సాంబశివరావు, కృష్ణకుమారి(ఫైల్)
పట్టపగలు ఇంట్లోనే కత్తులతో పొడిచి, నరికి చంపిన పాలిటెక్నిక్ విద్యారి్థ, అతడి స్నేహితులు
కుటుంబకలహాల నేపథ్యంలో దురాగతం
నిందితుల్లో ఒక యువకుడు, ఇద్దరు బాలురు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఆదివారం పట్టపగలు తల్లి, కొడుకు హత్యకు గురయ్యారు. దొప్పలపూడి సాంబశివరావు (30), కృష్ణకుమారి (55)పై మారణాయుధాలతో దాడిచేసిన ముగ్గురు.. కత్తులతో పొడిచి, నరికి చంపేశారు. స్థానికుల కథనం మేరకు.. ధూళ్లిపాళ్ల గ్రామానికి చెందిన దొప్పలపూడి వీరయ్య, కృష్ణకుమారి దంపతులకు కుమారుడు సాంబశివరావు, కుమార్తె మౌనిక ఉన్నారు. మౌనికను ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.
తాడికొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సాంబశివరావుకు 2022లో నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన చెరుకూరి రఘుబాబు కుమార్తె సాహితితో వివాహం చేశారు. సాంబశివరావు, సాహితి దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. రెండేళ్లపాటు కేసులు పెట్టుకుని పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో ఆరునెలల కిందట విడాకులు తీసుకున్నారు. సాంబశివరావు తాను పనిచేస్తున్న తాడికొండలోనే ఉంటూ వారానికి ఒకసారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళుతున్నాడు. ఈ క్రమంలో శనివారం నిత్యావసర సరుకులు తీసుకుని ధూళ్లిపాళ్ల వచ్చాడు.
తన సోదరిని హింసించారని..
తన సోదరి వైవాహిక జీవితంలో భర్త, అత్త, మామ కలిసి శారీరకంగా, మానసికంగా వేధించారని వారిపై సాహితి సోదరుడు చెరుకూరి రోహిత్‌చౌదరి కక్ష పెంచుకున్నాడు. ఆ ముగ్గురిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్తిపాడు మండలం చోడవరంలోని కళ్లం హరినాథ్‌రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న రోహిత్‌చౌదరి.. చిలకలూరిపేటలోని పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్‌లో తనకు స్నేహితులైన ఇద్దరు బాలురకు ఈ విషయం చెప్పాడు.
గుంటూరు నారాయణ జూనియర్ కళాశాలలోను, చిలకలూరిపేట శ్రీచైతన్య జూనియర్ కళాశాలలోను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ ఇద్దరితో కలిసి హత్యలకు పథకం వేశాడు. ఆదివారం సాంబశివరావు ధూళ్లిపాళ్లలో ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్న రోహిత్‌చౌదరి తన స్నేహితులిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆ ఇంటివద్దకు చేరుకున్నాడు. సాంబశివరావు ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా, తల్లి కృష్ణకుమారి ఇంట్లోనే ఉంది. ఒక్కసారిగా మారణాయుధాలతో దాడిచేసిన ముగ్గురు.. వారిద్దరిని కత్తులతో పొడిచి, తలపై నరికి.. ద్విచక్రవాహనంపై పరారయ్యారు. సాంబశివరావు ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.
కొన ఊపిరితో ఉన్న కృష్ణకుమారిని స్థానికులు 108 వాహనంలో సత్తెనపల్లిలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైనవైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కి తరలించగా పరిశీలించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు చెప్పారు. అప్పటివరకు ఇంట్లో ఉన్న దొప్పలపూడి వీరయ్య బజారుకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.హైమారావు, ఎస్‌ఐ షేక్ అమీరుద్దీన్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సాంబశివరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు ఇంట్లో ఉన్న తల్లి, కుమారులను దారుణంగా హత్యచేయడం కలకలం సృష్టించింది. పరారైన ముగ్గురు నిందితులను గ్రామస్తులు, పోలీసులు కలిసి నకరికల్లు మండలం చాగల్లు గ్రామంలో పట్టుకున్నట్లు తెలిసింది.


