పల్లె పోరులో ఏఐ.. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు గాలం | Telangana Local Body Elections 2025 Contestants used ai technology for voters | Sakshi
Sakshi News home page

పల్లె పోరులో ఏఐ.. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు గాలం

Dec 1 2025 2:09 AM | Updated on Dec 1 2025 6:45 AM

Telangana Local Body Elections 2025 Contestants used ai technology for voters

ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అభ్యర్థులు

 కృత్రిమ మేధ ఆధారిత వీడియోలతో ఓట్లకు గాలం 

ప్రత్యర్థిపై సెటైర్లు.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మీమ్స్‌ 

సెల్‌ఫోన్లు, సోషల్‌ మీడియాలో సందేశాలు, విన్నపాలు  

ప్రత్యేకంగా ఏజెంట్ల నియామకం..విద్యార్థులు సైతం బిజీ

టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పంచాయతీ ఎన్నికల్లోనూ హల్‌చల్‌ చేస్తోంది. పల్లె పోరులో తలపడుతున్న అ భ్యర్థులు ఈ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రచార పర్వంలో సరికొత్త పంథా తో దూసుకెళుతున్నారు. ఓటరు నాడి పట్టే వీడియోలు.. ప్రత్యర్థిపై విరుచుకుపడే సెటై ర్లు.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మీమ్స్‌.. పల్లె జనం మనసును హత్తుకునే అభివాద సందేశాలు.. ఓటర్ల సెల్‌ ఫోన్లలో చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌.. అన్ని సామాజిక మాధ్యమాలను ఏఐ జనరేటెడ్‌ వీడియోలతో మోత మోగిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కృత్రిమ మేధ ఆధారంగా సృష్టించిన వీడియోల్లో ఉంటున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: టింగ్‌ మంటూ వాట్సాప్‌ గంట మోగిందంటే చాలు అది ఓటు గురించి అభ్యర్థి అభ్యర్థన వీడియోనే. సెల్‌కు వచ్చే మెసేజ్‌ను క్లిక్‌ చేస్తే యూట్యూబ్‌కో, ఇన్‌స్టాకో కనెక్టయ్యే లింకులే. గెలిస్తే ఊరునే అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చే ఏఐ ఆధారిత వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఊరు ఊరంతా తనకే మద్దతునిచి్చనట్టు తెలిపే జనరేటెడ్‌ వీడియో, ఆడియోల సాంకేతికత పంచాయతీ పోరులో కనిపిస్తోంది. 

సోషల్‌ మీడియాలో ఫొటో దొరికితే చాలు ఏఐ టెక్నాలజీతో రాజకీయ మైండ్‌గేమ్‌ మొదలవుతోంది. ప్రత్యర్థి అనుయాయులు వచి్చనట్టు, తనకు మద్దతు ఇచ్చినట్టు, కండువా కప్పినట్టు.. ఇలా రకరకాల వీడియోలను ఏఐతో సృష్టిస్తున్నారు. కొన్ని వర్గాలను కలిసినట్టు, మాటామంతీ చేసినట్టు, వారు తమవైపు తిరిగినట్టుగా.. పాత పోటోలను సరికొత్త టెక్నాలజీ సాయంతో మార్చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు వార్డుకో వ్యక్తిని సోషల్‌ మీడియా ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. ఏఐ ఆధారంగా అభ్యరి్థకి అనుకూలమైన ట్రెండ్‌ ఉందని వీడియోలు క్రియేట్‌ చేయడం, ఆ వీడియోలకు లైక్‌లు వచ్చేలా చేయడం వీళ్ళ బాధ్యత. 

ఇతర పక్షాలను దెబ్బతీసే వీడియోలు, ఫోటోల సృష్టిలోనూ ఏఐ పాత్ర కీలకంగా మారింది. ఐదేళ్ళుగా సర్పంచ్‌గా ఉన్నా రోడ్లు, నీళ్ళు, విద్యుత్‌ పరిస్థితి దయనీయంగా ఉందనే సాధారణ ప్రచారానికి బదులు ఏఐ వీడియో సృష్టితో విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు తమ పరపతి పెరుగుతుందనే భావనతో మంత్రులను కలిసినట్టు, స్థానిక ఎమ్మెలేతో పాటు రాజకీయ ప్రముఖులతో ముచ్చటిస్తున్నట్టుగా ఉన్న ఏఐ జనరేటెడ్‌ వీడియోలు రూపొందించి ప్రచారంలో పెడుతున్నారు.  

