మృతదేహంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్‌గా పోస్ట్ చేసిన వైనం
ద్రోహానికి ఫలితం మరణం అంటూ క్యాప్షన్..
తిరువొత్తియూరు: భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేసిన దారుణ ఘటన ఆదివారం ఉదయం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ(32) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి రేస్‌కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్‌లో ఉంటూ టౌ¯Œ హాల్ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆదివారం ఉదయం శ్రీప్రియను కలవడానికి ఆమె భర్త బాలమురుగన్ వచ్చాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు.
ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. అందులో ‘ద్రోహానికి ఫలితం.. మరణం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. శ్రీప్రియ తన నుంచి విడిపోయాక ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల చూశానని, అందుకే కోపంతో హత్య చేశాడని బాలమురుగన్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ హత్య ఆదివారం కోయంబత్తూరులో పెను సంచలనం సృష్టించింది.


