రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి.. పార్లమెంట్‌లో ప్రజా గళం | YS Jagan Directs YSRCP MPs To Raise Farmers Crisis And Key State Issues In Parliament, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి.. పార్లమెంట్‌లో ప్రజా గళం

Dec 1 2025 3:36 AM | Updated on Dec 1 2025 11:05 AM

YS Jagan Guidelines to YSRCP MPs: Andhra pradesh

వైఎస్సార్‌సీపీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం

తుపానుతో రైతాంగానికి కోలుకోలేని నష్టం 

పరిహారం ఊసే లేదు.. ఏ పంటకూ ‘మద్దతు’ లేదు

ధాన్యం సేకరణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం

అంతా మిల్లర్లు, దళారులదే రాజ్యం.. అన్నదాతల ఇక్కట్లను పట్టించుకోని ప్రభుత్వం

ఉపాధి హామీ జాబ్‌ కార్డుల తొలగింపు దారుణం 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఆపాలి 

సంక్షేమ హాస్టళ్లలో దారుణ, దుర్భర పరిస్థితులు

ఏపీలో దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు 

ఈ అంశాలపై పార్లమెంట్‌లో బలంగా గళం విప్పాలని 

ఎంపీలకు వైఎస్‌ జగన్‌ నిర్దేశం

సాక్షి, అమరావతి: అన్నదాతల ఇక్కట్లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి.. ప్రజల గొంతుకను గట్టిగా వినిపించాలని పార్టీ ఎంపీలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఒకవైపు తుపానుతో తీవ్ర నష్టం, మరోవైపు ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కక కుదేలైన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. 

ఈ అంశాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు. మోంథా తుపాను వల్ల తీర ప్రాంత జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఏ పంటకూ కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లేకపోవడం వారిని మరింత కష్టాల పాల్జేస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా నేరుగా ధాన్యాన్ని సేకరించడం వల్ల ప్రతి పంటకూ కనీస మద్దతు ధర కచ్చితంగా దక్కేదని గుర్తుచేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నింటికి మంగళం పాడి రైతులను గాలికి వదిలేయడంతో దళారులు, వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని మండిపడ్డారు.

వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చితోపాటు మామిడి లాంటి ప్రధాన పంటలకు ఎమ్మెస్పీ లభించక రైతులు అల్లాడుతున్న దృష్ట్యా కేంద్రం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధర దక్కేలా ఎంపీలు ఒత్తిడి తేవాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసిన ఉచిత పంటల బీమాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ అందడం లేదని, ఈ–క్రాపింగ్‌ చేయకపోవడం వల్ల పంటల గణాంకాలు స్పష్టంగా తెలియక అర్హులైన రైతులకు కూడా పరిహారం అందని దుస్థితి నెలకొందన్నారు. మిర్చి రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని మాట ఇచ్చిన ఈ ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోకుండా వారిని దగా చేసిందని, మామిడి కొనుగోళ్లలో కంపెనీలు తగిన ధర చెల్లించేలా చూడడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆ రైతులూ తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.  

గ్రామీణ నిరుపేదల ఉపాధిని దెబ్బతీశారు..
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సామూహికంగా 18.63 లక్షల జాబ్‌ కార్డులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించడాన్ని ఎంపీల వద్ద వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. ఇది అత్యంత దారుణమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. అర్హత ఉన్న జాబ్‌ కార్డులన్నింటినీ పునరుద్ధరించడంతోపాటు వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.  

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తక్షణమే ఆపేయాలి..  
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చర్యలను గట్టిగా వ్యతిరేకించాలని ఎంపీలను జగన్‌ ఆదేశించారు. సంస్థను ముక్కలుగా చేసి అమ్మేస్తున్నారని, ఇది సంస్థ పూర్తి ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న పని అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు, వేలాది మంది త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడిన విషయాన్ని గుర్తుచేశారు. వారందరితోపాటు ఆ సంస్థ కోసం భూములిచ్చిన రైతులను దగా చేయడం తగదన్నారు. సంస్థను ముక్కలు చేస్తూ ప్రైవేటీకరణ కోసం చేపట్టిన చర్యలన్నింటినీ వెంటనే ఉపసంహరించాలని, సంస్థను పునరుద్ధరించేలా వెంటనే సొంతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయించి వేలాది మంది కారి్మకులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడాలని కోరారు.    

శాంతి భద్రతలు దారుణం..
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ కక్షతో పోలీసు యంత్రాంగాన్ని దురి్వనియోగం చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రస్తావించారు. చాలా మంది నాయకులు, ప్రజా ప్రతినిధులకు సెక్యూరిటీ తగ్గించి వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి తీసుకొచ్చారని ఆక్షేపించారు. మరోవైపు ప్రభుత్వ హాస్టళ్లు, సంక్షేమ వసతిగృహాల్లో పరిస్థితి నానాటికీ దుర్భరంగా మారుతోందన్నారు.

విద్యార్థులకు సరైన ఆహారం, తాగు నీరు అందడంలేదని, పరిశుభ్రత పూర్తిగా కొరవడిందని ఆందోళన వ్యక్తంచేశారు. వీటన్నింటితోపాటు కేంద్రం నుంచి పెండింగ్‌ నిధులు రాబట్టడం, రాష్ట్రంలో ఉపాధి కల్పన, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ఎంపీలు చొరవ చూపాలని.. ప్రజాసమస్యలను గట్టిగా ప్రస్తావిస్తూ, వారి గొంతుకలను బలంగా వినిపించి, కేంద్రం వాటిపై దృష్టిసారించేలా కృషిచేయాలని వైఎస్‌ జగన్‌ మార్గనిర్దేశం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement