తొలుత కృష్ణా తర్వాత గంగ | Krishna basin contains major reservoirs with significant capacity | Sakshi
Sakshi News home page

తొలుత కృష్ణా తర్వాత గంగ

Dec 1 2025 5:04 AM | Updated on Dec 1 2025 5:04 AM

Krishna basin contains major reservoirs with significant capacity

అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలున్న బేసిన్‌లో అగ్రగామిగా కృష్ణా 
    
రెండో స్థానంలో నిలిచిన గంగ.. మూడో స్థానంలో గోదావరి

కేంద్ర జలసంఘం నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో అతి పెద్ద నది గంగ..అతి పెద్ద నదుల్లో కృష్ణమ్మది మూడో స్థానం. కానీ.. అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉన్న నదీ పరివాహక ప్రాంతం(బేసిన్‌)లో మాత్రం కృష్ణ అగ్రగామిగా నిలిచింది. ఆ తరువాత స్థానంలో గంగ బేసిన్‌ నిలిచింది. కానీ.. నిర్మాణంలో ఉన్న జలాశయాలు పూర్తయితే నీటి నిల్వ సామర్థ్యం అత్యధికంగా కలిగిన జలాశయాలు ఉన్న బేసిన్‌లలో గంగమ్మ తొలి స్థానంలో నిలుస్తుంది. ఆ తరువాతి స్థానంలో కృష్ణమ్మ నిలుస్తుందంటూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

దేశంలో సింధూ నుంచి కావేరి వరకూ అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వలపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఆ అధ్యయన నివేదికలో ప్రధానాంశాలు.. 

⇒  దేశంలో అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,651.73 టీఎంసీలు.
⇒ దేశంలో అతి పెద్ద నదుల్లో గంగా నదిది మొదటి స్థానం.. రెండో స్థానంలో గోదావరి.. మూడో స్థానంలో కృష్ణా నిలుస్తాయి.
⇒  నదీ పరివాహక ప్రాంతాల్లో అత్యధిక నీటి నిల్వలు కలిగిన జలాశయాలు ఉన్న బేసిన్‌లలో కృష్ణా మొదటి స్థానంలో నిలుస్తుంది. కృష్ణా బేసిన్‌లో ఇప్పటికే పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,789 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 146.79 టీఎంసీలు. కృష్ణా బేసిన్‌లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,935.79 టీఎంసీలు.

⇒  గంగా బేసిన్‌లో పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,719.28 టీఎంసీలు.. నిర్మాణంలో ఉన్న జలాశయాల నిల్వ సామర్థ్యం 270.17.. గంగా బేసిన్‌లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,989.45 టీఎంసీలు. అంటే.. నిర్మాణంలో ఉన్న జలాశయాలు పూర్తయితే అత్యధిక నీటి నిల్వ కలిగిన రిజర్వాయర్లు ఉన్న బేసిన్‌లలో కృష్ణమ్మను గంగమ్మ అధిగమించి ప్రథమ స్థానానికి చేరుతుందన్న మాట.

⇒ చైనా, భారత్, బంగ్లాదేశ్‌ల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే బ్రహ్మపుత్రా నది జీవనది. కానీ.. వర్షాచాయ ప్రాంతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా ప్రవహించే బంగాళఖాతంలో కలిసే పెన్నా నదీ పరివాహక ప్రాంతంలోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉండటం గమనార్హం. దేశంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే..అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఉన్న బేసిన్‌ల్లో పెన్నా పదో స్థానంలో నిలిస్తే.. బ్రహ్మపుత్ర 11వ స్థానంలో నిలిచింది. బ్రహ్మపుత్ర బేసిన్‌ పర్వతాలు, కొండలు, లోయలతో కూడుకున్నది. జలాశయాల నిర్మాణానికి అంత అనువైన ప్రాంతం కాదు.

Advertisement
 
Advertisement
Advertisement