రెండు ప్రభుత్వ బస్సుల ఢీ.. 11 మంది దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ప్రభుత్వ బస్సులు అతి వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలతో సహా 11 మంది మరణించారు. తిరుప్పూర్ నుంచి కారైక్కుడి వస్తున్న తమిళనాడు రవాణా సంస్థ ఎక్స్‌ప్రెస్ బస్సు, కారైక్కుడి నుంచి దిండుగల్ వైపుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు అతివేగంగా పిల్లయార్‌పట్టి సమీపాన సమత్తువ పురం వంతెన వద్ద ఎదురెదురుగా అతి వేగంగా ఢీకొన్నాయి. దీంతో రెండు బస్సులు నుజ్జునుజ్జయ్యాయి. స్థానికులు గాయపడ్డ వారిని, శిథిలాలలో చిక్కుకున్న వారిని బయటకు తీసి కారైక్కుడి ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మరణించగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలొదిలారు. శివగంగై జిల్లా కలెక్టర్ పొర్కొడి, ఎస్పీ శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వంతెన దాటగానే ఉన్న మలుపు వద్ద రెండు బస్సులు అతివేగంగా దూసుకు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శివగంగ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 40 మంది ఉండగా, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.


