అంతిమ గౌరవం | Bodies of Indians who died abroad can be brought back | Sakshi
Sakshi News home page

అంతిమ గౌరవం

Dec 1 2025 2:41 AM | Updated on Dec 1 2025 2:41 AM

Bodies of Indians who died abroad can be brought back

ప్రభుత్వ చొరవతో స్వదేశానికి మృతదేహాలు 

ఆయా దేశాల్లో అంతిమ సంస్కారాలకూ సాయం 

శ్రమిస్తున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 

11 ఏళ్లలో స్వదేశానికి 57,975 మృతదేహాలు

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్‌ భారత్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో తెలంగాణ, కర్ణాటకకు చెందిన 45 మంది మరణించారు. రక్త సంబం«దీకులు, స్నేహితుల కడచూపునకు నోచుకోనంతగా శరీరాలు అగి్నకి ఆహుతి కావడంతో అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తున్నారు. పరాయి దేశంలో మరణిస్తే చివరిచూపు ఎలా అన్న సందేహం సామాన్యులకు తలెత్తడం సహజం. 2015 నుంచి 2025 అక్టోబర్‌ మధ్య వివిధ దేశాల్లో చనిపోయిన 57,975 మంది భారతీయుల మృతదేహాలు కేంద్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరాయి.

స్వదేశానికి భారత పౌరుల మృతదేహాల తరలింపు, ఆయా దేశాల్లో అంతిమ సంస్కారాలను గౌరవంగా పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన సహాయం, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి భారత రాయబార కార్యాలయాలు, హై కమిషన్లు, కాన్సులేట్‌లు నిరంతరం శ్రమిస్తున్నాయని వివరించింది.  

సమాచారం రాగానే.. 
మరణం గురించి సమాచారం అందిన వెంటనే.. వారి బంధువులను, ఆయా దేశాల అధికారులను సంప్రదించి మరణానికి గల కారణాలను తెలుసుకొని, అవసరమైన లాంఛనాలను పూర్తి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. స్వదేశానికి మృతదేహాల రవాణా, లేదా కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు ఆయా దేశాల్లోనే అంతిమ సంస్కారాలను పూర్తి చేస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మార్చి నెలలో లోక్‌సభకు వెల్లడించింది. బాధిత కుటుంబానికి బీమా, నష్ట పరిహారం త్వరితగతిన అందేలా తోడ్పడుతున్నట్టు తెలిపింది. సహజ మరణాల కేసుల్లో మృతదేహాలు భారత్‌కు రావడానికి దేశాన్ని బట్టి 3 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. అసహజ, ప్రమాదవశాత్తు మరణించిన సందర్భాల్లో పోలీసు విచారణ పూర్తయిన తర్వాతే మృతదేహం స్వదేశానికి చేరుతుంది.  

వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా.. 
వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, హై కమిషన్లు, కాన్సులేట్‌లు ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఫండ్‌ను (ఐసీడబ్ల్యూఎఫ్‌) నిర్వహిస్తున్నాయి. ఎన్నారైలకు కష్ట సమయాల్లో, అత్యవసర సమయాల్లో అత్యంత అర్హత కలిగిన కేసుల్లో, అర్హత కలిగిన సందర్భాల్లో అవసరమైన లాంఛనాలను పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయం కోసం ఈ ఫండ్‌ను వినియోగిస్తారు. మృతదేహాల రవాణాకు ఈ ఫండ్‌ నుంచే ఖర్చు చేస్తారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement