సంస్థ హెడ్డాఫీసులో కార్యకలాపాల పరిశీలన
సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను విచారించిన అధికారులు
ప్రయాణికులకు పరిహారమిస్తామన్న ఇండిగో
గురువారం మరో 200 సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ/ముంబై: వేలాదిగా విమాన సర్వీసు లను రద్దు చేసి, తీవ్ర సంక్షోభానికి తెరలేపిన ఇండిగోపై అధికారులు సమీక్ష పెంచారు. ఇండిగో ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అధికారులు ఆ సంస్థ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులకు టిక్కెట్ల రుసుమును వాపసు చేయడంపైనా సమీక్ష జరిపారు. అదేవిధంగా, ఈ శీతాకాల సీజన్‌లో ఇండిగో నడపాల్సిన 2,300 విమానాల్లో 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.
ఇలా ఉండగా, విమానాల రద్దుతో ఇబ్బందులు పడిన ప్రయాణికులకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారాన్ని ట్రావెల్ వోచర్ల రూపంలో అందజేస్తామని ఇండిగో గురువారం ప్రకటించింది. వీటిని ఏడాదిలోగా వాడుకోవచ్చంది. అయితే, ఈ వెసులుబాటును ఎందరికి ఇస్తున్నదీ వివరించలేదు. అదేసమయంలో, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన 200కు పైగా విమాన సర్వీసులను గురువారం రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది.
తాము సుమారు 3 లక్షల ప్రయాణికుల కోసం 1,950 విమానాలను నడపగలమని పేర్కొంది. సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను డీజీసీఏ ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ గురువారం ప్రశ్నించింది. శుక్రవారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. భారీ సంఖ్యలో విమానాల రద్దుకు దారితీసిన వాస్తవ పరిస్థితులపై మరింత లోతుగా ఈ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఇండిగోలో పైలట్ల షెడ్యూల్ నిర్ణయం, రోస్టర్ విధానంలో లోపాలు, పైలట్ల కోసం కేంద్రం జారీ చేసిన నిబంధనల అమలుకు ఇండిగో చేపట్టిన సన్నద్ధతా చర్యల వంటి వాటిపై కమిటీ క్షుణ్నంగా పరిశీలన జరపనుంది.


