బలహీన పడుతున్న ‘దిత్వా’.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు | Ditva Cyclone effect rayalaseema districts | Sakshi
Sakshi News home page

బలహీన పడుతున్న ‘దిత్వా’.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు

Dec 1 2025 2:57 AM | Updated on Dec 1 2025 2:57 AM

Ditva Cyclone effect rayalaseema districts

తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో జోరువానలు

నేడు రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు..

తిరుపతి జిల్లాలో నేడు అంగన్‌వాడీలు, పాఠశాలలకు సెలవు

తమిళనాడులోని కావేరి డెల్టాలో కుంభవృష్టి.. ఆరుగురు మృత్యువాత

సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్‌/తిరుమల/­ఇందు­కూరుపేట/ఒంగోలు సబర్బన్‌/సాక్షి, చెన్నై: దిత్వా తుపాను ఆదివారం తమిళనాడు, పుదు­చ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ క్రమేపీ బలహీనపడుతోంది. సోమవారం తెల్ల­వారు­­జా­ము­­కల్లా ఇది తీవ్ర వాయుగుండంగా బలహీన­పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రానికి ఇది గంటకు 4 కిలో­మీటర్ల వేగంతో కదులుతూ చెన్నైకి 150 కిలోమీటర్లు, వేదరన్నియంకు 170, కరైకల్‌కు 120, కడలూరుకు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా నావూరులో 4.8, బుచ్చి­రెడ్డిపాలెంలో 4.7, జల­దంకిలో 3.6, పులికల్లులో 3.6, తిరుపతి జిల్లా చిట్ట­మూరులో 3 సెంటీ­మీటర్ల వర్షపాతం నమో­దైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడు­తు­న్నాయి. మైపాడు, కోడూరు, జువ్వలదిన్నె, తుమ్మ­లపెంట, రామాయపట్నం బీచ్‌లలోకి పర్యా­ట­కు­లు రాకుండా మెరైన్, స్థానిక పోలీసులు బందో­బస్తు నిర్వహిస్తున్నారు. తుపాను నేపథ్యంలో చల్ల­గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది.  

నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు 
తుపాను ప్రభావంతో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

తిరుపతి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం 
దిత్వా తుపాను తిరుపతి జిల్లాను వణికిస్తోంది. జిల్లాలోని 24 మండలాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లాలోని అంగన్‌వాడీ స్కూల్స్‌తోపాటు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుజాగ్రత్తగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు. తిరుమలలోని ఐదు డ్యామ్‌లు పూర్తిగా నిండినట్లు టీటీడీ వాటర్‌ వర్క్స్‌ ఈఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ (ఫోన్‌ నంబర్‌ 0877 2236007)ను ఏర్పాటు చేశారు.

ప్రకాశం, వైఎస్సార్‌సీపీ కడప జిల్లాల్లో...
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి చిరు జల్లులు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒంగోలులోని కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.  వైఎస్సార్‌ కడప జిల్లాలోనూ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు వర్షం కురుస్తోంది. జిల్లాలో అత్యధికంగా ఒంటిమిట్టలో 25.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను వర్షం దెబ్బతీస్తుందని భయపడుతున్నారు. 

తమిళనాడులో భారీ వర్షం... ఆరుగురు మృతి
నాగపట్నంలో కుంభవృష్టి... 23 సెం.మీ. వర్షపాతం నమోదు. దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని కావేరి డెల్టా ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు అతిభారీ వర్షం కురిసింది. కావేరి డెల్టా పరిధిలోని తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షం పడింది. అత్యధికంగా నాగపట్నంలో 23 సెం.మీ., మైలాడుతురైలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతిచెందారు. గోడలు, ఇళ్లు కూలి రామనాథపురం జిల్లాలో ముగ్గురు, తుత్కుకూడి, నాగపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు, విద్యుత్‌ షాక్‌తో మైలాడుతురై జిల్లాలో ఒకరు మృతిచెందారు. దిత్వా తుపాను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాగపట్నం, కడలూరు మీదుగా పుదుచ్చేరి వైపునకు నెమ్మదిగా ప్రయాణించి కరైకాల్‌–పుదుచ్చేరి మధ్య బలహీన పడుతుండటంతో చెన్నై నగరంతోపాటు శివారు జిల్లాల్లో పెద్దగా వర్షం కురవలేదు.  

 

Advertisement
 
Advertisement
Advertisement