ఈఓఎస్–ఎన్1 ఉపగ్రహం..
ఉదయం 10.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్
అనంతరం 17.54 నిమిషాలకు కక్ష్యలోకి ఈఓఎస్–ఎన్1తో పాటు మరో 15 బుల్లి ఉపగ్రహాలు
ఆదివారం మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి సోమవారం ఉదయం 10.17 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ–62 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి 22 గంటల ముందు.. ఆదివారం మధ్యాహ్నం 12.17 గంటలకు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ కౌంట్‌డౌన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆదివారం సాయంత్రం నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. రాత్రి 12 గంటల తరువాత రెండోదశలో 41.8 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ చేపట్టారు. ఆ తరువాత రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఈ ప్రయోగం ద్వారా 1,485 కిలోల బరువు కలిగిన ఈఓఎస్–ఎన్1 (అన్వేష్) ఉపగ్రహాన్ని, మరో 15 చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చిన్న ఉపగ్రహాల్లో మనదేశంలోని మూడు స్టార్టప్ కంపెనీలకు చెందిన ఏడు, విదేశాలకు చెందిన ఎనిమిది ఉన్నాయి. వీటిని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షణలో వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నారు. రాకెట్ ప్రయోగించిన తరువాత 17.54 నిమిషాలకు స్పెయిన్ దేశానికి చెందిన బుల్లి ఉపగ్రహం మినహా మిగిలిన ఉపగ్రహాలను భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు.
ఈ దఫా రాకెట్‌లోని నాలుగోదశ (పీఎస్–4)తో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత రాకెట్‌లోని నాలుగోదశను క్రమేణ కిందకు దించుతూ రెండుసార్లు రీస్టార్ట్ చేస్తారు. ఆ తరువాత స్పెయిన్‌లోని స్పానిష్ స్టార్టప్ సంస్థకు చెందిన కెస్ట్రెల్ ఇనిíÙయల్ టెక్నాలజీ, డిమాన్‌్రస్టేటర్ (కిడ్) అనే పేలోడ్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెడతారు. అనంతరం అది భూ వాతావరణంలోకి ప్రవేశించి దక్షిణ ఫసిఫిక్ మహాసముద్రంలో పడిపోయే వి«ధంగా ప్రణాళిక రూపొందించారు.
షార్ రోడ్డులో ముమ్మర తనిఖీలు
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌కి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. షార్‌కి వెళ్లే మార్గంలోని అటకానితిప్ప వద్ద భద్రతాదళాలు తనిఖీ చేస్తున్నాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా వస్తున్న పర్యాటకుల ముసుగులో ఎవరైనా వచ్చే అవకాశం ఉండడంతో తనిఖీలను ముమ్మరం చేశారు. షార్ ప్రధాన గేటు వద్ద కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ప్రయోగం అయ్యే వరకు బంగాళాఖాతంలో, పులికాట్ సరçస్సులో ఎవరూ చేపలవేటకు వెళ్లరాదని షార్ అధికారవర్గాలు ప్రకటించాయి. సముద్రం వైపు కోస్ట్‌గార్డ్స్ గస్తీ చేపట్టారు. షార్, అటవీప్రాంతంలో షార్‌లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి.
డీఆర్‌డీవో రూపొందించిన ఈఓఎస్–ఎన్1
పీఎస్‌ఎల్‌వీ సీ–62 ద్వారా ప్రయోగించనున్న ఈఓఎస్–ఎన్1 (అన్వేష్) ఉపగ్రహాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందించింది. దీన్ని ప్రధానంగా దేశ రక్షణ కోసం ఉపయోగించనున్నారు. గూఢచారి ఉపగ్రహాల కుటుంబంలో ఇది అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉపగ్రహం.


