సోషల్‌ మీడియా టేకోవర్‌కు చెక్‌ | DOT Check on cyber attacks and sim card rules changed | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్లకు చెక్‌.. కొత్త మార్గదర్శకాలు విడుదల

Dec 1 2025 1:58 AM | Updated on Dec 1 2025 1:58 AM

DOT Check on cyber attacks and sim card rules changed

సిమ్‌ బైండింగ్‌ విధానాన్ని తెచ్చిన ‘డాట్‌’

ఆ సిమ్‌ కార్డు ఉన్న ఫోన్‌ నుంచే సోషల్‌ మీడియా యాప్స్‌ సేవలు

సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ పెట్టేందుకు కొత్త మార్గదర్శకాలు విడుదల

మార్చి నుంచి కొత్త విధానం అమల్లోకి..

సాక్షి, హైదరాబాద్‌: వాట్సాప్, టెలిగ్రాం తదితర సోషల్‌మీడియా యాప్స్‌ టేకోవర్‌కు ఆస్కారం లేకుండా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డాట్‌) కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి సిమ్‌ బైండింగ్‌ విధానం ప్రవేశపెట్టింది. 2026 మార్చి నుంచి అమలులోకి వచ్చే ఈ విధానంతో సైబర్‌ కేటుగాళ్లకు చెక్‌ పడటంతోపాటు పోలీసుల్ని తప్పుదోవ పట్టించే నేరగాళ్లనూ కట్టడి చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాలను ‘డాట్‌’ శనివారం జారీ చేసింది. 

ఇప్పటి వరకు సాగుతోంది ఇలా...
సాధారణంగా ఎవరైనా ఒక స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్, టెలిగ్రాం తదితరాలను యాక్టివేట్‌ చేసుకోవాలంటే ఆ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్‌ కోడ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్‌ను వినియోగదారుడు పొందుపరిచిన నంబర్‌కే యాప్‌ నిర్వాహక సంస్థలు పంపిస్తుంటాయి. సదరు ఫోన్‌లో ఈ యాప్స్‌ పని చేయడానికి ఈ వెరిఫికేషన్‌ కోడ్‌ కీలకమే కానీ.. సిమ్‌తో  పని లేదు. సిమ్‌ కార్డు ఎవరి వద్ద, ఏ ఫోన్‌లో ఉన్నప్పటికీ.. వెరిఫికేషన్‌ కోడ్‌ ఎంటర్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌లో ఆయా యాప్స్‌ యాక్టివేట్‌ అయి పని చేస్తుంటాయి. 

దీన్ని తమకు అనువుగా మార్చుకుంటున్న సైబర్‌ కేటుగాళ్లు, ఇతర నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం సైబర్‌ క్రైమ్‌ చేసే సూత్రధారులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉంటున్నారు. వీళ్లు వాట్సాప్, టెలిగ్రాంలను వాడే బాధితులకు ఎర వేస్తుంటారు. ఇలా చేయడానికి అవసరమైన నంబర్లను సామాన్యులు లేదా కమీషన్ల కోసం ఆశపడి వివరాలు అందించే వారి నంబర్లతో యాక్టివేట్‌ చేసుకుంటున్నారు. తమ ఫోన్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత ఓ నంబర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. వారికి కాల్‌ చేసి రకరకాలు కారణాలు చెప్తూ తమ లావాదేవీల్లో పొరపాటున మీ నెంబర్‌ ఎంటర్‌ చేశామని, దాంతో ఓటీపీ మీకే వస్తోందని అంటున్నారు.

వెరిఫికేషన్‌ కోడ్‌ అందడంతోనే...
ఇది నమ్మిన వాళ్లు ఓటీపీగా భావించి వెరిఫికేషన్‌ కోడ్‌ చెప్పేస్తున్నారు. దీంతో ఆ నంబర్‌తో తమ ఫోన్లలో ఆయా యాప్స్‌ యాక్టివేట్‌ చేసుకుంటున్నారు. ఆ వెంటనే వారి వాట్సాప్, టెలిగ్రాం డీపీలను కాపీ చేసి తమ దానికి పెట్టేస్తున్నారు. దీంతోపాటు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చేస్తూ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ యాక్టివేట్‌ చేస్తున్నారు. దీనివల్ల అసలు వ్యక్తి ఈ విషయం గుర్తించి తన ఫోన్‌లో వాట్సాప్‌ను మరోసారి యాక్టివేట్‌ చేసుకోవాలని భావించినా... అది సాధ్యం కాదు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది నంబర్లను సైబర్‌ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. 

వాట్సాప్‌ బ్యాకప్‌ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా వారి కాంటాక్ట్స్‌తోపాటు చాటింగ్స్‌ను తమ ఫోన్‌లోకి వచ్చేలా చేస్తున్నారు. ఆపై ఆ కాంటాక్ట్స్‌లో కొందరికి అత్యవసరంగా డబ్బు కావాలంటూ సందేశాలు పంపుతూ, మరికొందరికి హ్యాకింగ్‌ లింకులు సెండ్‌ చేస్తున్నారు. వైఫై లేదా వీపీఎన్‌ ద్వారా వీటిని వినియోగిస్తూ తమ ఉనికి బయటపడకుండా పోలీసుల్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఇకపై వారి ఆటలకు చెక్‌
డాట్‌ మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఇలా సిమ్‌ ఓ ఫోన్‌లో ఉన్నప్పుడు ఆయా యాప్స్‌ను అదే ఫోన్‌లోనే యాక్టివేట్‌ చేసుకోవాలి. మరో ఫోన్‌లో యాక్టివేట్‌ చేసుకునే అవకాశం ఉండదు. కచ్చితంగా ఆ సిమ్‌ ఉన్న ఫోన్‌ నుంచి మాత్రమే యాప్స్‌ను వాడాల్సి వస్తుంది. సిమ్‌ బైండింగ్‌గా పిలిచే ఈ విధానం వల్ల యాప్స్‌ దుర్వినియోగం, సైబర్‌ నేరాలు కట్టడి చేసే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు వాట్సాప్‌ వెబ్‌ సైతం ప్రతి ఆరు గంటలకు ఆటోమేటిక్‌గా లాగౌట్‌ అయ్యే విధానమూ అందుబాటులోకి రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement