సోనియా నివాసంలో ‘కర్ణాటకం’పై చర్చ
అంతకు ముందే తనకు సీఎంతో విభేదాలు లేవని డీకే స్పష్టీకరణ
2028 ఎన్నికలే తమ లక్ష్యమని వెల్లడి
సాక్షి బెంగళూరు/బెంగళూరు (శివాజీనగర): కర్ణాటకలో సీఎం కుర్చీ మార్పుపై కొద్ది రోజులుగా సాగుతున్న పోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు ఢిల్లీకి వెళ్లకుండానే.. ఢిల్లీలో సోనియా గాంధీ నాయకత్వంలో ఏఐసీసీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వారిద్దరూ ఐక్యతారాగం ఆలí³ంచారు. శుక్రవారం దాకా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ.. పరోక్షంగా బల ప్రదర్శన చేస్తూ.. మరోవైపు హై కమాండ్ నిర్ణయమే శిరోధార్యమని చెబుతూ వచ్చిన వారు.. శనివారం అల్పాహార విందులో సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అధిష్టానం నుంచి అందిన ఆదేశాలో.. లేక ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్యో.. మొత్తానికి తమ లక్ష్యం 2028 ఎన్నికల్లో గెలవడమేనని స్పష్టం చేశారు.
కర్ణాటక సమస్యను పరిష్కరించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాలు పలుమార్లు చర్చించి చివరికి నిర్ణయాన్ని ఆ పార్టీ అధినేత్రి సోనియాకి వదిలేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఢిల్లీలో సోనియా నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది.
ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. శనివారం సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ద్వారా ప్రస్తుతానికి పరిస్థితిని శాంతింపజేసినట్లు నేతలు సోనియా దృష్టికి తీసుకొచ్చారు. కర్ణాటక రాజకీయ పరిణామాలపై మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీకి ప్రత్యేకంగా నివేదించారు. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు కర్ణాటకలోని బెళగావిలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోసీఎం, డీసీఎంలు చర్చించుకుని, కుర్చీ పోరుకు తాత్కాలికంగా స్వస్తి చెప్పేలా అధిష్టానం చక్రం తిప్పడంలో విజయం సాధించింది.
కలిసికట్టుగా పని చేస్తాం
తనకు సీఎం సిద్ధరామయ్యతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తమపై ఆశలు పెట్టుకున్నందున, తామంతా కలసికట్టుగా పని చేయాల్సి ఉందన్నారు. 2028 ఎన్నికలే తమ లక్ష్యం అని చెప్పారు. ‘నేను ఏనాడూ గ్రూపు రాజకీయం చేయను. ఎప్పుడూ ఢిల్లీకి ఒక్కడినే వెళతాను. 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నాయకులే. ఎవరినీ చిన్నచూపు చూడను. గతంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఆఖరిరోజు వరకు ఎంతో ప్రయత్నం చేశాననేది ఆయన తండ్రికి తెలుసు. ఇప్పుడు విమర్శలు చేస్తుంటే చేసుకోనీ. నేను కోపగించుకోను. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన విషయాలు బయటకు చెప్పలేను’ అని తెలిపారు.


