హైదరాబాద్: మామిడిపల్లిలోని ప్రాచీనమైన బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అపవిత్రంగా మారుతోంది. దాతల సహకారంతో నూతన సొబగులతో తీర్చిదిద్దబడుతున్న ఈ ఆలయాన్ని అధికారులు మాత్రం కేవలం కాసుల కోణంలోనే చూస్తున్నారు. ఆలయ పరిసరాలలో కొన్నాళ్లుగా సినిమా, సీరియల్, పాటలు, వివాహాది ఫొటోషూట్‌లు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
ఒక్కో దానికి ఒక్కో ధరను నిర్ణయించి దేవాదాయ శాఖ అకౌంట్‌లోనే డబ్బులు జమ చేస్తున్నారు. ఆదాయం సమకూరడం వరకు బాగానే ఉంది. కానీ ఆయా షూటింగ్‌లకు వచ్చే నటులు ఆలయం వద్ద కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా వ్రతాలు చేసే ప్రాంగణం(సాలాహారం)లో దేవతామూర్తుల చిత్రపటాలను ఏర్పాటు చేసినప్పటికీ, అందులోకి షూటింగ్ నటులు ఎంచక్కా బూట్లు, చెప్పులతో కూర్చొంటున్నారు. కొన్ని షూటింగ్‌లైతే ఆలయంలోకి భక్తులు వెళ్లేందుకు వీలు లేకుండా ప్రధాన ద్వారం ముందే చేస్తున్నారు.
ఇక ఆలయ ముందు భాగంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర విగ్రహాలు కలిగిన పార్కులో గతంలో బయటే చెప్పులు వదిలి వెళుతుండగా, కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం అందరు చెప్పులతోనే అందులోకి ప్రవేశిస్తున్నారు. ఇక వివాహం కోసం ఫొటోషూట్‌లకు వచ్చే జంటలు ఆలయ పవిత్రతను మరింత దెబ్బతీస్తున్నాయి. ఆలయ ప్రాకారంపై ఇష్టమైన రీతిలో స్టిల్స్ ఇస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఆలయ పార్కు, శ్రీకృష్ణుడి గోశాల వైపు గ్రిల్స్ విరిగిపోతున్నా కూడా అధికారులకు పట్టడం లేదు. మొత్తం మీద మానసిక ప్రశాంతత కోసం భగవంతుడి సన్నిధిలో గడిపేందుకు వస్తే ఏకాగ్రతకు భంగం కలగుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


