లక్ష సంతకాల పత్రాలను చూపుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
వెంకయ్యనాయుడు, జేపీ లాంటి వారు వేదికలపై మాట్లాడాలి
లేదంటే భవిష్యత్ తరాలకు తీరని నష్టం
ప్రొద్దుటూరులో లక్ష సంతకాలు పూర్తిచేశాం
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : సీఎం చంద్రబాబు చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేధావులు స్పందించకపోతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్ష సంతకాలు పూర్తిచేసిన సందర్భంగా ఆదివారం ఆయన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, డా. జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు వేదికలపై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రసంగించాలి్సన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వీరు ఈ విషయంపై అస్సలు మాట్లాడటంలేదని, దీనివల్ల రాçÙ్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని రాచమల్లు చెప్పారు. ఇది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదని.. ఈ అంశాన్ని రాజకీయంగా కాకుండా సామాజిక కోణంలో చూడాలని ఆయన సూచించారు. రాచమల్లు ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబు సిగ్గుపడాలి..
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణవల్ల ప్రతిభగల విద్యార్థులకు ఉచితంగా సీట్లు దొరికే అవకాశం ఉండదు. అందరి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను మంజూరుచేసి అందులో కొన్నింటిని నిర్మించారు. నిజానికి గతంలో ఎవరూ ఇన్ని తీసుకురాలేదు. ప్రతీవారం సీఎం చంద్రబాబు చేసే అప్పుల్లో కేవలం రూ.నాలుగైదు వేల కోట్లు ఖర్చుపెడితే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పూర్తిచెయొ్యచ్చు. సీఎం చంద్రబాబు వీటిని ప్రాథమిక బాధ్యతగా భావించి యుద్ధప్రాతిపదికన వీటి నిర్మాణం పూర్తిచేయాలి. వీటివల్ల ఆటో కార్మికులు, బేల్దారి పనిచేసే వారు, హమాలీల పిల్లలకు వాటిల్లో చదివే అవకాశం దొరుకుతుంది. పూర్తిగా జగన్‌పై కక్షతోనే.. ఆయనకు పేరొస్తుందన్న అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గాలికొదిలేశారు. ఏంచెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఇందుకు బాబు సిగ్గుపడాలి.
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అటకెక్కించారు
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. ఎంతోమంది నిరుపేదలు ఆరోగ్యశ్రీతో గుండెజబ్బుల ఆపరేషన్లు చేయించుకుని జీవిస్తున్నారు. పేద పిల్లలూ ఉన్నత చదువులు చదివారు. చంద్రబాబు ప్రభుత్వం నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. దీంతో ఆస్పత్రుల వద్ద ఆరోగ్యశ్రీ లేదని బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సక్రమంగా చెల్లించడంలేదు. బాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో నాలుగోసారి సీఎంగా ఉన్నారు. అసలు ఇప్పటివరకు ఆయనకు మెడికల్ కాలేజీలు నిర్మించాలన్న ఆలోచన ఎందుకు రాలేదు?
లక్ష సంతకాలు పూర్తిచేశాం..
ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గాంధేయ మార్గంలో చేపట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులతోపాటు నియోజకవర్గంలోని 30 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక్కో పుస్తకంలో 200 సంతకాలతో మొత్తం 500 పుస్తకాలను పూర్తిచేశాం. వాస్తవానికి అన్ని నియోజకవర్గాల్లో 50 వేల నుంచి 60 వేలు సంతకాలు చేయించాలని పార్టీ సూచించగా, ఇక్కడొక్క చోటే లక్ష సంతకాలు పూర్తిచేయడంతో నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా ఉంది. డిసెంబరు 10న పార్టీ హైకమాండ్‌కు వీటిని అందిస్తాం.


