కీలకమైన రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారు
పరిశోధనల్లో భారత్ శరవేగంగా దూసుకెళ్తోంది
ఏదైనా సాధించే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి
‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: యువతలోని అంకితభావమే ‘వికసిత్ భారత్’కు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. అంతరిక్ష నుంచి వ్యవసాయం దాకా ఎన్నో కీలక రంగాల్లో మన యువత అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. ‘మన్ కీ బాత్’128వ ఎపిసోడ్‌లో భాగంగా ఆయన ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. పరిశోధన రంగంలో భారత్ వేగంగా ముందుకు దూసుకెళ్తోందని హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచంలో ఏదైనా సాధించే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని తేల్చిచెప్పారు.
యువతలోని అసమాన శక్తి, బలీయమైన సంకల్పం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయని ఉద్ఘాటించారు. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి వంటి కీలక రంగాల్లో యువతీ యువకులు చక్కటి ప్రతిభ కనబరిచారని కొనియాడారు. కష్టతరమైన విజయాలను సైతం అలవోకగా సాధిస్తున్నట్లు చెప్పారు. అంధుల మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించి, చరిత్ర సృష్టించిందని తెలిపారు. క్రీడల్లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నామని చెప్పారు. 2030లో కామన్వెల్త్ క్రీడలను మన దేశంలో నిర్వహించడానికి బిడ్డింగ్‌లో నెగ్గడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
వైఫల్యం తర్వాత దక్కిన విజయంతో..
‘‘కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో కనిపించిన ఓ వీడియో నా దృష్టిని ఆకట్టుకుంది. అంగారక గ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి, అక్కడే డ్రోన్లను ఎగరవేయడానికి పుణేకు చెందిన యువకులు ప్రయతి్నంచారు. జీపీఎస్ మద్దతు లేకపోవడంతో డ్రోన్లు నేలకూలుతున్నప్పటికీ నిరాశ చెందకుండా వారు మరింత పట్టుదలతో ప్రయతి్నంచారు. ఎట్టకేలకు డ్రోన్లు కొంతసమయం ఎగిరేలా చేశారు. కెమెరాలు, ఇన్–బిల్ట్ సాఫ్ట్‌వేర్‌తోనే వారు ఈ ప్రయోగం నిర్వహించారు. మన యువతలోని ఇలాంటి మహోన్నత సంకల్ప బలమే దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మారుస్తుందనడంలో సందేహం లేదు.
స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో యువత వికసిత్ భారత్ స్వప్నాన్ని కచ్చితంగా సాకారం చేస్తారని నేను విశ్వసిస్తున్నా. ఇస్రో సైంటిస్టులు కూడా చంద్రయాన్–2 వైఫల్యంతో కొంత నిరాశ చెందారు. తర్వాత రెట్టించి ఉత్సాహంతో పనిచేసి చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేశారు. వైఫల్యం తర్వాత దక్కిన విజయం గొప్ప విశ్వాసాన్ని అందిస్తుంది. యువత సంకల్పాన్ని, సైంటిస్టుల అంకితభావాన్ని చూసినప్పుడు నా హృదయం ఉత్సాహంతో నిండిపోతుంది.
అంతరిక్ష రంగంలో ప్రయోగాలకు కొత్త శక్తి
నవంబర్‌లో ఎన్నో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహించుకున్నా. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. పార్లమెంట్ పాత భవనం సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవం జరిగింది. అయోధ్య భవ్య రామమందిరంపై ధర్మధ్వజం ఎగరవేశాం. ఐఎన్‌ఎస్ మాహే నౌక భారత నావికాదళంలో చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజన్ ఎంఆర్‌ఓ సంస్థను హైదరాబాద్‌లో ప్రారంభించాం. అంతరిక్ష రంగంలో ప్రయోగాలకు స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ కొత్త శక్తిని అందించింది. దేశంలో నూతన ఆలోచనా విధానానికి, నవీన ఆవిష్కరణలకు, యువ శక్తికి ఇదొక ప్రతీక.
కాశీ–తమిళ సంగమంలో పాల్గొనండి
వారణాసిలోని నమో ఘాట్‌లో డిసెంబర్ 2 నుంచి జరుగబోయే కాశీ–తమిళ సంగమం నాలుగో ఎడిషన్‌లో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నా. తమిళ భాష నేర్చుకొనే అవకాశం వదులుకోవద్దు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాషను, అత్యంత ప్రాచీన నగరాన్ని అనుంధానించే గొప్ప కార్యక్రమం ఇది. తమిళ భాషతో అనుబంధం ఉన్నవారికి కాశీ–తమిళ సంగమం ఒక ముఖ్యమైన వేదికగా మారుతోంది. తమిళ సోదరులు, సోదరీమణులను ఆహ్వానించడానికి కాశీ ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఇతర కార్యక్రమాల్లోనూ ప్రజలు భాగస్వాములుగా మారాలి. ఏక్ భారత్–శ్రేష్ట భారత్ స్ఫూర్తిని బలోపేతం చేయాలి.
‘వోకల్ ఫర్ లోకల్’ సెంటిమెంట్
నేను ఇటీవలే దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు హాజరయ్యాను. అక్కడ ప్రపంచ దేశాల నేతలకు అందజేసిన బహుమతుల్లో ‘వోకల్ ఫర్ లోకల్’సెంటిమెంట్ కనిపించింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కంచు నటరాజ స్వామి విగ్రహం బహూకరించా. తమళినాడులో చోళుల కాలం నాటి హస్తకళా నిపుణ్యానికి ఇది నిదర్శనం. తెలంగాణలోని కరీంనగర్ కళాకారులు రూపొందించిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానమంత్రికి అందజేశా. సంప్రదాయ లోహ కళాకృతులకు ఇదొక ఉదాహరణ. భారతీయ కళలు, సంప్రదాయాలు, కళాకృతులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నదే నా లక్ష్యం. దీనివల్ల మన కళాకారులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వారి నైపుణ్యానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభిస్తుంది’’అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.


