అదనపు రుసుము లేకుండానే టికెట్ల రద్దు  | DGCA revises ticket refund rules for airlines | Sakshi
Sakshi News home page

అదనపు రుసుము లేకుండానే టికెట్ల రద్దు 

Feb 27 2026 5:44 AM | Updated on Feb 27 2026 5:44 AM

DGCA revises ticket refund rules for airlines

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) శుభవార్త అందించింది. విమాన టికెట్ల బుకింగ్, రీఫండ్‌ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఇకపై టికెట్‌ బుకింగ్‌ చేసిన తర్వాత 48 గంటల్లోగా ఆ టికెట్‌ను రద్దు చేసుకున్నా లేక మార్పు చేసుకున్నా అదనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. 

ఒకవేళ దేశీయ(డొమెస్టిక్‌) విమాన టికెట్ల బుకింగ్‌ విషయంలో ప్రయాణ తేదీ ఏడు రోజుల్లోపు ఉంటే ఈ వెసులుబాటు వర్తించదు. అంతర్జాతీయ విమాన టికెట్ల బుకింగ్‌కు ప్రయాణ తేదీ 15 రోజుల కంటే తక్కువ ఉండరాదు. విమాన ప్రయాణాన్ని మరింత సులభతరంగా మార్చడానికే నిబంధనల్లో సవరణలు చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసిన తర్వాత ప్రయాణికుడు తన పేరులో తప్పు దొర్లినట్లు గుర్తిస్తే 24 గంటల్లోగా ఉచితంగా మార్పు చేసుకోవచ్చు. 

ఇందుకు విమానయాన సంస్థలు అదనపు రుసుము వసూలు చేయకూడదని డీజీసీఏ ఆదేశించింది. టికెట్‌ను రద్దు చేసుకున్న ప్రయాణిలకు రుసుము తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విమానయాన సంస్థలు 14 పని దినాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని డీజీసీఏ తేలి్చచెప్పింది. టికెట్ల రీఫండ్‌ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎయిర్‌లైన్స్‌ సంస్థలు సరిగ్గా స్పందించడంలేదని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

 అందుకే 14 పనిదినాల నిబంధనను డీజీసీఏ నిర్దేశించింది. టికెట్ల బుకింగ్‌ విషయంలో ప్రయాణికులకు 48 గంటల ‘లుక్‌–ఇన్‌ ఆప్షన్‌’ఇవ్వాలని స్పష్టంచేసింది. రెండు రోజుల వ్యవధిలో అదనపు రుసుము చెల్లించకుండానే టికెట్‌ను రద్దు చేసుకోవచ్చని, మార్పు చేసుకోవచ్చని పేర్కొంది. 48 గంటలు దాటితే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది. విమానంలో ఉన్నప్రయాణికుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సిన అత్యవసర పరిస్థితి తలెత్తితే టికెట్‌ సొమ్మును రీఫండ్‌ చేయాలని డీజీఏసీ వెల్లడించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement