దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాల నేపథ్యంలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కృషి చేసినట్లు తెలిపింది. ఈ ప్రయత్నంలో రోజువారీ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 65,000 మంది ఉద్యోగులు కీలకమైన సహకారాన్ని అందించారని ఇండిగో పేర్కొంది.
డిసెంబర్ 2న ప్రారంభమైన సామూహిక విమాన రద్దులు, ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యాన్ని పరిష్కరించడానికి ఇండిగో యాజమాన్యం ప్రయత్నించింది. ఈ సంక్షోభ సమయంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్, తన బృందం పరిస్థితులను సద్దుమణిగించేందుకు చర్యలు తీసుకున్నారు. నిన్న విమాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. ఇండిగో బోర్డు మొత్తం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ప్రభుత్వ జోక్యం: డీజీసీఏ చర్యలు
ఈ అసాధారణ అంతరాయాలపై కేంద్ర విమానయాన శాఖ స్పందించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని ఇండిగో సీనియర్ నాయకత్వానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాక, ఇండిగో విమాన కార్యకలాపాలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్‌లో 10% తగ్గించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనికి అనుగుణంగా, విమానయాన సంస్థ తన నెట్‌వర్క్‌లోని అన్ని గమ్యస్థానాలకు సేవలను కొనసాగిస్తూనే స్థిరీకరణ కోసం షెడ్యూల్‌లో కోతలు పెట్టింది.
ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ


