సాక్షి, నెల్లూరు జిల్లా: ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య కుట్రదారు ఆరని కామాక్షిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. బోణిగానితోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఏ1 నిందితుడు జేమ్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. జేమ్స్ కాలుకి బుల్లెట్ తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పెంచలయ్య హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ‘‘పెంచలయ్య గంజాయి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేస్తుండేవాడు. అదే కాలనీకి చెందిన గంజాయి వ్యాపారి ఆరవ కామాక్షి పెంచలయ్యపై కక్ష పెంచుకొంది. తన వ్యాపారానికి అడ్డం వస్తున్నాడని హతమార్చడానికి కుట్ర పన్నింది. స్కూల్ నుంచి బిడ్డను తీసుకొస్తున్న క్రమంలో పెంచలయ్యపై దాడి చేశారు
..పది మంది పాశవికంగా పొడిచి చంపారు. A1 జేమ్స్ ను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. నేడు కామాక్షిని గంజాయి పట్టుబడ్డ కేసులో అరెస్టు చేశారు. పీటీ వారెంట్ కింద ఈ కేసులో కామాక్షిని అదుపులోకి తీసుకుంటాం. ఈ హత్య కేసులో మొత్తం 14 మంది వున్నారు. 9 మందిని అరెస్ట్ చేశాం. మిగతా ఐదుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.
ప్రజానాట్య మండలి, డీవైఎఫ్‌ఐ ఆగ్రహం
కామ్రేడ్ పెంచలయ్యను గంజాయి గూండాలు హత్య చేయడంపై ప్రజానాట్య మండలి, డీవైఎఫ్‌ఐ నేతలు మండిపడ్డారు. కామ్రేడ్ పెంచలయ్య హత్యకు గురికావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయని డీవైఎఫ్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.



