీకరణను ఆపాలని తాము కేంద్రం దృష్టికి తీసికెళ్లామన్నారు. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం లేదంటూ స్పష్టత ఇవ్వాలని సమావేశంలో డిమాండ్ చేసినట్లు వివరించారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్పిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
ఉపాధి హామీ నిధులపై పెదవి విప్పని పెమ్మసాని
కాగా, ఆరు నెలలుగా ఉపాధి హామీ పథకం డబ్బులు రాక పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సమావేశంలో తాము ప్రస్తావిస్తే, ఇదే సమావేశంలో పాల్గొన్న సంబంధిత శాఖ కేంద్ర మంత్రి పెమ్మసాని.. ఈ సమస్యపై నోరుమెదపలేదని మిథున్ రెడ్డి విమర్శించారు. కూలీలకు ఈఏడాది జూలై 17వ తేదీ నుంచి జరిగిన పనులకు నేటి వరకు డబ్బులు ఇవ్వలేదన్నారు. దాదాపు రూ.350 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కేంద్రానికి వివరించినట్లు తెలిపారు.
పనిలేని పేదలకు పని కల్పించి డబ్బు ఇవ్వడమే లక్ష్యమైన ఈ పథకానికి సంబంధించి కూడా టీడీపీకి చెందిన వారే రాజ్యమేలుతున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. కూలీలు చేయాల్సిన పనిని వారిచేత చేయించకుండా, టీడీపీ నేతలు తమ సొంత వారి మిషన్లు పెట్టి పనులు చేస్తున్నట్లు విమర్శించారు. ఇలా దొంగ మస్టర్లు వేసుకుని బిల్లులు కాజేస్తున్నట్లు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా.. ఆ శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.


