వనపర్తికి చెందిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి 30 సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో ఆయన తండ్రితో పరీక్షల ఫీజుపై గొడవ జరిగింది. దీనికి కలత చెందిన ఆ విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. నిమిషాల వ్యవధిలోనే సైబర్ పోలీసులకు ఓ అలర్ట్ వెళ్లింది. ఆలస్యం చేయకుండా లోకల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆ విద్యార్థి దగ్గరకు చేరుకొని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
హైదరాబాద్ సాక్షి: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్నో జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. ఏవరో తిట్టారనే కోపంతో లేదంటే జీవితంలో విఫలమయ్యమనే బాధతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడి తమ జీవితాలను ముగించి తమను నమ్ముకున్న వారికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులపై వెంటనే స్పందించి బాధితుల ఆత్మహత్య ప్రయత్నాలను తెలంగాణ సైబర్ పోలీసులు భగ్నం చేస్తున్నారు.
తెలంగాణ సైబర్ పోలీసులు ఆత్మహత్యల్ని నిరోధించడానికి సరికొత్త సాంకేతికతను వాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఆత్మహత్య ప్రేరేపిత వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులకు సమాచారం చేరేలా సిస్టమ్ రూపొందించారు. హెచ్చరికలు రావడంలో తక్షణమే స్పందించి వారి ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ అలర్ట్స్ తో గడిచిన నాలుగు వారాల్లో 12 మందిని బలవన్మరణాలకు పాల్పడకుండా కాపాడినట్లు పోలీసులు తెలిపారు.
..నిజామాబాద్ లో ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహాత్య చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు. ఆ అలర్ట్స్ సైబర్ పోలీసులకు వెళ్లడంతో వెంటనే పోలీసులు అతనిని రక్షించారు. ఇలా గడిచిన 4 వారాలలో 12 మందిని రక్షించినట్లు సైబర్ పోలీసులు తెలిపారు.
సామాజిక మాధ్యమాలలో ఆత్మహాత్యలకు సంబంధించిన ఏదైనా వీడియోలు లేదంటే ఫోటోలు ప్రచురితమైతే దానికి సంబంధించిన సమాచారం వెంటనే సైబర్ పోలీసులకు చేరుతోంది. ఈ విధంగా సమాచారాన్ని అందించేలా పలు సామాజిక మాధ్యమాలతో తెలంగాణ సైబర్ పోలీసు విభాగం ఒప్పందం జరిపినట్లు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.
సోషల్ మీడియాలో ఏవైనా అభ్యంతకర పోస్టులు పెడితే 10 నిమిషాలలోపే మాకు హెచ్చరికలు వస్తాయి. దీంతో మేము సంబంధిత పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేస్తాం అని శిఖా గోయల్ అన్నారు. దీనివల్ల ఇప్పటి వరకూ ఎన్నో ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు.