పెరుగుతున్న యాప్‌ల వాడకం 
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్లే స్టోర్‌లో ఏఐ యాప్‌లు డౌన్‌లోడ్, సబ్‌ప్క్రైబ్‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల రోజుల్లోనే ఫిల్మోరా, ఏఐ జనరేటెడ్‌ చాట్‌ జీపీటీ, యానిమేటర్స్‌ వంటి ఏఐ యాప్‌ల వాడకం పెరిగిందని డిజిటల్‌ స్టూడియో నిర్వాహకుడు నందగోపాల్‌ వర్మ తెలిపారు. ఏఐ జనరేటెడ్‌ వీడియో కోసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారు అనేక రకాల ఆప్షన్లు ఇస్తున్నారని చెప్పాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ జనరేటెడ్‌ వీడియోల సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్నారు. 

సొంత ఊళ్ళో తమ అభ్యర్థి తరపున డిజిటల్‌ ప్రచారం చేసేందుకు, తమ విద్యను స్థానికుల ముందు ఆవిష్కరించేందుకు ఒక అవకాశంగా దీన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు సంపాదనకు సైతం ఇది ఉపకరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థి ప్రసంగాలను అందంగా గ్రామస్తుల ముందుకు తీసుకెళ్ళే వాయిస్, లిప్‌ సింక్‌ వంటి అప్లికేషన్లను వెతికి మరీ పట్టుకుంటున్నారు. కొన్ని యాప్‌లు ఇండియాలో పనిచేయవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీపీఎన్‌ కనెక్షన్‌కు లింక్‌ అవుతున్నారు.  

పార్లమెంట్‌ దాకా ఇదే ట్రెండ్‌! 
ఇక మీదట పల్లె నుంచి పార్లమెంట్‌ దాకా ఎన్నికల ప్రచారంలో ఏఐదే హవా అని తాజాగా చేసిన పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 వరకూ ఏఐ ఆధారిత జరేటెడ్‌ అప్లికేషన్లు 56,682 రూపొందాయని, మరో పదేళ్ళల్లో వీటి సంఖ్య లక్ష దాటుతుందని ఇంపీరియల్‌ ఏఐ స్టడీ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలను డిజిటల్‌ ఏఐ వీడియోలు మరింత ప్రభావితం చేస్తాయని, ఎన్నికల ప్రచార బడ్జెట్‌ను ఇది భారీగా పెంచుతుందని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఏఐ ఆధారిత ప్రచారం కోసం అభ్యర్థులు ప్రత్యేక ఆర్థిక వనరులు సమకూర్చుకునే వీలుందని వెంచర్‌ క్యాపిటల్‌ ఏఐ రిపోర్టు పేర్కొంది. ఏఐ విస్తృత వినియోగం నేపథ్యంలో డీప్‌ఫేక్, సమాచార భద్రత తదిర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏఐ సెక్యూరిటీ రీసెర్చ్‌ సెంటర్‌ పరిశీలనలో తెలిపింది. 

ఇదో రకమైన ఇంటర్న్‌షిప్‌
హైదరాబాద్‌లో ఏఐ ఎంఎల్‌ కోర్సు చేస్తున్నా. మరోపక్క మా గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం పనిచేస్తున్నా. పుస్తకాల్లో చదవిన కోర్సు, ప్రాక్టికల్‌గా నేర్చుకున్నది కలిసి ప్రచార వీడియోలు రూపొందించి ఇస్తున్నాం. దీన్ని ఓ రకమైన ఇంటర్న్‌షిప్‌గా మారుస్తున్నాం. ఓటర్లను మా వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. 
– మద్దిని తేజాకుమార్‌ (ఏఐఎంఎల్‌ విద్యార్థి) 

కొత్తదనం కోసం కొత్త అప్లికేషన్లు 
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ప్రతీ రోజు కొత్తదనం కోరుకుంటున్నారు. కాన్సెప్ట్‌ చెబుతున్నారు. వారికి నచ్చేలా వాటిని అందించేందుకు కొత్త ఏఐ అప్లికేషన్లను నిత్యం వెతుకుతున్నాం. అవసరమైతే రూ.వేలు ఖర్చు చేసైనా వాటిని కొంటున్నాం. జనం ఆసక్తిగా చూసేలా ఈ అప్లికేషన్లు ఉపయోగపడుతున్నాయి.  
– విష్ణువర్థన్‌ రెడ్డి (వరంగల్‌ డిజిటల్‌ స్టూడియో) 

Advertisement
 
Advertisement
Advertisement