breaking news
cyclon
-
బలహీన పడుతున్న ‘దిత్వా’.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/తిరుమల/ఇందుకూరుపేట/ఒంగోలు సబర్బన్/సాక్షి, చెన్నై: దిత్వా తుపాను ఆదివారం తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ క్రమేపీ బలహీనపడుతోంది. సోమవారం తెల్లవారుజాముకల్లా ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రానికి ఇది గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదులుతూ చెన్నైకి 150 కిలోమీటర్లు, వేదరన్నియంకు 170, కరైకల్‌కు 120, కడలూరుకు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా నావూరులో 4.8, బుచ్చిరెడ్డిపాలెంలో 4.7, జలదంకిలో 3.6, పులికల్లులో 3.6, తిరుపతి జిల్లా చిట్టమూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. మైపాడు, కోడూరు, జువ్వలదిన్నె, తుమ్మలపెంట, రామాయపట్నం బీచ్లలోకి పర్యాటకులు రాకుండా మెరైన్, స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తుపాను నేపథ్యంలో చల్లగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు తుపాను ప్రభావంతో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.తిరుపతి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం దిత్వా తుపాను తిరుపతి జిల్లాను వణికిస్తోంది. జిల్లాలోని 24 మండలాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లాలోని అంగన్వాడీ స్కూల్స్‌తోపాటు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుజాగ్రత్తగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు. తిరుమలలోని ఐదు డ్యామ్‌లు పూర్తిగా నిండినట్లు టీటీడీ వాటర్ వర్క్స్ ఈఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (ఫోన్ నంబర్ 0877 2236007)ను ఏర్పాటు చేశారు.ప్రకాశం, వైఎస్సార్సీపీ కడప జిల్లాల్లో...ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి చిరు జల్లులు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒంగోలులోని కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోనూ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు వర్షం కురుస్తోంది. జిల్లాలో అత్యధికంగా ఒంటిమిట్టలో 25.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను వర్షం దెబ్బతీస్తుందని భయపడుతున్నారు. తమిళనాడులో భారీ వర్షం... ఆరుగురు మృతినాగపట్నంలో కుంభవృష్టి... 23 సెం.మీ. వర్షపాతం నమోదు. దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని కావేరి డెల్టా ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు అతిభారీ వర్షం కురిసింది. కావేరి డెల్టా పరిధిలోని తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షం పడింది. అత్యధికంగా నాగపట్నంలో 23 సెం.మీ., మైలాడుతురైలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతిచెందారు. గోడలు, ఇళ్లు కూలి రామనాథపురం జిల్లాలో ముగ్గురు, తుత్కుకూడి, నాగపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు, విద్యుత్ షాక్‌తో మైలాడుతురై జిల్లాలో ఒకరు మృతిచెందారు. దిత్వా తుపాను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాగపట్నం, కడలూరు మీదుగా పుదుచ్చేరి వైపునకు నెమ్మదిగా ప్రయాణించి కరైకాల్–పుదుచ్చేరి మధ్య బలహీన పడుతుండటంతో చెన్నై నగరంతోపాటు శివారు జిల్లాల్లో పెద్దగా వర్షం కురవలేదు. -
'దిత్వా' తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
దిత్వా తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను పుదుచ్చేరికి 280 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 380 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర దిశగా కదులుతున్న తుపాను రాత్రికి చెన్నై, రేపు పుదుచ్చేరి తీరాన్ని తాకనుంది. దీంతో ఏపీలోని పలు జిల్లాలకు కూడా దిత్వా తుపాను ముప్పు ఉంది. దక్షిణ కోస్తా , రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రేపు ప్రకాశం, అన్నమయ్య, కడప, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించనున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోని అన్ని పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. -
తరుముకొస్తున్న తుఫాన్..!
-
మిచాంగ్ తుపాను: రెడ్ ఎలర్ట్ ప్రకటించిన IMD
-
అండమాన్‌లో చిక్కుకున్న పర్యాటకులు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుఫాను బలపడుతోంది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయ దిశగా 1,000 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1,110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 12న నెల్లూరు-కాకినాడ మధ్య తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 10వ తేదీ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు చేశారు. అన్నిపోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల్లో సుమారు 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వార్దా తుఫాను ప్రభావంతో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో పోర్ట్ బ్లెయిర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని దీవులు.. హ్యావ్లాక్, నీల్ ప్రాంతాల్లో పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. -
బలహీనపడ్డ వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బలహీనపడింది. గురువారం రాత్రికి వాయుగుండంగా బలహీనపడి జార్ఖండ్‌లోని రాంచీకి 200 కి .మీ. ఈశాన్యంగాను, బీహార్‌లోని గయకు తూర్పు ఈశాన్య దిశగా 220 కి.మీల దూరంలోనూ కేంద్రీకతమై ఉంది. శుక్రవారం నాటికి ఇది మరింతగా బలహీనపడి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ గురువారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అలాగే ఈ నెల 16న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రసుత్తం రాష్ట్రంపైకి పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీంతో ఆకాశంలో మేఘాలు ఏర్పడడం లేదు. ఫలితంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి ఎండల ప్రభావం నేరుగా పడుతోంది. దీని ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేదాకా ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.


