దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో నమ్మకం ఆచారాలు ఉంటాయి. కానీ మారుతీ కార్లను బ్యాన్ చేసిన గ్రామం గురించి తెలుసా? మహారాష్ట్రలోనే ఈ ప్రత్యేకమైన గ్రామం ఉంది. ఇక్కడ మారుతి కార్లపై నిషేధం ఎందుకు? ఆ కార్ల నాణ్యత నచ్చలేదా? లేక ధరలు ఎక్కువని భావించారా? పదండి తెలుసుకుందాం.
మనీ కంట్రోల్ కథనం ప్రకారం రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఆ గ్రామం సాధారణ భారతీయ గ్రామం కాదు. ఆధునిక జీవితం పురాతన నమ్మకాలతో మిళితమైన గ్రామం అని చెప్పవచ్చు. ఈ నిషేధం వెనుక కారణం కారు నాణ్యత కారు, అధిక ధరలూ కాదు. స్థానిక పురాణాల గాథ ప్రకారం సంరక్షక దేవత నింబ దైత్య పట్ల భక్తితో లోతుగా ముడిపడి ఉంది.
ధైర్యాన్నిచ్చి, కష్టాలను తొలగించి, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని భక్తులు బాగా విశ్వసించే శ్రీరాముడికి గొప్ప సేవకుడు భక్తుడు హనుమంతుడి దేవాలయాలు ఉండవు. మారుతిని ఇక్కడ పూజించరు. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. ఇక్కడ రాక్షస రాజైన నింబ దైత్యుడిని పూజిస్తారు. ఇక్కడి ప్రజలు దైత్య నింబ రాక్షసుడుని తమ మూలపురుషుడిగా భావిస్తారు. చిన్నా పెద్దా అందరికీ నింబ దైత్య అంటే బలమైన నమ్మకం. తరతరాలుగా చెప్పుకుంటున్న స్థానిక పురాణం ప్రకారం, హనుమంతుడు , నింబ దైత్య మధ్య ఒకప్పుడు వివాదం జరిగింది. చివరికి రాముడు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత, రాముడు నింబ దైత్యుడికి ఈ గ్రామానికి ఏకైక దైవ సంరక్షకుడిగా ఉండే హక్కును ఇచ్చాడని నమ్ముతారు, హనుమంతుడిని ఈ పాత్ర నుండి తప్పుకోవాలని కోరాడట శ్రీరాముడు. దీని కారణంగా, హనుమంతుడి ఉనికి ఏ రూపంలోనైనా ఉండటం గ్రామానికి దురదృష్టాన్ని తెస్తుందనే నమ్మకం పెరిగింది. ఈ నమ్మకం దేవాలయాలు, పేర్లకు కూడా విస్తరించింది. అలా "మారుతి" అనేది హనుమంతుడికి మరొక పేరు కాబట్టి, ఈ బ్రాండ్ కార్లను అపశకునంగా భావిస్తారట. ఇక్కడ మారుతి కారు బిగ్గరగా హారన్ వినడం కూడా చెడ్డ శకునంగా భావిస్తారు. మూఢనమ్మకం అని అందరూ పిలుస్తున్నప్పటికీ, శతాబ్దాలుగా తమను రక్షిస్తున్న పవిత్ర సంప్రదాయం అంటారు ఈ గ్రామ ప్రజలు.
ఇదీ చదవండి: స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్
గ్రామంలోని ప్రజలు తరచుగా పంచుకునే ఒక ప్రసిద్ధ కథ ఉంది. సంవత్సరాల క్రితం, ఒక స్థానిక వైద్యుడు మారుతి 800 కారును కొన్నాడట. ఆ తరువాత క్లినిక్‌కు వచ్చే రోగుల సంఖ్య అకస్మాత్తుగా తగ్గిపోయింది. దీంతో ఆందోళన పడిన అతగాడు,మారుతి కారుని విక్రయించి, దానిని వేరే బ్రాండ్, టాటా సుమోతో భర్తీ చేశాడు. మారిన తర్వాత, అతని ప్రాక్టీస్ సాధారణ స్థితికి వచ్చిందట.


